భగవంతుడికి...శ్రోతలకు మధ్య పూజారిని!

ABN , First Publish Date - 2021-03-28T05:40:19+05:30 IST

గోపీసుందర్‌ సంగీతం...‘కళ్లుమూసి తెరిచే లోపే’ గుండెలోకి చేరుతుంది! ఉన్నట్టుండి ఆ గుండె వంద కొట్టుకుంటుంది! ‘ఇంకేం ఇంకేం కావాలే?’ అంటే...మళ్లీ మళ్లీ వినాలనిపించే భలే భలే మెలోడీలెన్నో... ‘ఎన్నో ఎన్నో’ అంటుంది! సంగీత కళాకారుడిగా

భగవంతుడికి...శ్రోతలకు మధ్య పూజారిని!

గోపీసుందర్‌ సంగీతం...‘కళ్లుమూసి తెరిచే లోపే’ గుండెలోకి చేరుతుంది! ఉన్నట్టుండి ఆ గుండె వంద కొట్టుకుంటుంది! ‘ఇంకేం ఇంకేం కావాలే?’ అంటే...మళ్లీ మళ్లీ వినాలనిపించే భలే భలే మెలోడీలెన్నో... ‘ఎన్నో ఎన్నో’ అంటుంది! సంగీత కళాకారుడిగా సుమారు పాతికేళ్లు ప్రస్థానమాయనది. ఈ ప్రయాణంలో ‘మజిలీ’ల గురించి గోపీసుందర్‌తో ప్రత్యేక సంభాషణ... ‘నవ్య’ పాఠకుల కోసం!


అవార్డు వస్తుందని ఆలోచించిన ప్రతిసారీ రాలేదు. మలయాళ సినిమా ‘ఉస్తాద్‌ హోటల్‌’ మంచి సినిమా. దానికి అవార్డు వస్తుందని నా స్నేహితులు చెప్పారు. మంచి సంగీతం అందించానని అన్నారు. స్నేహితులు అవార్డు వస్తుందని చెబితే... మనిషిగా ఆశిస్తాం కదా! మనలో ఫీలింగ్‌ మొదలవుతుంది. కానీ, రాలేదు. నాకు కేరళ స్టేట్‌ అవార్డు (2017లో... ‘టేక్‌ ఆఫ్‌’ నేపథ్య సంగీతానికి) కంటే ముందు నేషనల్‌ అవార్డు (2014లో... ‘1983’ నేపథ్య సంగీతానికి) వచ్చింది. ‘టేక్‌ ఆఫ్‌’కి అవార్డు వచ్చినప్పుడు ‘ఇది ఎన్నో కేరళ స్టేట్‌ అవార్డు?’ అని అడిగారు. ‘మొదటిది’ అని చెబితే... ఎవరూ నమ్మలేదు. అవార్డు కంటే ప్రజల ప్రశంసలే ముఖ్యమని అనుకున్నా.


  • సంగీతంలో ప్రతిదీ నాకు స్ఫూర్తే. దేవుడు నాకు మంచి చెవులు ఇచ్చాడు. మీతో మాట్లాడుతూనే దూరంగా పక్షి చేస్తున్న కిలకిలలు వినగలను. 
  • రోడ్డు మీద బండి వెళ్తూ చేసే శబ్దాన్ని గమనించగలను. జీవితంలో ప్రతిదీ గమనిస్తా.  
  • దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌... ప్రతి ఒక్కరి పాటల్నీ నేను వింటా. తమన్‌ చేసిన ‘బుట్టబొమ్మ’తో పాటు ‘అల... వైకుంఠపురములో’ చిత్రంలో మిగతా పాటలూ నచ్చాయి.
  • పాతికేళ్లుగా... ఆడియో-వీడియో రంగాల్లో ప్రతి రెండు మూడేళ్లుకు కొత్త టెక్నాలజీ వస్తోంది. అందుకు తగ్గట్టుగా నన్ను నేను అప్‌డేట్‌ చేసుకుంటూ, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ వస్తున్నా. టెక్నిషియన్‌గా కొత్త విషయం నేర్చుకోవడం నా దినచర్యలో ఓ భాగం.


పాతికేళ్లు... ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?

నేనెప్పుడూ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోను. జీవిత ప్రయాణాన్ని, అలాగే నన్నూ విశ్లేషించుకోవడమూ నాకు ఇష్టం ఉండదు. జీవితంలో ముందుకు మాత్రమే చూస్తా. విశ్లేషించడం మొదలుపెడితే... ముందు విసుగు వస్తుంది. తర్వాత నా వయసు గుర్తొస్తుంది. నేను ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నానో తెలుస్తుంది. అప్పుడు సమస్యల్లో పడతాను. అందుకని, నాకు నచ్చినవి చేస్తూ ముందుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తా. వెళ్లిపోయిన క్షణాల గురించి ఆలోచించను.


తెలుగులో మీ సంగీతానికి అభిమానులు ఉన్నారు. మలయాళం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ అభిమానాన్ని ఊహించారా?

సంగీతానికి భాష లేదు కదా! మలయాళంలో నేను మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. తెలుగు సినిమాకు చేసే అవకాశం వచ్చిప్పుడు ‘డిచక్‌ డిచక్‌... అంటూ చేస్తే చాలు’ అని అనుకోలేదు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘ఊపిరి’, ‘మజ్ను’, ‘నిన్ను కోరి’ వంటి చిత్రాలు  నా మ్యూజిక్‌ క్యారెక్టర్‌ మార్చుకునేలా చేశాయి. ‘ఇటువంటి పాటలు చేస్తేనే తెలుగులో నీకంటూ ఓ స్థానం ఏర్పడుతుంది’ అని నాకెవరూ చెప్పలేదు. నా సంగీతం ఎలా ఉండాలని అనుకున్నానో... అలాగే చేశా. తెలుగు ప్రేక్షకులూ నన్ను నన్నుగా స్వీకరించారు. అలాగే, నా సంగీతాన్ని! భగవంతుడి ఆశీర్వాదమిది.


మీరు మెలోడీలు బాగా చేస్తారని పేరుంది! మాస్‌ బీట్లు చేయాలని లేదా?

నిజమే! తెలుగులో నా మెలోడీలకు మంచి పేరొచ్చింది. అందువల్ల, అవి  మాత్రమే అందిస్తానని అనుకుంటున్నారు. నిజానికి, కేరళలో నేను మాస్‌ మసాలా సంగీత దర్శకుణ్ణి. తెలుగులోనూ మంచి విజయం సాధించిన ‘మన్యం పులి’కి నేనే సంగీతం అందించా. అందులో టైటిల్‌ ట్రాక్‌ పాడిందీ నేనే. తెలుగులో మాత్రం నాపై క్లాస్‌ ముద్ర పడింది. అంత మంచి మెలోడీలకు ఎలా కంపోజ్‌ చేశారంటే... నా దగ్గర సమాధానం లేదు. గాడ్‌ గిఫ్ట్‌ అంతే! పైనుంచి ఎవరో నన్ను నడిపిస్తున్నారని భావిస్తున్నా. నేను జస్ట్‌ మీడియేటర్‌ మాత్రమే. స్వామిజీ ఇచ్చిన వరాన్ని పాట రూపంలో నేను ప్రజలకు ఇస్తున్నానంతే! (నవ్వుతూ) పూజారి అన్నమాట. ఓ బాణీ ఇచ్చినప్పుడు దర్శకుడు వింటారు కదా! అప్పుడు అతని హావభావాలను గమనిస్తా. నిజాయతీగా అతని హృదయం మంచి బాణీ కోరుతుంటే, శ్రోతలకు మంచి పాట అందించాలని తపిస్తే... భగవంతుడికి తెలిసిపోతుంది. ఇచ్చేస్తాడు.


తెలుగులో మాస్‌ కమర్షియల్‌ సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నారా?

కమర్షియల్‌ అని కాదు... మంచి సినిమాలు చేయాలని ఆలోచిస్తా. చిన్నా-పెద్ద, కమర్షియల్‌ సినిమా... వంటివి నేను నమ్మను. నా వరకూ రెండే సినిమాలున్నాయి. ఒకటి... మంచి సినిమా. రెండు... ఫ్లాప్‌ సినిమా. మంచి సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు పరుగు తీస్తుంది. ఫ్లాప్‌ అయితే థియేటర్‌ బయటకు పరుగు తీస్తుంది. రెండూ రన్‌ అవుతాయి.


సంగీత దర్శకుడిగా మీరేం కోరుకుంటున్నారు?

సంగీత దర్శకుడికి తాను చేయాలనుకున్న విధంగా సంగీతం చేసే స్వేచ్ఛ ఉండటం ముఖ్యం. మ్యూజిక్‌ కంపోజర్‌ అంటే... సినిమాలో డైరెక్షన్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ను డిసైడ్‌ చేసేవాడు. ‘నువ్‌ ఇలా చెయ్‌, అలా చెయ్‌. నాకు అదే నచ్చుతుంది’ అని ఇతరులు జోక్యం చేసుకోకూడదు. చిన్న చిత్రమైనా సరే... ప్రశాంతత కావాలి. ఇప్పుడు నాకు 43 ఏళ్లు. నా కెరీర్‌లో 150కు పైగా చిత్రాలు చేశా. జాతీయ అవార్డూ వచ్చింది. నా విజయాలు చూసి నేను పొంగిపోను. అపజయాలు వస్తే కుంగిపోను.


నచ్చిన కథలు, సినిమాలు ఎంపిక చేసుకొనే స్థితిలో ఇప్పుడు  ఉన్నానని అనుకుంటున్నారా?

సినిమా చేయమని నా దగ్గరకు ఎవరు వచ్చినా ధనలక్ష్మి నా ఇంటికి వచ్చినట్టు భావిస్తా. అందుకని, ఎవరితోనూ చేయనని చెప్పను. నా దృష్టిలో  నాకు నచ్చిన చిత్రాలు ఎంపిక చేసుకొనే స్థితిలో నేను లేను. హీరోలు, దర్శక - నిర్మాతలే నన్ను ఎంపిక చేసుకోవాలి. కథ విన్నాక నా అభిప్రాయం చెబుతా. నచ్చినా నచ్చకపోయినా ఓ టెక్నిషియన్‌గా పని చేస్తా. నాకు తిండి పెట్టేది ఈ పనే కదా.


సోషల్‌ మీడియాలో సంగీత దర్శకులపై ట్రోల్స్‌ ఎక్కువ వస్తున్నాయి. అవి గమనిస్తుంటారా?

కేరళలో నన్ను  ‘కాపీసుందర్‌’ అని కొంతమంది  అంటుంటారు. కొన్ని సందర్భాల్లో దర్శక-నిర్మాతల కోరిక మేరకు ఫలానా పాట తరహాలో చేయక తప్పదు. ఇట్‌ హ్యాపెన్స్‌! మా పనిలో అదో భాగం. అదృష్టవశాత్తూ... తెలుగులో అటువంటి సందర్భాలు ఎదురు కాలేదు. ఈ రోజు పది ట్యూన్లు కావాలని అడిగితే... నేను ఇవ్వగలను. గంటలో నాలుగు ట్యూన్లు చేయమని చెప్పినా చేస్తా. నేను రోబో, మిషన్‌ లాంటోణ్ణి. మ్యూజిక్‌ కంపోజిషన్స్‌ కోసం నా దగ్గరకు ఎవరొచ్చినా ‘చాలా ఫాస్ట్‌గా చేశారు’ అంటుంటారు. నా అనుభవం అటువంటిది మరి. పాతికేళ్లుగా ఒకే పని చేస్తుంటే... అందులో మాస్టర్‌ అవుతాం కదా!


దర్శక-నిర్మాతలు ఫలానా ట్యూన్‌ కాపీ చేయమని, లేదంటే దాని స్ఫూర్తితో చేయమని అడిగితే... ‘నో’ చెప్పడం కష్టమా?

నా వరకూ... ఇదో ఉద్యోగం! దర్శక-నిర్మాతలు సంతృప్తి చెందడం ముఖ్యం. ఒకవేళ దర్శకుడు అసంతృప్తి చెందితే? నా ఉద్యోగం పోతుంది. అందుకని, నా కెరీర్‌ గురించీ జాగ్రత్త పడతా. నా దర్శకుడు సంతోషంగా ఉండాలని అనుకుంటా. ‘మీకు సేమ్‌ ట్యూన్‌ కావాలా? ఇస్తా! అయితే, నా పేరు కంపోజర్‌గా కాకుండా... అరేంజర్‌గా వేయండి’ అని చెప్తా. 


‘ప్రేమమ్‌’ ఆడియో ఫంక్షన్‌లో మలయాళ సంగీత దర్శకుడి బాణీలు ఉపయోగించినందుకు అతని గురించి ప్రత్యేకంగా చెప్పారు కదా! ఎందుకలా?

పాటను ఒక్కరే రాయాలి... సినిమాకు ఒక్కరే సంగీతం అందించాలి... వంటివి నేను నమ్మను. ప్రేక్షకుల హృదయాన్ని మీటేది సంగీతం! సినిమాకు మనం అందించేది ఏదైనా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేట్టు ఉండాలి. ‘ప్రేమమ్‌’లో కొన్ని బాణీలకు మాతృక (మలయాళ ‘ప్రేమమ్‌’)లో రాజేశ్‌ మురుగేశన్‌ స్వరపరిచినవి తీసుకున్నాం. నేను కొన్ని బాణీలు చేశా. ఎవరి క్రెడిట్‌ వాళ్లకు ఇచ్చేయాలనేది నా సిద్ధాంతం. అందుకని, ‘ప్రేమమ్‌’ ఫంక్షన్‌లో రాజేశ్‌ గురించి మాట్లాడా. నా స్వభావమే అంత! ఉదాహరణకు... ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో ‘గుచ్చే గులాబీ’ గీతాన్ని అనంత శ్రీరామ్‌, శ్రీమణి రాశారు. ఇద్దరికీ క్రెడిట్‌ ఇచ్చాం. ఎవర్నీ తక్కువ చేయకుండా ఇద్దరికీ గౌరవం ఇవ్వడమే మా ఉద్దేశం. ఎవరైనా పాటలో ఒక్క లైన్‌ రాసినా, సినిమాలో ఓ ట్యూన్‌ చేసినా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే.


ఇంకొకరు హిట్‌ సాంగ్‌ చేస్తే... మీకు జలసీ ఉండదా?

ఉండదని ఎవరు చెప్పారు? అందరిలా నాకూ జలసీ ఉంటుంది. జంతువుల్లో లేనిదీ.. మనుషుల్లో ఉన్నదీ... ఓ అందమైన లక్షణం ఏంటంటే... సెల్ఫ్‌ కంట్రోల్‌. జలసీకి గురైతే... దాన్ని ఎలా అధిగమించాలి? కొందరు మెడిటేషన్‌ చేయమని చెబుతారు. కానీ, నేను మరింత హార్డ్‌ వర్క్‌ చేస్తా. ఎవరైనా నా కంటే మంచి మ్యూజిక్‌ చేస్తే మనిషిగా జలసీకి గురవుతా. తర్వాత అంతకంటే మంచి ట్యూన్‌, మ్యూజిక్‌ చేయడానికి ప్రయత్నిస్తా.


సినిమా విజయాల్లో పాటలు ఎంతో కీలక భూమిక పోషిస్తున్నాయి. మరి, సంగీత దర్శకుల శ్రమకు తగిన పారితోషికం లభిస్తోందా?

ఈ ప్రశ్న ఎవర్ని అడుగుతున్నామనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది. నన్ను అడిగితే... ఇక్కడ ఓ ఆర్టిస్ట్‌ హోటల్‌ బిల్‌ ఎంత అవుతుందో? అంతలో మలయాళంలో పాటలు, నేపథ్య సంగీతం చేసి ఇవ్వాలి. తెలుగులో స్టార్‌ హీరో అసిస్టెంట్లకు పది రోజులకు ఇచ్చే పేమెంట్స్‌... మలయాళ మూవీ మ్యూజిక్‌ బడ్జెట్‌కి సమానం అని చెప్పవచ్చు. అందులోనే గాయనీగాయకులు, కళాకారులకు డబ్బులు ఇవ్వాలి. ఎగ్జాగరేట్‌ చేసి చెప్పడం లేదు... నిజం చెబుతున్నా. మీరు ఈ ప్రశ్న అడిగితే... నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా (నవ్వులు). మలయాళంలో సంగీత దర్శకులకు ఇచ్చే  పారితోషికం తక్కువే. అందులోనే సినిమాలు చేయాలి. ‘బెంగళూరు డేస్‌’ వంటివీ తక్కువ పారితోషికంలోనే చేశా. క్రియేటివిటీ, టాలెంట్‌ ఉంటేనే మలయాళ పరిశ్రమలో మనుగడ ఉంటుంది. నా దగ్గరకు ఎవరొచ్చినా సంగీతం ఇస్తా. నా దృష్టిలో తెలుగు ఇండస్ట్రీ పెద్దది. నేను డిమాండ్‌ చేయను. నేను ఐదు లక్షల్లోనూ ఆల్బమ్‌ ఇవ్వగలను. యాభై లక్షల్లోనూ ఇవ్వగలను. నేను ఐదు లక్షలతో జీవించగలను. అంతకంటే ఎక్కువ ఇస్తే... మంచి పాట, సంగీతం కోసమే ఖర్చుపెడతా. ఒకవేళ రూ. కోటి ఇచ్చారనుకోండి... మంచి సంగీతం కోసం నేనేం చేయగలనో ఊహించండి.

సత్య పులగం

Updated Date - 2021-03-28T05:40:19+05:30 IST