Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనాథ పిల్లలకు ప్రభుత్వం అండ

గురుకుల, ప్రభుత్వ పాఠశాలలకు, వసతి గృహాలకు మిషన్‌ భగీరథ నీరు

మట్టి పాత్రల తయారీకి శిక్షణ ఇవ్వాలి

జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ

సిద్దిపేట రూరల్‌, నవంబరు 29 : కరోనా బారినపడి తల్లిదండ్రులు మృతిచెందిన అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన ఐదవ స్థాయి శిశు సంక్షేమశాఖ, ఆరవ స్థాయి సాంఘిక సంక్షేమశాఖ, ఏడవ స్థాయి పనులు, ఒకటవ స్థాయి ఆర్థిక, ప్రణాళిక సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. వసతి గృహాల్లో, గురుకుల, ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలకు జలుబు, జ్వరం వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. మట్టి పాత్రలు తయారీకి ఎనిమిది యంత్రాలు మంజూరయ్యాయని, కుమ్మరి సంఘం సభ్యులకు పాత్రల తయారీలో నైపుణ్య శిక్షణ ఇచ్చి యంత్రాలను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. గురుకుల, ప్రభుత్వ పాఠశాలలకు, వసతి గృహాలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి పథకం ద్వారా గుర్తించిన విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివిధ గ్రాంట్ల కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలో హుస్నాబాద్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా, రాయపోల్‌ మండలంలో అత్యల్పంగా నమోదైందని చెప్పారు. వర్షాలకు పాడైన రోడ్లు, రహదారులను, చెరువు కట్టలను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నదని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు సిద్ధప్ప, ఉమా, రవీందర్‌రెడ్డి, యాదగిరి, జడ్పీ సీఈవో రమేష్‌, డిప్యూటీ సీఈవో సుమతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement