Jun 17 2021 @ 20:41PM

సినిమా హీరోగా రాణించాలి: ‘మిస్టర్‌ ఇండియా’ గోపీనాథ్‌

చెన్నై నగరానికి చెందిన గోపీనాథ్‌ రవి అనే యువకుడు మోడలింగ్‌ రంగంలో ‘మిస్టర్‌ ఇండియా’ అనే టైటిల్‌ విజేతగా నిలిచాడు. ఈ టైటిల్‌ గెలుచుకున్న తర్వాత ‘పీపుల్స్‌ ఛాయిస్‌’ అనే పోటీలో కూడా మంచిమార్కులే వచ్చాయి. పైగా ‘మిస్టర్‌ ఇండియా’ టైటిల్‌ను ఇప్పటివరకు సౌత్‌ ఇండియాకు చెందిన ఏ ఒక్క యువకుడు గెలుచుకోలేదు. కానీ, గోపీనాథ్‌ రవికి మాత్రం అలాంటి అరుదైన అవకాశం దక్కింది. దీంతో ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా గోపీనాథ్‌ రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయాడు. అదేసమయంలో ఆయనకు కోలీవుడ్‌లో కూడా సినిమా అవకాశాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్‌ నటుడు ప్రభుదేవాతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.


దీనిపై గోపీనాథ్‌ స్పందిస్తూ.. కాలేజీ రోజుల నుంచే తనకు మోడలింగ్‌లో అమితమైన ఆసక్తి వుండేదని, దీంతో ఒక వైపు చదువు, మరోవైపు మోడలింగ్‌పై దృష్టికేంద్రీకరించానని, ఈ క్రమంలో ‘మిస్టర్‌ ఇండియా’ పోటీల గురించి తెలుసుకుని అందులో పాల్గొన్నానని, ఇందుకోసం చాలా కష్టపడ్డానని, ఆ కష్టానికి ఫలితం దక్కిందని తెలిపాడు. మోడలింగ్‌ రంగంలో రాణిస్తుండగానే సినిమాల్లో నటించే అవకాశం వరించిందని, ప్రభుదేవా హీరోగా నటించే ‘బగీరా’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నట్టు తెలిపాడు. అయితే, సినిమా హీరోగా రాణించాలన్నదే తన కోరిక అని, అందుకోసం నటనపరంగా మెళకువలు నేర్చుకుంటూ సినీ అవకాశాల కోసం కృషిచేస్తానని గోపీనాథ్‌ తన అభిమతాన్ని తెలిపాడు.