వ్యాపారాలతో ప్రభుత్వాలకేం పని? : మోదీ

ABN , First Publish Date - 2021-02-25T00:50:37+05:30 IST

వ్యాపారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రధాన మంత్రి

వ్యాపారాలతో ప్రభుత్వాలకేం పని? : మోదీ

న్యూఢిల్లీ : వ్యాపారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రభుత్వం దృష్టి ప్రజా సంక్షేమంపైనే ఉండాలన్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) నిర్వహించిన వెబినార్‌లో బుధవారం మాట్లాడుతూ, 2021-22 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంస్కరణల గురించి వివరించారు. 


ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తప్పనిసరి అని మోదీ తెలిపారు. ‘మోనిటైజ్ అండ్ మోడర్నైజ్’ అనే మంత్రంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం మోనిటైజ్ (నగదు రూపంలోకి మార్చడం) చేస్తే, ఆ స్థానంలోకి ప్రైవేటు రంగం వస్తుందన్నారు. ప్రైవేటు రంగం వస్తే పెట్టుబడులు వస్తాయని, అత్యుత్తమ స్థాయి అంతర్జాతీయ విధానాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. వీటి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చుపెట్టవలసి వస్తోందన్నారు. 


ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కోసం నడపకూడదన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థిక సహకారం అందించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. ప్రైవేటు రంగం వల్ల సమర్థత పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు కొత్తగా వస్తాయని చెప్పారు. 


ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. అనేక ప్రభుత్వ ఆస్తులు వాటి సామర్థ్యానికి తగినట్లు పని చేయడం లేదని తెలిపారు. వీటిని మానిటైజ్ చేసి రూ.2.5 లక్షల కోట్లు సేకరిస్తామని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 


ప్రభుత్వం వ్యాపారం చేస్తే, ఆ వ్యాపారం నష్టాలకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వం నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటుందని, సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండదని వివరించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించి, పెట్టుబడులను ఉపసంహరించడం వల్ల వచ్చిన సొమ్మును అభివృద్ధి పథకాల కోసం ఖర్చు చేస్తామన్నారు. ఆస్తులను నగదుగా మార్చడం, ప్రైవేటీకరించడానికి తీసుకున్న నిర్ణయాలు భారతీయులను సాధికారులుగా మార్చడానికి దోహదపడతాయన్నారు. 


Updated Date - 2021-02-25T00:50:37+05:30 IST