ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-09-03T06:51:34+05:30 IST

తెలుగుదేశం పార్టీలో..

ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలి

శాంతించిన గోరంట్ల

చంద్రబాబుతో భేటీ

సద్దుమణిగిన వివాదం

రాజీనామా అస్త్రం వెనక్కి 

పార్టీ కోసమే పనిచేస్తా!


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో సీనియర్లను గౌరవించడం లేదనే ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎట్టకేలకు శాంతించారు. దీంతో గత కొద్దిరోజులుగా అలజడి సృష్టించిన ఈ వ్యవహారం సద్దుమణిగినట్టు అయింది. కొద్దిరోజుల కిందట గోరంట్ల అలక వహించండంతో చంద్రబాబు నేరుగా మాట్లాడడంతోపాటు కొందరు పెద్దలను చర్చలకు పంపిన సంగతి తెలిసిందే. ఆ చర్చల సందర్భంగా చంద్రబాబుతోనే పార్టీలోని సమస్యలేమైనా ఉంటే చెప్పేటట్టు భేటీ ఏర్పా టుచేస్తామని అప్పుడు చర్చలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తదితరులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం  చంద్రబాబుతో గోరంట్ల భేటీ జరిగింది. గుంటూరులో మధ్యాహ్నం చంద్రబాబుతో చాలాసేపు గోరంట్ల సమావేశమయ్యారు.


ఆయనతోపాటు మాజీ డిప్యూటీ చైర్మన్‌ రాజప్ప, జవహర్‌,  గద్దె రామ్మోహన్‌, ఎన్‌.రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. అన్నీ సానుకూలంగా జరిగాయి.  గోరంట్ల చెప్పిన సూచనలు చంద్రబాబు విన్నారు. పెద్దల సూచనలు అవసరమని కూడా చెప్పారు. దీంతో కథ సుఖాంతమైంది. అనంత రం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి వెళ్లిపోవాలనుకున్నా. పార్టీ లోటుపాట్లపై గళమెత్తాను. ప్రభుత్వంపై పార్టీ ఎలా ఫైట్‌ చేయాలనేది అధినేతకు సూచనలు చేశానన్నారు. తాను చివరి వరకు పార్టీ కోసమే పనిచేస్తానని ఆయన స్పష్టంచేశారు. ఇక స్థానికంగా నెలకొన్న సమస్యలు కూడా చంద్రబాబు వద్ద చర్చకు వచ్చినట్టు సమాచారం. ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వవలసిన బాధ్యత పార్టీకి ఉందనే చర్చ కూడా జరిగింది. వివాదం సద్దుమణగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2021-09-03T06:51:34+05:30 IST