‘గోరంట్ల’ శాంతించినట్టే..!

ABN , First Publish Date - 2021-08-22T05:45:27+05:30 IST

తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు..

‘గోరంట్ల’ శాంతించినట్టే..!

ఇక్కడి సమస్య పరిష్కార బాధ్యత అచ్చన్నదే


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి శాంతించినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమహ్రేందరంలో సీనియర్లకు గుర్తింపులేదని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విధానాలు అమలు చేయడంలోనూ కొన్ని మార్పులు రావాలని, అధినేతలు అందుబాటులో ఉండాలని, అలా లేకపోతే తానెందుకని, పార్టీ అధిష్ఠానంపై గోరంట్ల రాజీనామా అస్త్రం ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీంతో అధిష్ఠానం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. నేరుగా చంద్రబాబు గోరంట్లకు ఫోన్‌ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. రెండు దఫాలుగా మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, పశ్చిమగోదావరి మాజీ జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు గోరంట్లతో చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఆయన చెప్పిన విషయాలన్నీ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకుని వెళతామని చెప్పడంతో పాటు ఆయన అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గోరంట్ల అభిప్రాయాలపై పార్టీలోనూ, బయటా చర్చ జరిగింది. అంతేకాక రాజమహేంద్రవరంలో కొంతమంది సీనియర్లకు అన్యాయం జరుగుతుందని చెబుతూ గోరంట్ల అధిష్ఠానానికి ఇచ్చిన జాబితాలోని నేతలతో మాట్లాడి, ఇక్కడ అందరినీ ఐక్యం చేసే బాధ్యత, వారికి గౌరవం దక్కేలా చూసే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడుకు అప్పగించారు. ఆయన వచ్చి మాట్లాడతారో, ఫోన్లో మాట్లాడతారో స్పష్టత రావలసి ఉంది.

Updated Date - 2021-08-22T05:45:27+05:30 IST