తెలంగాణలో డ్రోన్‌ సిటీ

ABN , First Publish Date - 2021-05-08T08:39:16+05:30 IST

తెలంగాణలో డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ రమాదేవి తెలిపారు. డ్రోన్‌ల అభివృద్ధి, తయారీ,

తెలంగాణలో డ్రోన్‌ సిటీ

ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణలో డ్రోన్‌ సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ రమాదేవి తెలిపారు. డ్రోన్‌ల అభివృద్ధి, తయారీ, వినియోగం మొదలైన వాటిని ఇది పటిష్ఠం చేయగలదని, ఈ రంగంలో వినూత్నాలను ప్రోత్సహించడానికి దోహద పడుతుందన్నారు. అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వెహికల్స్‌ వ్యవస్థ (యూఏవీ)పై సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. డ్రోన్‌ల ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని.. దేశంలో డ్రోన్‌ల రంగానికి తెలంగాణ కేంద్రంగా మారనుందని ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అన్నారు. వివిధ ప్రాజెక్టులు, రంగాల్లో డ్రోన్ల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి పొందడానికి యూఏఎస్‌ నిబంధనలు 2021 దోహదం చేయగలవని విమానయాన శాఖ జాయింట్‌ సెక్రటరీ అంబర్‌ దుబే అన్నారు. డ్రోన్లను అభివృద్ధి చేసే వారు ఇంటలిజెంట్‌ అల్గారిథమ్స్‌, సాఫ్ట్‌వేర్‌, మేధో సంపత్తి హక్కులపై దృష్టి పెట్టాలని సూచించారు. 


డ్రోన్ల వల్లే సాధ్యం: వ్యవసాయ రంగంలో వ్యయాలను తగ్గించడం డ్రోన్‌ టెక్నాలజీ వల్లే సాధ్యమని మారూట్‌ డ్రోన్స్‌ సీఈఓ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. పదో తరగతి చదివిన వారికి డ్రోన్లపై 2-3 నెలలు శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వారికి అపార ఉద్యోగావకాశాలు కల్పించవచ్చన్నారు. అలాగే ఏయే పంటలకు, ఎంత ఎత్తు నుంచి పిచికారి చేయాలి మొదలైన వాటిపై ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-05-08T08:39:16+05:30 IST