ప్రమాద ఘంటికలు!

ABN , First Publish Date - 2021-08-04T05:14:16+05:30 IST

ఖరీఫ్‌ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీజన్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడంతో అన్నదాతలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తున్న గొట్టా బ్యారేజీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఖరీఫ్‌నకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని విడిచిపెట్టగా.. బ్యారేజీకి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒకటి రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే కనిష్టస్థాయికి నీటినిల్వలు చేరుకుంటాయి. దీంతో ఏంచేయాలో తెలియక వంశధార అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రమాద ఘంటికలు!
గొట్టాబ్యారేజీ వద్ద అరకొరగా నీటి నిల్వలు

కనిష్ట నీటి నిల్వల స్థాయికి గొట్టాబ్యారేజీ

ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గుముఖం

కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలో శివారుకు చేరని నీరు

కొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమే

ఆందోళనలో ‘వంశధార’ అధికారులు

(హిరమండలం)

ఖరీఫ్‌ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీజన్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడంతో అన్నదాతలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తున్న గొట్టా బ్యారేజీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఖరీఫ్‌నకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని విడిచిపెట్టగా.. బ్యారేజీకి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒకటి రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే  కనిష్టస్థాయికి నీటినిల్వలు చేరుకుంటాయి. దీంతో ఏంచేయాలో తెలియక వంశధార అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత ఏడేళ్లలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాది వేసవిలో కూడా వర్షాలు అంతంతమాత్రమే. ఒడిశాతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో బ్యారేజీలోకి కొద్దిగా నీరు చేరింది. కానీ గత నెలలో వైఎస్సార్‌ జయంతి నాడు(జూలై 8న) ఆదరాబాదరాగా ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టారు. ఇంకా శివారు ఆయకట్టుకు సాగునీరు అందకుండానే గొట్టా బ్యారేజీలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఖరీఫ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 


 ప్రారంభ మండలాలకే...

ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,48,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. హిరమండలం, జలుమూరు, సారవకోట, పోలాకి, సంతబొమ్మాళి, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు కాలువ ద్వారా నీరందిస్తున్నారు. గత నెల 8న  ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టారు. దాదాపు నెలరోజులు సమీపిస్తున్నా శివారు ఆయకట్టుకు సాగునీరు చేరలేదు. ప్రారంభంలో ఉన్న మండలాలకు మాత్రమే నీరు చేరడంతో దమ్ములు చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల పరిధిలోని 62వేల ఎకరాలకు సాగునీరందుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో ఇన్‌ఫ్లో కేవలం 1,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఇంకా 300 క్యూసెక్కుల లోటు కొనసాగుతోంది. ఈ సమయానికి ఎడమ ప్రధాన కాలువ ద్వారా 2,000 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడిచిపెడితేనే ఆయకట్టుకు సకాలంలో నీరందేది. కానీ అందులో సగం నీరే వెళ్తుండడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.   


 రిజర్వాయర్‌లో నిల్వ ఉంచని వైనం

కుడి ప్రధాన కాలువలోకి వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. గత ఏడాది రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడంతో గొట్టాబ్యారేజీతో పని లేకుండా పోయింది. బ్యారేజీ నుంచి ఎడమ ప్రధాన కాలువ ద్వారా పుష్కలంగా నీరు విడిచిపెట్టారు. ఈ ఏడాది వంశధార రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయలేదు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేశాయి. ఈ సమయానికి గొట్టా బ్యారేజీ వద్ద  38.01 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉండాలి. కానీ ప్రస్తుతం 37.80 మీటర్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం లోటు కొనసాగుతుండడంతో మరికొద్దిరోజుల్లో మరింత దిగువకు నీటి నిల్వలు చేరుకునే అవకాశముంది. ఒడిశాతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పడకపోతే కాలువల ద్వారా నీటిని విడిచిపెట్టడం కష్టమేనని వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు తెలిపారు. 


మడ్డువలస రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గుముఖం

వంగర: మడ్డువలసకు గడ్డుకాలం ఎదురైంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత నెల 8న కాలువ ద్వారా సాగునీరు విడిచిపెట్టినా... ఇప్పటికీ శివారు ఆయకట్టుకు సాగునీరందడం లేదు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 64.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 63 మీటర్లకు చేరుకుంది. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా 280 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. దీంతో రోజురోజుకూ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. కుడి ప్రధాన కాలువ ద్వారా వంగర, రేగిడి, సంతకవిటి, పొందూరు, జి.సిగడాం మండలాల్లో 24,700 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. నీటి విడిచిపెట్టి నెల రోజులు సమీపిస్తున్నా.. రేగిడి, వంగర మండలాలకు ఇప్పటికీ నీరు చేరలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


తోటపల్లి, మడ్డువలస కాలువల ద్వారా అందని నీరు

సంతకవిటి : సంతకవిటి మండల రైతాంగానికి మడ్డువలస, తోటపల్లి ప్రధాన కాలువలే ఆధారం. మడ్డువలస కాలువ 12,500 ఎకరాలకు, తోటపల్లి కాలువ 500 ఎకరాలకు సాగునీరందిస్తోంది. కానీ గత మూడేళ్లుగా కాలువల నిర్వహణ లేక శివారు ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. చెంతనే నాగావళి ఉన్నా.. నారాయణపురం ఆనకట్ట ఉన్నా, సాగునీటికి రైతులు కటకటలాడుతున్నారు. మడ్డువలస కాలువ పరిధిలో 7,500 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. మండాకురిటి, సిరిపురం, జీఎన్‌పురం, పోతురాజుపేట, మిర్తివలస, అప్పలగ్రహారం, శేషాద్రిపురం, సిరిపురంలో వరి నారుమళ్లు నీరు లేక ఎండిపోతున్నాయి. రైతులు సమీప చెరువులు, కాలువల నుంచి ఇంజన్లు వేసి నీటిని తోడుకోవాల్సి వస్తోంది. తోటపల్లి పిల్ల కాలువలదీ మరీ దయనీయం. చుక్కనీరు కూడా విదల్చడం లేదు. బొద్దూరు, పొనుగుటివలస, జీఎస్‌పురం, ఎస్‌.రంగరాయపురం, తాలాడల్లో వందలాది ఎకరాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. రేగిడి మండలం తాటిపాడు, జీఎస్‌పురం మధ్య ఓ బడా నాయకుడు సాగుటిని అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సక్రమంగా సాగునీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-08-04T05:14:16+05:30 IST