ఇక పల్లెకు ప్రభుత్వ పట్టా వైద్యం.. పైలెట్‌ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో రెండు గిరిజన మండలాలు ఎంపిక

ABN , First Publish Date - 2021-05-14T06:08:54+05:30 IST

ఇప్పటి వరకు పట్టణాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పట్టా వైద్యులు ఇక పై పల్లెల్లోకీ రానున్నారు. పల్లెల్లో కూడా కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలో వెల్‌నెస్‌ సెంట ర్లకు స్థానం కల్పించింది.

ఇక పల్లెకు ప్రభుత్వ పట్టా వైద్యం..  పైలెట్‌ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో రెండు గిరిజన మండలాలు ఎంపిక

గ్రామస్థాయిలో 18ఆరోగ్య ఉపకేంద్రాలకు ఎంబీబీఎస్‌ వైద్యుల నియామకం

ఖమ్మం సంక్షేమ విభాగం, మే 13 : ఇప్పటి వరకు పట్టణాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పట్టా వైద్యులు ఇక పై పల్లెల్లోకీ రానున్నారు. పల్లెల్లో కూడా కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలో వెల్‌నెస్‌ సెంట ర్లకు స్థానం కల్పించింది. గతంలో ఈ ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో ఏఎన్‌ఎం మాత్రమే ఉండేవారు. వెల్‌నెస్‌ సెంటర్‌గా మార్పు చేయటంతో అక్కడ మరో కమ్యూనిటీహెల్త్‌ ఆఫీసర్‌(నర్సింగ్‌ పూర్తి చేసిన వారికి అదనంగా శిక్షణ ఇచ్చి)ను కేటాయించారు. వీరి ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, ఇతర రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాయి. వైరా మండలంలోని తాటిపూడి వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో వెల్‌నెస్‌ సెంటర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వైద్యసేవలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు జిల్లాగా ఎంపిక చేసి.. తొలుత గిరిజన మండలాలైన కామేపల్లి, సింగరేణి మండలాలను తీసుకుని.. ఆ రెండు మండలాల్లోని 18 ఆరోగ్య ఉపకేంద్రాలకు ఎంబీబీఎస్‌ వైద్యులను నియమించింది.

ఆ మండలాలకు 18మంది ఎంబీబీఎస్‌ వైద్యులు

గిరిజన మండలాలైన కామేపల్లి, సింగరేణి మండలాల్లోని 18 ఆరోగ్య ఉపకేంద్రాలను ఎంపిక చేయగా.. గతంలో అక్కడ ఏఎన్‌ఎంలు మాత్రమే విధులు నిర్వహించారు. ఇకపై ప్రభుత్వ నిర్ణయంతో ఆయా సెంటర్లలో ఎంబీబీఎస్‌ డాక్టర్లు వైద్యం చేయనున్నారు. ఈ మేరకు ఆ ఉపకేంద్రాలకు వైద్యులను నియమించేందుకు వైద్యఆరోగ్యశాఖ నుంచి నోటిఫికేషన్‌ విడదల చేయగా మొత్తం 201మంది ధరఖాస్తులు చేశారు. వీరిలో అర్హత కలిగిన వారిని పరిశీలించి గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి, ఏవో రవీందర్‌, పర్యవేక్షకులు రఘుకుమార్‌ అధ్వర్యంలో ఎంబీబీఎస్‌ వైద్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఎంబీబీఎస్‌ వైద్యులు వచ్చే ఆరోగ్య ఉపకేంద్రాలు..

కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తలింగాల, ఉట్కూరు, తాళ్లగూడెం, జాస్తీపల్లి, మద్దులపల్లి, గోవింద్రాల, మున్సిప్‌బంజర, కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సత్యనారాయణపురం, బీఎన్‌ తండా, కారేపల్లి 2, మాణిక్యారం, గాంధీనగర్‌, విశ్వనాథపల్లి, పేరుపల్లి, మాధారం, కోమట్లగూడెం, కారేపల్లి 1 ఆరోగ్య ఉపకేంద్రాలకు.

పల్లెకు ప్రాథమిక స్థాయి వైద్యం 

డాక్టర్‌ మాలతి, ఖమ్మం డీఎంహెచ్‌వో 

మారుమూల పల్లె ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలోనే వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. తొలుత గిరిజన మండలాలైన కామేపల్లి, సింగరేణి మండలాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని.. 18 ఆరోగ్య ఉపకేంద్రాలకు ఎంబీబీఎస్‌ స్థాయి వైద్యులను నియమిస్తున్నాం. వారి ద్వారా పల్లెల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వైద్యసేవలు అందుబాటులో రానున్నాయి. 


Updated Date - 2021-05-14T06:08:54+05:30 IST