పీఎసీఎస్‌లకు పాలకవర్గాలు

ABN , First Publish Date - 2021-06-24T05:05:59+05:30 IST

ప్రాథమిక సహకార పరపతి సంఘాల(పీఎసీఎస్‌)కు త్రీమెన్‌ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్‌ 350ని విడుదల చేసింది. చైర్మన్‌, ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రత్యేక అధికారులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న పీఎసీఎస్‌లకు నూతనంగా తాత్కాలిక పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి.

పీఎసీఎస్‌లకు పాలకవర్గాలు

చైర్మన్‌.. ఇద్దరు సభ్యులతో తాత్కాలికంగా కమిటీ 

27 సంఘాలకు కమిటీల ప్రకటన

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ప్రాథమిక సహకార పరపతి సంఘాల(పీఎసీఎస్‌)కు త్రీమెన్‌ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్‌ 350ని విడుదల చేసింది. చైర్మన్‌, ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రత్యేక అధికారులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న పీఎసీఎస్‌లకు నూతనంగా తాత్కాలిక పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. వీరి పదవీ కాలం వచ్చేనెల 30తో ముగుస్తుంది. ఎన్నికలు జరిగి కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు కాని పక్షంలో మరి కొన్నాళ్లు త్రీ మెన్‌ కమిటీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ కావటంతో పాలకవర్గాలు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కారణంగానే చైర్మన్‌, ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ కార్యదర్శి వై.మధుసూదన రెడ్డి ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లాలో 95 పీఎసీఎస్‌లు ఉన్నాయి. తాజాగా విడుదలైన జీఓ ద్వారా 27 పీఏసీఎస్‌లకు మాత్రమే కమిటీలను వేశారు. మిగిలిన 68 పీఏసీఎస్‌లకు గతంలోనే కమిటీలను వేశారు. గతంలో వేసిన కమిటీల్లో తాజా మాజీ పాలకవర్గాల చైర్మన్లకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విడత నియమితులైన చైర్మన్లలో కొత్తవారే ఎక్కువ ఉండడం గమనార్హం. గత చైర్మన్లలో కొంతమంది చనిపోవడం.. ప్రత్యేక పరిస్థితులు ఉన్నట్లు స్థానిక ప్రజా ప్రతినిధుల సిఫారసులు చేయడం.. కొందరు సర్పంచులుగా ఎన్నిక కావడం.. తదితర కారణాలతో కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాజా పరిణామంతో జిల్లాలో ఉన్న మొత్తం 95 ప్రాథమిక సహకార పరపతి సంఘాలకూ కమిటీలు ఏర్పాటైనట్టే. 


Updated Date - 2021-06-24T05:05:59+05:30 IST