గోవాడ షుగర్స్‌లో నిర్లక్ష్యపు నీడ

ABN , First Publish Date - 2020-11-14T06:03:54+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని నిర్లక్ష్యపు నీడ కమ్మేసింది. ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నా అప్రమత్తత కరువైంది.

గోవాడ షుగర్స్‌లో నిర్లక్ష్యపు నీడ
గోవాడ చక్కెర కర్మాగారం

ప్రమాదాలపై అప్రమత్తత కరువు

పంచదార గోదాములో ప్రమాదం గుర్తింపులో

యాజమాన్యం, సిబ్బంది అలక్ష్యం


చోడవరం, నవంబరు 13: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని నిర్లక్ష్యపు నీడ కమ్మేసింది. ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నా అప్రమత్తత కరువైంది. ముప్పును గుర్తించడంలో యాజమాన్యం, సిబ్బంది అలక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శుక్రవారం పంచదార గోదాములో జరిగిన ప్రమాదం ఇందుకు నిదర్శనగా నిలుస్తోంది.


గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఈ ఏడాది అక్టోబరులో నిప్పు అంటుకుని భారీగా బగాస్‌ నిల్వలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీకి తీవ్రంగా నష్టం వాటిల్లింది. తాజాగా శుక్రవారం ఫ్యాక్టరీలోని పంచదార గోదాములో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో సుమారు మూడు వేల పంచదార బస్తాలు  కాలిపోయాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాము షట్టర్‌ తెరిచేంతవరకూ ప్రమాదాన్ని గమనించకపోవడం సిబ్బంది నిర్లక్ష్యం వెల్లడవుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బగాస్‌ నిల్వలు ఉన్న ప్రదేశంలో వెల్డింగ్‌ చేస్తుండగా రెండు నెలల క్రితం నిప్పు రవ్వలు పడి బగాస్‌ నిల్వలకు మంటలు అంటుకున్నాయి.  బగాస్‌ నిల్వలు ఉన్న చోట వెల్డింగ్‌ పనులు చేసే సమయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే ఫ్యాక్టరీకి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా పంచదార బస్తాలు కాలిపోవడం వల్ల ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ప్రమాదాల నియంత్రణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని రైతులు సూచిస్తున్నారు.  

Updated Date - 2020-11-14T06:03:54+05:30 IST