గోదావరి డెల్టాలకు నీరు విడుదల

ABN , First Publish Date - 2021-06-16T05:43:22+05:30 IST

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలోని గోదావరి డెల్టా కాలువలకు కాటన్‌ బ్యారేజీ నుంచి మంగళవారం నీటిని విడుదల చేశారు.

గోదావరి డెల్టాలకు నీరు విడుదల
ఈస్ట్రన్‌ డెల్టా కాలువ వద్ద పూజలు చేస్తున్న ఎంపీ భరత్‌, సీఈ పుల్లారావు..

మూడు డెల్టా కాలువల వద్ద పూజలు చేసి లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్‌, సీఈ పుల్లారావు, ఎస్‌ఈలు

రాజమహేంద్రవరం/ ధవళేశ్వరం, జూన్‌ 15 (ఆంద్రజ్యోతి): ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలోని గోదావరి డెల్టా కాలువలకు కాటన్‌ బ్యారేజీ నుంచి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ బ్యారేజీ పరిధిలో తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలు ఉన్నాయి. ఉదయం 9.30 గంటలకు విజ్జేశ్వరం వైపునున్న వెస్ట్రన్‌ కాలువకు సీఈ పుల్లారావు, ఎస్‌ఈలు శ్రీరామకృష్ణ, రవికుమార్‌ నీటిని విడుదల చేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి గేట్లు ఎత్తారు. 10.30 గంటలకు కోనసీమకు చెందిన సెంట్రల్‌ డెల్టా కాలువలకు ఈ అధికారులే నీటిని విడుదల చేశారు. 11.30 గంటలకు ఈస్ట్రన్‌ డెల్టా కాలువకు స్థానిక ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పూజలు నిర్వహించి గేట్లను ఎత్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్‌డామ్‌ గ్యాప్‌ను పూరించడంతో స్పిల్‌వే గుండా అప్రోచ్‌ చానల్‌ ద్వారా దిగువ గోదావరిలోనికి నీటిని వదులుతున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని కాలువలకు వదిలినట్టయింది. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ త్వరలోనే పోలవరం పూర్తవుతుందని, ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా నీటిని కిందకు వదులుతున్నారని అన్నారు. కాఫర్‌డామ్‌ నుంచి నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారని, కాఫర్‌డామ్‌లో 20 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ధవళేశ్వరం బ్యారేజీలో 3 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తయితే కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారన్నారు. గోదావరి డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌ పుల్లారావు మాట్లాడుతూ ఈ ఏడాది రబీ సీజన్‌లో కాఫర్‌డామ్‌లోని నీటి నిల్వల వల్ల ఏవిధమైన సాగునీటి సమస్యలు రాలేదని, గత రబీ సీజన్‌లో సీలేరు నీటిని విడుదల చేయించాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం కాఫర్‌డామ్‌ నీటిని అప్రోచ్‌ చానల్‌ ద్వారా స్పిల్‌వే మీదుగా ధవళేశ్వరం బ్యారేజీకి మళ్లిస్తున్నామని, గతంలో కాఫర్‌ డామ్‌ లేకపోవడం వల్ల గోదావరి నీరు ధవళేశ్వరం చేరేదన్నారు. కాలువల్లో అక్రమ కట్టడాల ను తొలగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసరావు, రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీ పోర్టుకు 2030 వరకూ నీటి సరఫరా

కాకినాడ, జూన్‌ 15: కాకినాడ సీపోర్టుకు నీటి సరఫరా గడు వును 2030 సంవత్సరం వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో 31 పేరిట ఉత్తర్వులు జారీచేసింది. కాకినాడ సీపోర్టు సంస్ధ తమ కార్యకలాపాలకోసం సామర్లకోట వేసవి జలాశయం నుంచి గడచిన కొన్ని నెలలుగా 1.36 క్యూసెక్కుల నీటిని పైప్‌లైన్‌ల ద్వారా వినియోగించుకుంటున్న విషయం విదితమే. ఇందుకు సంబంధించి గడువు ముగియడంతో సంస్థ యాజమాన్యం వినతి మేరకు నీటి సరఫరా వినియోగాన్ని 2030 మే 28 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.  



Updated Date - 2021-06-16T05:43:22+05:30 IST