మమ్ముల ముంచేస్తరా?

ABN , First Publish Date - 2021-06-24T09:03:54+05:30 IST

కన్నతల్లిలాంటి ఊరు, నీడనిస్తున్న ఇల్లు మల్లన్నసాగర్‌లో మునగవట్టె! నా భర్త చనిపోయిండు. పిల్లలు లేరు. నేనొక్కద్నాన్నే ఉన్నానని చెప్పి ఇల్లు రాదంటున్నరు.

మమ్ముల ముంచేస్తరా?

  • కట్టుబట్టలతో మిగిలాం.. ఏడికి పోవాలె? 
  • 65 ఏళ్లపైబడి ఒంటరిగా ఉన్నవారి  గోస

 

తొగుట, జూన్‌ 23: కన్నతల్లిలాంటి ఊరు, నీడనిస్తున్న ఇల్లు మల్లన్నసాగర్‌లో మునగవట్టె! నా భర్త చనిపోయిండు. పిల్లలు లేరు. నేనొక్కద్నాన్నే ఉన్నానని చెప్పి ఇల్లు రాదంటున్నరు. నేను యాడికి పోవాలె? ఎక్కడుండాలె? నా బతుకెట్ల? మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌కు చెందిన వృద్ధురాలు సలేంద్రి ఎంకవ్వ ఆవేదన ఇది. నాకు 71 ఏళ్లు. భర్త చనిపోయిండు. కొడుకు ఉన్నా పోషిస్తలేడు. ఊర్ల ఇల్లు, భూమి ఉంది. పట్టాభూమికి పరిహారం ఇచ్చిన్రు. ఆర్‌అండ్‌కింద డబుల్‌ బెడ్‌రూం ఇల్లు గానీ, స్థలం గానీ, పైసలు గానీ ఇయ్యలేదు. 65 ఏళ్లు నిండిన ఒంటరి మహిళను అనే కారణంతోనే ప్యాకేజీ ఇస్తలేరు. ఇందుకే హైకోర్టులో కేసు వేసిన. మరో ముంపు గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన నాయిని సత్తెవ్వ గోస ఇది! 

...మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో ఇలా ఒంటరిగా మిగిలిన అభాగ్యులు ఏకంగా 229 మంది ఉన్నారు. 


అంతాకూడా 65 ఏళ్లుపైబడిన వారే. కొందరు జీవిత భాగస్వాములను కోల్పోయి అయినవాళ్లంటూ ఎవ్వరూ లేని ఒంటరి పురుషులు, మహిళలు! సొంత మనుషుల ఆదరణ కరువై రోడ్డు మీద పడ్డవారు ఇంకొందరు. అందరిదీ ఒకే సమస్య. సాగుభూమిని, ఇంటిని చివరికి ఊరునే వదులుకొని కట్టుబట్టలతో మిగిలామని, అయినా తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వడం లేదన్న ఆవేదన. ఇల్లు ముంగిలి లేక యాడుండాలె అన్న ప్రశ్న.  ఈ మనోవేదనతోనే ఇటీవల ముంపు గ్రామమైన వేములఘాట్‌కు చెందిన వృద్ధ రైతు.. కూల్చేసిన తన ఇంటి దూలాలు, వాసాలనే చితిగా పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వారు గుర్తుచేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏడాదిన్నరగా హైకోర్టులో కొందరు పోరాడుతున్నారు. కాగా ఒంటరిగా ఉన్న వృద్ధులను కుటుంబంగా ఎందుకు పరిగణించరు? అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల విజ్ఞాపనపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రానుంది.  


మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పల్లెపహాడ్‌, వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, లక్ష్మాపూర్‌, రాంపూర్‌, బ్రాహ్మణ బంజేరుపల్లి... బంజేరుపల్లి, కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించింది. నిర్వాసితులందరూ ప్యాకేజీకి అర్హులేనని 2013 భూసేకరణ చట్టం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం.. భర్త చనిపోయినా, భర్తతో విడాకులు తీసుకున్నా ఆ భార్యను ఒక కుటుంబంగా గుర్తించాలి. అలాగే భార్య చనిపోయినా, భార్యతో విడాకులు తీసుకున్నా ఆ భర్తనూ ఒక కుటుంబంగా గుర్తించాలి. అయితే ఇలాంటివారి గురించి తెలంగాణ భూసేకరణ చట్టం-2017లో ఎక్కడా పేర్కొనలేదు. ఈ చట్టం కింద పరిహారంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు వర్తింపజేసింది. 


ఆర్‌అండ్‌ఆర్‌ కింద ఒక కుటుంబంగా పరిగణించినవారికి 250 గజాల స్థలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని నిర్మించి ఇస్తున్నారు. ఇల్లు వద్దనుకుంటే రూ.5.04 లక్షలు, 250 గజాల స్థలం ఇస్తున్నారు. ఇంట్లో 18 ఏళ్ల వయసు నిండి పెళ్లికాని యువకులు ఉంటే రూ.5 లక్షలు, 250 గజాల స్థలం ఇస్తున్నారు. అయితే 65 ఏళ్లు పైబడి గ్రామంలో ఒంటరిగా ఉన్నవారికి మాత్రం ఏ ప్యాకేజీ వర్తించడం లేదు. ఇలాంటి బాధితులు.. వేములఘాట్‌లో 102 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 57 మంది, ఎర్రవల్లిలో 30 మంది, పల్లె పహాడ్‌, లక్ష్మాపూర్‌, బ్రాహ్మణ బంజేరుపల్లి, సింగారంలో 10 మంది చొప్పున ఉన్నారు. వీరిని ప్రత్యేక కుటుంబంగా పరిగణించలేమని, సంతానానికి అర్‌అండ్‌ఆర్‌ ఇస్తే వృద్ధులకూ ఇచ్చినట్లేనని ప్రభుత్వం చెబుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ 2019లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం ముంపు గ్రామాల పరిధిలోని 100 మంది హైకోర్టును ఆశ్రయించారు. వీరలో వేములఘాట్‌కు చెందిన 52 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన 27 మంది, ఎర్రవల్లికి చెందిన 18 మంది ఉన్నారు. వీరిలో ఎర్రవల్లికి చెందిన ముగ్గురికి మాత్రమే ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.   బాధితుల్లో తనవాళ్లంటూ ఎవ్వరూ లేనివారు కనీసం 13మంది ఉన్నారు.   


నిలువనీడ లేక

ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తూ నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పరిహారం ఇచ్చిన వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారు. పరిహారం రాని ఒంటరి మహిళలు, పురుషులు ఇంకా ఊర్లలోనే ఉన్నారు. రిజర్వాయర్‌ కట్ట పనులు వేగవంతం కావడంతో ముంపు గ్రామాల రాకపోకలకు రహదారులు మూసుకుపోయాయి. దీంతో వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఆర్‌అండ్‌ఆర్‌ అమలులో రాజకీయం చోటుచేసుకుందని, ముంపు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న 65 ఏళ్లు నిండిన నాలుగైదు వందల మందికి ప్యాకేజీ ఇప్పించుకున్నారని అంటున్నారు.   



నేను ఊర్లో పుట్టలేదా? 

నాకు 75 ఏళ్లు. ఊర్లోనే పుట్టిన. అక్కడే పెరిగిన. నాకు ఇద్దరు కొడుకులు. కూతురు. భార్య చనిపోయింది. ఉన్న 30 గుంటలను సర్కారుకు ఇచ్చేసిన. ఆ పైసలతో కూతురు పెళ్లి చేసిన. కొడుకులు వేరే కాపురం పెట్టిన్రు. ఇటీవలే నా అల్లుడు (కూతురు భర్త) చనిపోయిండు. నా బిడ్డకు ఆరు నెలల కొడుకు ఉన్నడు. నాకే దిక్కులేదు. కూతురును, మనుమడిని ఎట్లా సాకాలె. ఒంటరి పురుషుడనని చెప్పి నాకు ప్యాకేజీ ఇస్తలేరు. 

- సందరబోయిన యాదయ్య, ఏటిగడ్డ కిష్టాపూర్‌ 


ప్రభుత్వ వాదన సరి కాదు

నిర్వాసిత కుటుంబంలో కొడుకు లేదా కూతురికి ప్యాకేజీ ఇస్తే ఒంటరి వృద్ధులూ అందులో భాగమని ప్రభుత్వ వాదన. ఇది సరికాదు. ఆ వృద్ధులు, వారి సంతానం వేర్వేరు కుటుంబాల కిందే లెక్క. చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు, భర్త లేక భార్య చనిపోయిన వారిని వేరే కుటుంబంగా పరిగణించి ఆర్‌అండ్‌ఆర్‌  ఇవ్వాలని హైకోర్టులో వాదించాం. వారిని కుటుంబంగా పరిగణించడం లేదని, వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వకుండా ఆపుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించాం. శుక్రవారం లోగా అలాంటి వారిని పరిశీలించి సమాధానం చెప్పాలని,  ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

 - పిటిషనర్‌ తరఫు న్యాయవాది

Updated Date - 2021-06-24T09:03:54+05:30 IST