ప్రభుత్వ ఆస్పత్రి అద్దె చెల్లించకపోవడంతో భవనానికి తాళం

ABN , First Publish Date - 2021-04-02T16:43:03+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిగా కొనసాగుతున్న భవనం అద్దె చెల్లించకపోవడంతో...

ప్రభుత్వ ఆస్పత్రి అద్దె చెల్లించకపోవడంతో భవనానికి తాళం

హైదరాబాద్/ముషీరాబాద్‌ : ప్రభుత్వ ఆస్పత్రిగా కొనసాగుతున్న భవనం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని ఆ భవనానికి తాళం వేశాడు. దీంతో వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భోలక్‌ఫూర్‌ రంగానగర్‌లో ఇంటి యజమానురాలు శారదకు సంబంధించిన భవనంలో 2017లో బైబిల్‌ హౌస్‌ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం అద్దెకు తీసుకున్నారు. ప్రతి నెల రూ.9 వేలు అద్దె చెల్లించేలా జిల్లా వైద్యశాఖాధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ సంవత్సరం మార్చి నెల వరకు జిల్లా వైద్యశాఖాధికారులు అద్దె చెల్లించలేదు. దీంతో ఇంటి యజమానురాలు జిల్లా వైద్యశాఖాధికారులను కలిసి అద్దె చెల్లించాలని లేని పక్షంలో భవనం ఖాళీ చేయాలని ఇటీవల నోటీసు జారీ చేశారు.


లక్ష రూపాయల అద్దె బకాయి ఉండడంతో గురువారం ఉదయం ఆస్పత్రి గేట్‌కు ఇంటి యజమాని తాళం వేశారు. వైద్య సిబ్బంది ఈ విషయాన్ని జిల్లా వైద్యశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అద్దె లక్ష రూపాయల బకాయి చెల్లించడంతోపాటు విద్యుత్‌ బిల్లులు రూ.17 వేల బకాయి, మంచినీటి బిల్లు రూ.6 వేల బకాయి ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. జిల్లా వైద్యశాఖాధికారులు మరో చోట ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోవాలని వైద్య సిబ్బందికి ఉచిత సలహా ఇచ్చారు. నెల రోజుల్లో మరోచోట ఏర్పాటు చేయాలని అప్పటి వరకు ఆస్పత్రి కొనసాగేలా ఇంటి యజమానిని ఒప్పించామని తెలిపారు.  


కొత్త భవనం కోసం జిల్లా వైద్యశాఖాధికారి, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశాం

భవనాన్ని ఇంటి యజమాని ఖాళీ చేయాలని ఆదేశించడంతో కొత్త భవనం కోసం జిల్లా వైద్యశాఖాధికారి, స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. రంగానగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్‌ను ఆస్పత్రిగా ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించినట్టు తెలిపారు. కానీ ఆ కమ్యూనిటీహాల్‌లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండడం వల్ల ఏర్పాటు చేయలేమని రంగానగర్‌ బస్తీ పెద్దలు కూడా ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతించడంలేదని తెలిపారు. జిల్లా వైద్యశాఖాధికారులు ఆస్పత్రి భవనాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలని సూచించారని ఆమె తెలిపారు. - బైబిల్‌ హౌస్‌ యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరిశ్రీ.

Updated Date - 2021-04-02T16:43:03+05:30 IST