గవర్నర్‌కు ‘నీట్‌’ సెగ

ABN , First Publish Date - 2022-04-20T12:51:05+05:30 IST

ఆధ్యాత్మిక పర్యటన కోసం మైలాడుదురై వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి నిరసన సెగ తగిలింది. మైలాడుదురైలో ధర్మపుర ఆధీన రథోత్సవ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళిన

గవర్నర్‌కు ‘నీట్‌’ సెగ

- మైలాడుదురైలో నల్లజెండాలతో నిరసన

- 150 మంది అరెస్టు 


అడయార్‌(చెన్నై): ఆధ్యాత్మిక పర్యటన కోసం మైలాడుదురై వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి నిరసన సెగ తగిలింది. మైలాడుదురైలో ధర్మపుర ఆధీన రథోత్సవ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు నల్ల జెండాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థుల మేలు కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన నీట్‌ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపించకుండా గవర్నర్‌ తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఈ బిల్లుతో పాటు మొత్తం 18 ముసాయిదా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపించాల్సిన గవర్నర్‌ గత రెండు వందల రోజులకు పైగా మూలన పడేశారు. ఈ బిల్లుల విషయంపై గవర్నర్‌ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్నాడీఎంకే, బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైలాడుదురై ధర్మపుర ఆధీనంలో జరుగనున్న కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించరాదని, తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలుపుతామని అన్ని పార్టీలకు చెందిన నేతలు ముందుగానే ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఇద్దరు డీఐజీలు, నలుగురు ఏడీఎస్పీలు, నాగపట్టణం, మైలాడుదురై, తిరువారూర్‌, తంజావూరు, కరూర్‌, పెరంబలూరు జిల్లాలకు చెందిన ఎస్పీలతో పాటు మొత్తం 1850 మంది పోలీసులు మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకున్నారు. రథయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతం, ఈ కార్యక్రమం జరిగే ఏవీసీ కాలేజీ, గవర్నర్‌ ప్రయాణించే రోడ్డు మార్గాల్లో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. ఇలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గవర్నర్‌ రవి చిదంబరం నుంచి రోడ్డు మార్గంలో సీర్గాళి మీదుగా మైలాడుదురైకు చేరుకున్నారు. ఉదయం 8.40 గంటలకు తిరుక్కడైయూర్‌ అమృతకటేశ్వర్‌ ఆలయానికి వచ్చిన గవర్నర్‌ రవికి అలయ శివచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన గో పూజ, గజ పూజ వంటి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభిమారి అమ్మమారిని దర్శనం చేసుకున్నారు. గవర్నర్‌ వెంట కలెక్టర్‌ లలిత కూడా ఉన్నారు. అక్కడ నుంచి కారులో 9.30 గంటలకు మైలాడుదురై ధర్మపుర ఆధీనానికి గవర్నర్‌ చేరుకున్నారు. అయితే, ఆయన ప్రయాణించిన రోడ్డు మార్గంలో ద్రావిడర్‌ కళగం, ద్రావిడర్‌ విడుదలై కళగం, విడుదలై చిరుత్తైగళ్‌ కట్చి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, తమిళర్‌ ఉరిమై ఇయ్యక్కంతో పాటు అనేక పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా చేరి నల్ల జెండాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు కొన్ని వాహనాలను తీసుకొచ్చి తమ ముందు నిలపడంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఆ తర్వాత గవర్నర్‌ రవి ధర్మపుర ఆధీనంకు చేరుకుని వజ్రోత్సవ స్మారక ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆ తర్వాత తెలంగాణాకు బయలుదేరిన రథయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ గవర్నర్‌ రవి అక్కడ నుంచి కారులో బయలుదేరి వెళ్లిపోయారు.


150 మంది అరెస్టు

గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి రాకను పురస్కరించుకుని నల్ల జెండాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపినందుకు 150 మంది నిరసన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న మీథేన్‌ వ్యతిరేక ఆందోళన కమిటి ఆర్గనైజర్‌ జయరామన్‌, సీపీఎం జిల్లా కారయదర్శి శ్రీనివాసన్‌ తదితర కీలక నేతలు కూడా ఉన్నారు. 

Updated Date - 2022-04-20T12:51:05+05:30 IST