వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-11-30T05:17:17+05:30 IST

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం రూ.2వేలిచ్చి చేతులు దులుపుకోవడం దారుణమని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
బాధితులతో మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

రూ.కోట్లతో కట్టుకున్న ఇంటిలో మంత్రి సురక్షితం

టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి

నెల్లూరు, (వ్యవసాయం), నవంబరు 29 : వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం రూ.2వేలిచ్చి చేతులు దులుపుకోవడం  దారుణమని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్‌ వారధి సెంటర్‌లో సోమవారం ఆయన వరద బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా ఇళ్లు నీటమునిగి సర్వం కోల్పోయారన్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం వస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి అనిల్‌ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనిల్‌ రూ.కోట్లతో ఇల్లు నిర్మించుకుని సురక్షితంగా ఉన్నారని,  ప్రజలు మాత్రం దిక్కుతోచని స్థితిలో కడుపు మాడ్చుకుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైకులు పెట్టి ఎక్కడికైనా  వెళ్లండని ప్రచారాలు చేయడం సరికాదని, వారికి సరైన వసతులు కల్పించాలని సూచించారు.  టీడీపీ హయాంలో ఇళ్లు తడిచినప్పుడు రూ.30వేలిచ్చి నిత్యావసర వస్తువులు అందజేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం, అధికారులు  బాధితులను ఆదుకోవాలని, లేదంటే ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈసందర్భంగా ఓ దివ్యాంగుడిని చూసి చలించిన కోటంరెడ్డి ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:17:17+05:30 IST