సిద్ధూకు సిఫారసు చేసిన పాక్ ప్రధాని : కెప్టెన్

ABN , First Publish Date - 2022-01-25T16:30:46+05:30 IST

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై మరోసారి..

సిద్ధూకు సిఫారసు చేసిన పాక్ ప్రధాని : కెప్టెన్

న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై మరోసారి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా గతంలో తనకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరఫున ఒక మెసేజ్ వచ్చిందని చెప్పారు. ''సిద్ధూను క్యాబినెట్‌లోకి తీసుకుంటే మీకు రుణపడి ఉంటాను. ఆయన నాకు పాత మిత్రుడు. ఒకవేళ ఆయన సరిగా పనిచేయకపోతే పదవి నుంచి తొలగించవచ్చు'' అని తనకు ఇమ్రాన్‌ఖాన్ సందేశం పంపారని కెప్టెన్ తెలిపారు.


కొద్దికాలం క్రితం సిద్ధూ, కెప్టెన్ మధ్య విభేదాలు తలెత్తిన క్రమంలో పంజాబ్ సీఎం పదవి నుంచి కెప్టెన్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. దీనికి ముందు అమరీందర్ క్యాబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా సిద్ధూ పనిచేశారు. అయితే ఆయన మంత్రి పదవిని కెప్టెన్ మార్చడంతో సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. కెప్టెన్ అభ్యంతరాలను బేఖాతరు చేసి కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసింది. ఈ క్రమంలో సీఎం పదవిని కూడా కోల్పోయిన కెప్టెన్ ఎకాఎకీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ స్థాపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దిగుతున్నారు. సిద్ధూను గెలవనీయనని కూడా కెప్టెన్ ప్రకటించారు. గతంలో సైతం సిద్ధూకు ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయని కెప్టెన్ అమరీందర్ సింగ్ పలుమార్లు ఆరోపించారు.

Updated Date - 2022-01-25T16:30:46+05:30 IST