టీఆర్‌ఎస్‌లోకి వచ్చింది భగీరథను చూసే..!

ABN , First Publish Date - 2021-01-21T06:03:57+05:30 IST

గజ్వేల్‌/గజ్వేల్‌టౌన్‌, జనవరి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం స్ఫూర్తితోనే ప్రతిపక్షంలో ఉన్న తాను టీఆర్‌ఎ్‌సలో చేరినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి వచ్చింది  భగీరథను చూసే..!
కోమటిబండ వద్ద గల మిషన్‌ భగీరథ పైలాన్‌ వద్ద మంత్రి, అధికార బృందం

ఇంటింటికీ నీళ్లిచ్చిన భగీరథుడు కేసీఆర్‌ 

దేశం మెచ్చిన పథకం ‘మిషన్‌ భగీరథ’

దీని స్ఫూర్తితోనే కేంద్ర ‘జల్‌ జీవన్‌ మిషన్‌’

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

‘భగీరథ’ వంద శాతం పూర్తి : స్మితా సబర్వాల్‌

కోమటి బండలో రాష్ట్రస్థాయి మిషన్‌భగీరథ సమీక్షా సమావేశం


గజ్వేల్‌/గజ్వేల్‌టౌన్‌, జనవరి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం స్ఫూర్తితోనే ప్రతిపక్షంలో ఉన్న తాను టీఆర్‌ఎ్‌సలో చేరినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌ మండలం కోమటిబండ వద్ద గల మిషన్‌భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌లో సీఎంవో కార్యాదర్శి స్మితాసబర్వాల్‌, మిషన్‌భగీరథ అధికారులతో కలిసి రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. మిషన్‌ భగీరథ దేశంలోనే గొప్ప పథకం అని అన్నారు. మిషన్‌భగీరథ పనులు మొదలైనప్పుడు టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న  తాను ఈ ప్రాజెక్టు డిజైన్‌ చూసిన తర్వాతనే మనసు మార్చుకుని టీఆర్‌ఎ్‌సలో చేరినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మిషన్‌ భగీరథ పథకం ఆదర్శంగా నిలిచిందని ఆయన  చెప్పారు. భగీరథ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించిందని తెలిపారు. మిషన్‌ భగీరథలో అపరిష్కృతంగా ఉన్న చిన్నచిన్న గ్యాప్‌లను మార్చిలోగా పరిష్కరించాలని, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి కూడా మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రార్థనా మందిరాలు, రైతువేదికలు, విద్యాసంస్థలు, వైకుంఠధామాలు, డబుల్‌ ఇళ్లకు మిషన్‌భగీరథ కనెక్షన్‌ అందించాలని మంత్రి సూచించారు. రోడ్ల మీద మిషన్‌భగీరథ పైపులు అక్కడక్కడా కనిపిస్తున్నాయని, ఇక నుంచి ఎక్కడ కూడా రహదారుల మీద పైపులు కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పాత ట్యాంకులకు మరమ్మతులు చేపట్టి రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. మినరల్‌ వాటర్‌ కంటే మిషన్‌ భగీరథ నీళ్లు అన్ని విధాలా శ్రేయస్కరమని వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని మంత్రి పేర్కొన్నారు. మిషన్‌భగీరథ నీటిపై అబద్ధపు ప్రచారాలు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 


56 లక్షల ఇళ్లకు శుద్ధిచేసిన నీటి సరఫరా :  స్మితాసబర్వాల్‌, సీఎంవో కార్యదర్శి

మిషన్‌ భగీరథ వందశాతం పూర్తయిందని భారత ప్రభుత్వం కూడా ప్రకటించిందని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ తెలిపారు. ఈ పథకంతో సుమారు 56 లక్షల ఇళ్లకు శుద్ధిచేసిన నీరు సరఫరా అవుతుందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే మినరల్‌ వాటర్‌కంటే మిషన్‌ భగీరథ నీరే సురక్షితమని ఆమె ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఆధునిక టెక్నాలజీతో మిషన్‌ భగీరథ నీరు శుద్ధి అవుతున్నదని పేర్కొన్నారు. అనంతరం మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో వంద శాతం మిషన్‌ భగీరథ స్థిరీకరణ పనులు పూర్తిచేసిన మిషన్‌ భగీరథ ఇంజనీర్లను ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్‌ఈ, ఈఈ, డీఈఈ, జేఈఈ పాల్గొన్నారు.


‘భగీరథ’ వాటర్‌ బాటిళ్లు !

 ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే మిషన్‌ భగీరథ నీటితో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లను అధికారిక సమావేశాల్లో వినియోగించనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆర్వోప్లాంట్‌ నీటిలో కంటే భగీరథ నీటిలోనే పుష్కలంగా ఖనిజ లవణాలుంటాయని, ఈనీటిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ బాటిళ్లను ఎవరికీ విక్రయించబోమని, కేవలం అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశాల్లో మాత్రమే వినియోగిస్తామన్నారు. 


 ఉద్యోగులకు ఉచితంగా పంపిణీ : ఎంపీ సంతోష్‌ 

భగీరఽథ మంచినీటితో కూడిన బాటిళ్లను తయారు చేయడం సీఎం కెసీఆర్‌ అసాధారణ విజయమని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌ కుమార్‌ అన్నారు. త్వరలో ఈ బాటిళ్లను ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సంతోష్‌ కుమార్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 


గిర్మాపూర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్గల్‌, జనవరి 20 : గజ్వేల్‌ మండలం కోమటిబండ వద్ద మిషన్‌ భగీరథ తాగునీటిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌ వెళ్తూ బుధవారం సాయంత్రం వర్గల్‌ మండలం గిర్మాపూర్‌కు వచ్చారు. మంత్రికి సర్పంచు సత్యంతో పాటు నాయకులు ఘనంగా స్వాగతం పలికి, శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఓఎ్‌సడీ సత్యనారాయణరెడ్డి గిర్మాపూర్‌ వాసి కావడంతో మంత్రి గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. 






Updated Date - 2021-01-21T06:03:57+05:30 IST