అంతా.. వింత!

ABN , First Publish Date - 2020-03-26T07:39:12+05:30 IST

‘లాక్‌డౌన్‌’ సమయంలో వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కానీ, వాటి అమలు విషయంలో మాత్రం శాఖల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది..

అంతా.. వింత!

ఎవరి దారిన వారు.. ఇలాగైతే ఏ తీరానికి చేరు?

సరుకులున్నా దించే హమాలీలు లేరు

కూరలు కోసేందుకు కూలీలు రాలేరు

మెడికల్‌ షాపుల సిబ్బందికీ ఇబ్బంది

ఎక్కడికక్కడ ఆంక్షలు, నిర్బంధం

నిత్యావసరాలకు అనుమతి అంటూనే వాటి సరఫరాకు అడ్డంకులు

శాఖల మధ్య సమన్వయ లోపం

పోలీసులకు అందని సూచనలు

పరిష్కరించకుంటే సమస్య తీవ్రం


నిత్యావసర సరుకుల లారీలను ఆపొద్దు!

...ఇది ప్రభుత్వ ఆదేశం!

...మరి, హమాలీలు లేకుండా 

సరుకులు లారీల నుంచి కిందికి దించేదెవరు?

కూరగాయల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగొద్దు!

...ఇది సర్కారు సంకల్పం!

...మరి, కూలీలు లేకుండా పొలంలోని కూరగాయలను 

కోసేదెలా?


(అమరావతి/గుంటూరు - ఆంధ్రజ్యోతి)

‘లాక్‌డౌన్‌’ సమయంలో వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కానీ, వాటి అమలు విషయంలో మాత్రం శాఖల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. అంతిమంగా ఇది ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తోంది. 21 రోజుల లాక్‌డౌన్‌ మొదలైన తొలిరోజైన బుధవారం ఇలాంటి లోటుపాట్లు అనేకం బయటపడ్డాయి. ఉదాహరణకు... నిత్యావసరాల విషయానికే వద్దాం! సరుకుల రవాణాకు  ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. లారీలు తరలి వస్తున్నాయి కూడా! కానీ, బస్తాలను దించాలంటే హమాలీలు కావాలి. లాక్‌డౌన్‌లో భాగంగా పోలీసులు ఎక్కడా, ఎవరినీ బయటికి రానివ్వడంలేదు. హమాలీలకు ప్రత్యేకంగా అనుమతులూ, గుర్తింపు కార్డులూ ఇవ్వలేదు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. అక్కడక్కడ లాఠీలు ఝళిపిస్తున్నారు. దీంతో హమాలీలు విధుల్లోకి రావడానికి ఇష్టపడటంలేదు. వారికి ఎలాంటి గుర్తింపు కార్డులూ లేవు. హమాలీలను అనుమతించాలని పోలీసులకూ ఆదేశాలు రాలేదు. దీంతో వారు అందరితోపాటు హమాలీలనూ నిలిపివేస్తున్నారు. ఇది నిత్యావసరాలతోపాటు కూరగాయల దిగుమతులపైనా ప్రభావం చూపుతోంది.


చేలో పంట.. మార్కెట్‌కు చేరేదెలా?

లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌లో ఒకవైపు కూరగాయల ధరలు పెరుగుతుండగా... మరోవైపు చేలో పండినపంటను ఎలా బయటకు తేవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలోని నారా కోడూరు, తెనాలి రూరల్‌, పల్నాడులోని కొన్ని ప్రాంతాల నుంచి కూరగాయలు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. కూరగాయలను పొలంలో కోసేందుకు, వాటిని నగరంలోని మార్కెట్‌లకు తరలించేందుకు కూలీ లు తప్ప మరో మార్గం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించడంతో కూలీలెవరూ పొలాల దాకా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రైతు ఒక్కడే పంట కోయలేడు. నలుగురైదుగురు కూలీలను తీసుకెళ్లే దారీ కనిపించడంలేదు. బుధవారం ఈ సమస్య తీవ్రంగా కనిపించింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఒకట్రెండు రోజుల్లో పం టలు చేలోనే కుళ్లిపోవడమో, ముదిరిపోవడమో తప్పదని రైతులు వాపోతున్నారు. దీని ప్రభావం మార్కెట్లపైనా పడుతుంది. కూరగాయలకు కొరత ఏర్పడే ప్రమాదముంది. 


గుంటూరు జిల్లాలో మిరప కోతలు ముమ్మరంగా సాగే సమయం ఇది. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కూలీలు పనులకు వెళ్లడం లేదు. పొలాల్లో ఉన్న పంటలను ఏంచేయాలో అర్థంకాక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో రైతులు ఎప్పుడు పంటలు అమ్ముకోవాలనే దానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఏపీలో అలాంటిదేమీ లేదు. 


మందులున్నా... ఇవ్వలేరు!

అత్యవసర సేవల కిందకు వచ్చే మెడికల్‌ షాపుల్లో పనిచేసే సిబ్బందికీ కష్టాలు తప్పడం లేదు. షాపులు తెరవడానికి అనుమతి ఉంది. కానీ, వాటి సిబ్బంది మాత్రం ఇళ్ల నుంచి షాప్‌ దాకా చేరుకోలేకపోతున్నారు. ఐడీ కార్డులు లేవంటూ పోలీసులు వారిని షాపులకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. పలుచోట్ల వారిపై లాఠీచార్జ్‌ చేయడంతో తాము పనిచేయలేమని పలు జిల్లాల్లో మెడికల్‌ షాపుల్లో పనిచేసే సిబ్బంది చేతులెత్తేసి  ఇళ్లకే పరిమితం అయ్యారు. హోల్‌సేల్‌ డీలర్ల నుంచి మందులను రిటైల్‌ షాపులకు చేరవేసే సిబ్బంది కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో, రిటైల్‌షా్‌పలలో ఏదైనా ఔషధాలు అయిపోతే, మళ్లీ తెప్పించుకునే మార్గం కనిపించడంలేదు. వీటన్నింటిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే... ఒకటి రెండు రోజుల్లో సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది.

Updated Date - 2020-03-26T07:39:12+05:30 IST