మద్యం మాల్స్‌!

ABN , First Publish Date - 2020-09-26T08:53:01+05:30 IST

అనుకున్నదే జరిగింది. రాష్ట్రంలో మాల్స్‌ తరహా లిక్కర్‌ షాపులకు (వాక్‌ ఇన్‌ స్టోర్స్‌) ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత మద్యం షాపుల పాలసీని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ శుక్రవారం జారీచేసిన

మద్యం మాల్స్‌!

వాక్‌ ఇన్‌ స్టోర్స్‌కు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

మొదటి విడతలో 80 మాల్స్‌

ఎక్కువ అద్దెకు భవంతులు

దర్జాగా మద్యం కొనే వీలు

ఖరీదైన సరుకు సరఫరా

ఇక్కడా అనామక బ్రాండ్లే!

ప్రస్తుత పాలసీ కొనసాగింపు

షాపుల కుదింపుపై కప్పదాటు

ఈ ఏడాది 13శాతమే తగ్గింపు

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అనుకున్నదే జరిగింది. రాష్ట్రంలో మాల్స్‌ తరహా లిక్కర్‌ షాపులకు (వాక్‌ ఇన్‌ స్టోర్స్‌) ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత మద్యం షాపుల పాలసీని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని పేర్కొంది. రాష్ట్రంలో మద్యం మాల్స్‌ ఏర్పాటుచేయబోతున్నారనే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ‘సూపర్‌ కిక్‌...త్వరలో లిక్కర్‌ సూపర్‌ మార్కెట్లు’ పేరుతో ఈనెల 3న కథనం ప్రచురించింది. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ఒకవైపు దశలవారీ మద్య నిషేధం అంటూ ఊదరగొడుతూ...మరోవైపు ‘కిక్కు’ను మాల్స్‌ దాకా చేర్చేందుకు జగన్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అసలు వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ పెట్టాల్సిన అవసరం ఏంటి? దీనికోసం విశాలమైన భవనాలు అద్దెకు తీసుకుని, ఎక్కువ మొత్తం అద్దె చెల్లించి మాల్స్‌ ఎందుకు నడపాలి?... ఈ ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

అయినా ఇదేదో సంక్షేమ పథకం అన్న తరహాలో వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ విధానంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మందుబాబులకు శ్రమ కలగకుండా, చొక్కా నలగకుండా మందు కొనుగోలు చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ (ఎలైట్‌ షాప్స్‌) ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్‌ కమిషనర్‌కు అనుమతినిచ్చింది. అయితే ప్రభుత్వ మద్యం షాపుల సంఖ్యలోనే ఇవి కూడా ఉండాలని, అందులో ఎలాంటి మార్పూ రాకూడదని స్పష్టంచేసింది. ఆదేశాలు ఇప్పుడొచ్చినా, ఇప్పటికే లిక్కర్‌ మాల్స్‌ ఏర్పాటుకు ఏపీఎ్‌సబీసీఎల్‌ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. 

తగ్గింపుపై అటూ ఇటూ..: ప్రస్తుత మద్యం పాలసీని నవంబరు 1 నుంచి మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న 2,934 షాపులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. హైవేలకు మద్యం షాపులు దూరంగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుకావాలని, ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల పరిసరాల్లో షాపులకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టంచేసింది. అమ్మకాల్లో పారదర్శకత కోసం అన్ని షాపుల్లో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానాన్ని అమలుచేయాలని ఎక్సైజ్‌ అధికారులకు సూచించింది. కాగా, మద్యపాన నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులు తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే, ఈసారి దానిని పట్టించుకోలేదు. గతేడాది ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటుచేసే సమయంలో ఈ నియమం పాటించారు. అన్నట్టే 20శాతం తగ్గించారు. గత మేలో లాక్‌డౌన్‌లో తిరిగి షాపులు ప్రారంభమైనప్పుడు, మరో 13శాతం తగ్గించింది. మరో 7శాతం అంటే సుమారు 300 షాపులు తగ్గించాల్సి ఉన్నా, దాని గురించి తాజా పాలసీలో ఎక్కడా ప్రస్తావించలేదు.

మాల్సే కొత్త.. బ్రాండ్లు అవే..

రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో తొలివిడతలో 80 మాల్స్‌ ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యారు. వీటికి అద్దెలు  కూడా భారీగా ఉంటాయి. సాధారణ షాపుల అద్దెలతో పోలిస్తే మాల్స్‌ ఏర్పాటుచేసే భవనాల అద్దె దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా. అలాగే వీటిలో సాధారణ షాపుల్లో అమ్మే చీప్‌ లిక్కర్‌, మీడియం బ్రాండ్లు కాకుండా ఖరీదైన బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నారు. అవి కూడా ఇప్పటికే కొత్తగా తెరపైకి వచ్చిన అనామక బ్రాండ్లకు చెందినవే ఉంటాయని తెలుస్తోంది. ఆయా కంపెనీలకు మేలు చేయడం కోసం ఈ మాల్స్‌లో వాటి బ్రాండ్లలోనే కొన్ని మార్పులు చేసి, వాటికి ప్రీమియం పేరు పెట్టి అమ్ముతారని సమాచారం. మొత్తంగా మాల్స్‌ పెట్టినా, షాపులైనా అవే బ్రాండ్లు ఉంటాయనేది స్పష్టమవుతోంది. 

Updated Date - 2020-09-26T08:53:01+05:30 IST