ప్రభుత్వ నిఘా కల్పితం

ABN , First Publish Date - 2021-07-23T07:26:04+05:30 IST

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారన్న కథనం పూర్తిగా కల్పితం, నిరాధారమైనదని

ప్రభుత్వ నిఘా కల్పితం

  • అవన్నీ నిరాధార వార్తలే.. ఇలాంటివి భారత్‌లోనే సాధ్యం
  • ఆమ్నెస్టీ కూడా వాటిని తిరస్కరించింది..  అయినా విపక్షాల రభస
  • కాంగ్రెస్‌ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తోందా?: మీనాక్షి లేఖి ధ్వజం

 

న్యూఢిల్లీ, జూలై 22: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారన్న కథనం పూర్తిగా కల్పితం, నిరాధారమైనదని బీజేపీ ఆరోపించింది. ఈ కథనంపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత మీనాక్షి లేఖి గురువారం విలేకర్లతో మాట్లాడారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కూడా పెగాసస్‌ జాబితాలో ఉన్న నంబర్లు నిఘా కోసం ఉద్దేశించినవి కాదని పేర్కొందంటూ వార్తలు వచ్చాయని చెప్పారు. మొబైల్‌ నంబర్లను ఎల్లో పేజెస్‌ నుంచి సేకరించి ‘ఎల్లో జర్నలిజం’ కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ను 10 దేశాల్లో వినియోగించినట్లు వార్తలు వచ్చాయని.. మనదేశంలో మాత్రమే కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయని మీనాక్షి చెప్పారు.




పెగాసస్‌ జాబితాలోని నంబర్లు టార్గెట్లే

ఆ నంబర్లపై నిఘా లేదని మేం చెప్పలేదు: ఆమ్నెస్టీ


కాగా, పెగాసస్‌ ప్రాజెక్టులో గుర్తించిన నంబర్లు ఎన్‌ఎ్‌సవో గ్రూపు టార్గెట్‌గా చేసుకునే ముప్పు ఉన్నవేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. ఇటీవల లీకైన ఫోన్‌ నంబర్లు పెగాసస్‌ స్పైవేర్‌ లక్ష్యంగా చేసుకున్నవి కాదని ఆమ్నెస్టీ స్పష్టం చేసిందంటూ కొందరు ఇజ్రాయెల్‌ జర్నలిస్టులు పేర్కొన్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ స్పందించింది. అవన్నీ ఊహాగానాలేనని తెలిపింది. స్పైవేర్‌ జాబితాలో ఉన్న ఫోన్‌ నంబర్లన్నీ నిఘా ముప్పు ఉన్నవేనని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-07-23T07:26:04+05:30 IST