కరోనాతో మహ్మద్‌ గౌస్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:50:49+05:30 IST

కరోనాతో మహ్మద్‌ గౌస్‌ మృతి

కరోనాతో మహ్మద్‌ గౌస్‌ మృతి
మహ్మద్‌ గౌస్‌ (ఫైల్‌)

- ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు 

- గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకుడు 

- కొత్తూరులో రామాలయ నిర్మాణ కర్తగా గుర్తింపు 

-  నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి, కమ్యూనిస్టు నాయకులు 

రాయపర్తి, ఏప్రిల్‌ 20 : గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయిలో సేవలందించిన ఎర్రజెండా నేలకొరిగింది. మారుమూల గ్రామం నుంచి తన వాక్చాతుర్యంతో ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియచేస్తూ పోరాటాలు సాగించిన అందరినీ కన్నీటి సంద్రంలో ఉంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల క్రితం మహ్మద్‌ గౌస్‌ (59)కు కరోనా రాగా.. చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సోమవారం రాత్రి మరణించారు. మంగళవారం సాయంత్రం గౌస్‌ అంత్యక్రియలు కొత్తూరులో జరిగాయి. 

వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరుకు చెందిన అబ్దుల్‌ రహీం-సర్వర్‌బీ దంపతులకు ఆరుగురు సంతానం కాగా, మహ్మద్‌ గౌస్‌ నాలుగో వాడు. తన స్వగ్రామంలోనే ఎస్సెస్సీ చదివి, హన్మకొండలో ఇంటర్‌ పూర్తి చేశాడు. అనంతరం హిందీ పండిట్‌ ట్రైయింగ్‌ తీసుకున్నాడు. గౌస్‌కు భార్య గౌసియా బేగం, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. 

రాయపర్తి మండలంలోని కొత్తూరు నుంచి ఎర్ర జెండాను చేత పట్టుకుని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో ఎదిగి.. మద్దికాయల ఓంకార్‌ వేసిన బాటలో నడుస్తూ ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా గౌస్‌ తనసేవలు అందిస్తూ కరోనాతో మరణించాడు. దాదాపు 15 రాష్ట్రాల్లో పార్టీని విస్తరింప చేసి, ఎర్ర సూర్యుడిగా పేదల గుండెల్లో స్థానం కల్పించుకున్న.. గౌస్‌ అకాల మరణం గ్రామస్థులనే కాక, జాతీయ స్థాయి కమ్యూనిస్టు పార్టీలను సైతం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేశాయి. కుల నిర్మూలనతో పాటు మత సామరస్యం కూడా ముఖ్యమేనని చాటిచెపుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశాడు. దీనిలో భాగంగా సొంత ఊరైన కొత్తూరులో శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. హైదరాబాద్‌లో బాగ్‌లిగంపల్లిలో ఓంకార్‌ స్మారకార్థం ఐదస్థులు భవనాన్ని గౌస్‌ నిర్మించాడు. కాగా, జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. 

 పేదల పక్షపాతి.. 

- పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కమ్యూనిస్టు నాయకుడిగా బతికి.. పేదల పక్షపాతిగా కేంద్రస్థాయిలో పేరు తెచ్చుకున్న మహ్మద్‌ గౌస్‌ మరణం ఎంతో కలిచి వేసిందని పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కొత్తూరులో గౌస్‌ మృతదేహనికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌస్‌తో దశాబ్దాలుగా ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆయనతో గడిపాలనని నిరంతరం ప్రజాసమస్యలు తెలిపేవాడన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే కార్మికలోకం ఆయనకిచ్చే నివాళియని స్పష్టం చేశారు. అనంతరం బీఎల్‌ఎఫ్‌ వరంగల్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ సాయిని నరేందర్‌ గౌస్‌ మృతదేహనికి నివాళులర్పించి వారికుటుంబసభ్యులను పరామర్శించారు. కార్మిక నాయకుడు, ఎర్రజెండా ముద్దుబిడ్డ మృతి దేశానికి తీరనిలోటని తెలిపారు. 

Updated Date - 2021-04-21T05:50:49+05:30 IST