ప్రభుత్వ ఆస్పత్రేనా..?

ABN , First Publish Date - 2021-10-12T05:29:25+05:30 IST

ఎనిమిది జిల్లాల పేదల ఆరోగ్య సంజీవని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రేనా..?

  1. పడకలు, వైద్య సేవలు మాత్రమే ఉచితం
  2. మిగిలినవన్నీ రోగులు బయట కొనాల్సిందే
  3. జీజీహెచ్‌లో ఆగిన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు
  4. తాగునీటికే ఒక్కో రోగికి రోజుకు రూ.200 ఖర్చు
  5. మందులు, గ్లౌజులు, దూది, సిరంజిలు.. ఏవీ లేవు
  6. క్వార్టర్‌ బడ్జెట్‌ రూ.89 లక్షలు.. ఇచ్చింది రూ.13 లక్షలు
  7. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలివ్వక ఐదు నెలలు
  8. రెండేళ్ల తర్వాత నేడు హెచ్‌డీఎస్‌ సమావేశం


కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 11: ఎనిమిది జిల్లాల పేదల ఆరోగ్య సంజీవని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ప్రతిరోజూ ఓపీకి 2,500 నుంచి 3,000 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 200 మంది దాకా అడ్మిషన్‌ పొందుతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చులు భరించలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే... తగిన వైద్యం అందడం లేదు. గ్లౌజులు కూడా అందుబాటులో లేవు. రోగులకు చీటీ రాసిచ్చి బయటి నుంచి తెప్పించుకుని వైద్యం చేస్తున్నామని జూనియర్‌ డాక్టర్లు కర్నూలు ఎంపీకి శనివారం తెలియజేయడం ఇక్కడి దుస్థితిని తెలియజేస్తోంది. మందులు, సిరంజిల కొరత, పరికరాలు పని చేయకపోవడం వంటి సమస్యలు ఆస్పత్రిని వేధిస్తున్నాయి. ఆసుపత్రిలో 1500 పడకల ప్రతిపాదనలు అటకెక్కాయి. ఓ పక్క డెంగీ, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగుల తాకిడికి తగిన పడకలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సమయపాలన పాటించకపోవడంతో భారమంతా పీజీలపై పడుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 6 నెలుగా జీతాలు అందడం లేదు. ఈ నేపథ్యంతో రెండేళ్ల తర్వాత ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి (హెచ్‌డీఎస్‌) సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నారు. 


మొరాయిస్తున్న క్యాథ్‌ ల్యాబ్‌ యంత్రం 


ఆసుపత్రిలో నాలుగు నెలలుగా క్యాథ్‌ ల్యాబ్‌ యంత్రం పనిచేయడం లేదు. గుండె జబ్బు రోగులకు వైద్యం అందించడంలో ఇది అత్యంత కీలకమైనది. 2008లో ఈ యంత్రాన్ని ప్రారంభించారు. ఆరు నెలల క్రితం సమస్య తలెత్తడంతో రూ.2 లక్షలతో మరమ్మతులు చేయించారు. రెండు నెలలు పనిచేశాక.. తిరిగి మొరాయిస్తోంది. ప్రస్తుతం మరమ్మతు చేయాలంటే రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. మరో పక్క ప్రభుత్వానికి రూ.7 కోట్లతో డిజిటల్‌ క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినా అతీగతి లేదు. దీంతో కార్డియాలజీలో ఆంజియోగ్రామ్‌, స్టెంట్‌ పరీక్షలు 4 నెలలుగా నిలిచిపోయాయి. 


రెండింటికీ ఆయనే..


కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌(ఎఫ్‌ఏసీ)గా డా.నరేంద్రనాథ్‌రెడ్డి రెండేళ్ల నుంచి జోడు పదవులను నిర్వహిస్తున్నారు. ఆయన కంటి ఆసుపత్రికి ప్రాధాన్యంఇవ్వడం వల్ల సర్వజన వైద్యశాలలో పరిపాలన సవ్యంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి కర్నూలు జీజీహెచ్‌కి రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ను నియమించలేదు. కపోవడంతో కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అయిన డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డిని జీజీహెచ్‌లో చాలామంది వైద్యులు, సిబ్బంది లెక్కచేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రిలో వారాంతపు తనిఖీలు నిర్వహించకపోవడం, కంటి ఆసుపత్రిలోనే మధ్యాహ్నం వరకు ఉండటం, రోగుల సమస్యలను పట్టించుకోకపోవడం, తనకు అనుకూలమైన వైద్యులతో తప్ప ఇతరుల సలహాలు తీసుకోకపోవడం వల్ల పరిపాలన అదుపు తప్పిందని అంటున్నారు. అడిషనల్‌ డీఎంఈ హోదా కలిగిన రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించాలని రోగులు కోరుతున్నారు. 


పడకలు పెంచేదెప్పుడు..?


కర్నూలు జీజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్యను బట్టి పడకల సంఖ్యను 50 శాతం పెంచాలని అధికారులు మూడేళ్ల క్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆసుపత్రిలో 1,050 పడకలకే గుర్తింపు ఉంది. వీటికే సౌకర్యాలు, మందులు, డైట్‌ మంజూరు అవుతుంది. కానీ ఆసుపత్రిలో 1,700 మంది అడ్మిషన్‌ రోగులు ఉంటారు. 1500 పడకలకు పెంచాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే రోగులకు మెరుగైన సేవలు అందుతాయి.


ఏవీ లేవు


ఆసుపత్రిలో గ్లౌజులు, ఐవీ స్టాండ్‌లు లేవని, రోగులతో బయటి నుంచి తెప్పిస్తున్నామని జూడాల సంఘం నాయకులు కర్నూలు ఎంపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య మూడు నెలలుగా తీవ్రంగా ఉంది. ఆసుపత్రికి సర్జికల్‌ బడ్జెట్‌ మూడు నెలలు (క్వార్టర్‌)కు రూ.89 లక్షలు వస్తుంది. కానీ 2021-22 సంవత్సరానికి మూడో క్వార్టర్‌ (అక్టోబరు నుంచి డిసెంబరు)కు రూ.89 లక్షలకు గాను ప్రభుత్వం రూ.13 లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ బడ్జెట్‌ ఆసుపత్రికి పది రోజులకే సరిపోతుంది. కొన్ని రోజులుగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి దూది, గ్లౌజులు, బ్యాండేజీలు, సిరంజిలు, ప్లాస్టర్ల సరఫరా అగిపోయింది. అత్యవసర విభాగాలు, గైనిక్‌ వార్డుల్లో మందులు, సర్జికల్‌ సామగ్రి కొరత ఉందని వైద్యులు బయటకు రాస్తున్నారు.


జీతాలు అందక..


జీజీహెచ్‌లో 800 మంది ఔట్‌ సోర్సింగ్‌ చిరుద్యోగులకు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. గతంలో హెచ్‌డీఎస్‌ ఉద్యోగులుగా ఉండి, ప్రస్తుతం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా కొనసాగుతున్న 143 మంది ఎల్‌టీలు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఎలక్ర్టీషియన్లు, పంప్‌ ఆపరేటర్లకు 5 నెలలుగా జీతాలు లేవు. శానిటేషన్‌ ఉద్యోగులకు 6 నెలలు, సెక్యూరిటీ గార్డులకు 5 నెలలు, ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు 5 నెలలు, పెస్ట్‌ కంట్రోల్‌ ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. వీరి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కుటుంబాన్ని పోషణ కోసం చాలా మంది రాత్రి పూట ఇతర పనులు చేస్తున్నారు. జీతాలు చెల్లించాలని అధికారులను అడిగితే.. ఒకరిపై మరొకరు చెబుతూ తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. 


సమయపాలన ఏదీ..?


రోగులకు సేవలు అందించడంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కీలకం. కొంత మంది డ్యూటీలు ఎగ్గొట్టి ప్రైవేటు సేవల్లో మునిగిపోతున్నారు. క్యాజువాల్టీ, ఏఎంసీ వంటి అత్యవసర సేవలకు డ్యూటీలో ఉన్న డాక్టర్లు డుమ్మా కొడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో తప్పక ఉండాలి. కానీ ఉదయం 9 గంటలకు బయోమెట్రిక్‌ వేసి మధ్యాహ్నం 12 గంటలకే సొంత క్లినిక్‌లు, బయటి ఆసుపత్రులకు వెళుతున్నారు. బయోమెట్రీ వేయకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేసిన 20 మంది వైద్యులకు మూడు రోజుల క్రితం కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మెమో జారీ చేశారు. మెడిసిన్‌, ఆర్థో, బయోకెమిస్ర్టీ, సర్జరీ విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కూడా మెమో అందుకున్న వారిలో ఉన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు విధులకు సరిగా హాజరు కాకపోవడంతో భారమంతా పీజీలపై పడుతోంది. పీజీలు ఒత్తిడికి గురై రోగులను తిడుతున్న సందర్భాలు ఉన్నాయి.


దాహం.. దాహం


ఆసుపత్రిలో తాగునీటి కొరత తీవ్రంగా నెలకొంది. ఆసుపత్రిలో 1,700 మంది రోగులు అడ్మిషన్‌ పొందుతుంటారు. ఒక్కొక్క రోగికి ఇద్దరు, ముగ్గురు సహాయకులు ఉంటారు. ఈ లెక్కన సుమారు 10 వేల మందికి పెద్ద ఎత్తున తాగునీరు కావాల్సి ఉంది. ఆసుపత్రిలో ఎంఎం-5, ఎంఎ-6 వార్డుల ఎదుట ఒకటి, గైనిక్‌, చిన్న పిల్లల వార్డు దగ్గర రెండు, సర్జికల్‌ విభాగం దగ్గర ఒకటి, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్ద ఓల్డ్‌ సీఎల్‌జీ వెనుక భాగంలో ఒక్కొక్కటి చొప్పున 6 మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తే తాగునీటికి ఇబ్బంది ఉండదు. రెండు పని చేయడం లేదు. మిగిలిన నాలుగింటిలో దారం సైజులో తాగునీరు వస్తోంది. గంటల తరబడి మంచినీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులు, వారి సహాయకులు బయట నుంచి ఒక్కొక్క బాటిల్‌ రూ.10 నుంచి 15 వెచ్చించి కొని తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరిన రోజే రోగులు చిన్న నీటి బిందెను వెంట తెచ్చుకోవాల్సి వస్తోంది. తాగునీటి కోసమే ప్రతి రోజు ఒక్కో రోగికి సహాయకులు రూ.150 వెచ్చించాల్సి వస్తోంది.


ధ్వంసమైన మరుగుదొడ్లు


అత్యవసర రోగులకు చికిత్స అందించే అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో ఆరు నెలలుగా బాత్‌రూమ్‌లు వినియోగంలో లేవు. రోగులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏఎంసీలో మెడిసిన్‌, సర్జరీ విభాగాలకు 43 పడకలు ఉన్నాయి. అత్యవసర రోగులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి కీలకమైన విభాగంలో బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు ధ్వంసమయ్యాయి. కొత్త పైపులు వేసి సమస్యను పరిష్కరించాల్సిన ఆసుపత్రి అధికారులు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. 


తాగునీటికి రూ.200 ఖర్చు..


నా భార్యకు సిజేరియన్‌ కాన్పు కోసం వచ్చాము. ఆసుపత్రిలో మంచినీరు లేదు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నా దారం సైజులో మంచి నీరు వస్తోంది. గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ప్రతిరోజూ బయట కొంటున్నాం. రోజుకు రూ.200 తాగునీటికే ఖర్చు అవుతోంది. బయట ఒక వాటర్‌ బాటిల్‌కి రూ.10 తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో కనీసం తాగునీరు లేకపోవడం దారుణం.                                     

 - రాజు, ఆదోని 


అన్ని బయటే..


మా కోడలు శాంతమ్మ మొదటి కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చాము. 12 రోజులయింది. సిజేరియన్‌ చేశారు. ఇప్పటి వరకు రూ.20 వేలు ఖర్చు అయింది. గ్లౌజులు, పరీక్షలు, మందులన్నీ బయటికే రాసిస్తున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, పడకలు మాత్రమే ఫ్రీ. మిగిలినవన్నీ బయట కొనాల్సిందే. వీల్‌చైర్‌పై తీసుకెళ్లడానికి డబ్బులు అడుగుతున్నారు.


 - నరసింహులు, గోనెగండ్ల 


నేడు హెచ్‌డీఎస్‌ సమావేశం


ఆసుపత్రి అబివృద్ధి సలహా కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నాం. ఎక్కడ అన్నది నిర్ణయించలేదు. అభివృద్ధి పనులకు హెచ్‌డీఎస్‌లో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఎంసీలో బాత్‌రూమ్‌ల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాము. సెకండ్‌ వేవ్‌ కొవిడ్‌ తర్వాత గ్లౌజుల వాడకం విపరీతంగా పెరిగింది. వైద్యులకంటే సిబ్బంది ఎక్కువగా వాడుతున్నారు. బయట కూడా గ్లౌజులు దొరకడం లేదు. 


 - డా.జి.నరేంద్రనాథ్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌ 

Updated Date - 2021-10-12T05:29:25+05:30 IST