Kuwait వెళ్లాలనుకునే వారికి పిడుగులాంటి వార్త.. ప్రవాసులపై అదనపు భారం..?

ABN , First Publish Date - 2021-11-07T15:56:45+05:30 IST

ఇప్పటికే కువైటైజేషన్, ఇతర నిబంధనల పేరిట వలసదారుల పట్ల గల్ఫ్ దేశం కువైత్ కఠినంగా వ్యవహరిస్తోంది.

Kuwait వెళ్లాలనుకునే వారికి పిడుగులాంటి వార్త.. ప్రవాసులపై అదనపు భారం..?

కువైత్ సిటీ: ఇప్పటికే కువైటైజేషన్, ఇతర నిబంధనల పేరిట వలసదారుల పట్ల గల్ఫ్ దేశం కువైత్ కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో గడిచిన కొంతకాలంగా భారీ సంఖ్యలో ప్రవాసులు కువైత్ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా తాజాగా కువైత్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవాసులకు అందించే ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన ఫీజులను వచ్చే ఏడాది నుంచి భారీగా పెంచే యోచనలో కువైత్ సర్కార్ ఉన్నట్లు అక్కడి మీడియా పేర్కొంటోంది. ఇప్పుడు ప్రభుత్వ సర్వీసులకు వలసదారులు చెల్లిస్తున్న ఫీజులకు అదనంగా 500శాతం మేర పెంచనుందని సమాచారం. ప్రస్తుతం ప్రవాసుల నుంచి కువైత్ వసూలు చేస్తున్న ఫీజులు మిగతా జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలతో పోలిస్తే అత్యల్పంగా ఉండడంతో.. వచ్చే యేటా నుంచి ఫీజులను భారీగా పెంచాలని చూస్తోందని అక్కడి ఓ ప్రముఖ వార్త పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.


వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల ఫీజులపై ఇటీవల పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ బోర్డ్ డైరెక్టర్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన ఫీజులపై కూడా అధికారులు చర్చించినట్లు తన కథనంలో పేర్కొంది. కాగా, 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని బ్యాన్ చేయాలంటూ 2020లో తీసుకొచ్చిన డెసిషన్ నెం.520ను కువైత్ ఇటీవల వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా అల్ సల్మాన్‌తో పీఏఎం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో పాటు ఫత్వా అండ్ లేజిస్లేషన్ కమిటీ కూడా భేటీ అయింది. ఈ సందర్భంగానే వలసదారులకు అందిస్తున్న ప్రభుత్వ సర్వీసులకు 2022 నుంచి ఫీజులను పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, ఇలా ఫీజులు పెంచడం ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున.. సాధ్యసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-11-07T15:56:45+05:30 IST