సర్కారు వారి స్ర్కీన్‌ ప్లే

ABN , First Publish Date - 2021-09-09T09:13:45+05:30 IST

ఇది సర్కారు వారి ‘సినిమా’ పాట! ఇకపై ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయిస్తుంది. రైల్వే టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొన్న తరహాలోనే... సినిమా టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌ ద్వారా కొనాలన్న మాట! దీనిపై బుధవారం ఆదేశాలు..

సర్కారు వారి స్ర్కీన్‌ ప్లే

  • సినిమా టికెట్ల వ్యాపారంలోకి ప్రభుత్వం 
  • ఎఫ్‌డీసీ ద్వారా ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు
  • పల్లె నుంచి నగరం దాకా అందులో కొనాల్సిందే
  • బుక్‌ అయిన ప్రతి టికెట్‌పై ప్రభుత్వానికి ఆదాయం
  • ఆ ఆదాయం చూపి అప్పులు తెచ్చుకునే ఉపాయం?
  • కొన్నాళ్లు టికెట్‌ సొమ్ములు వాడుకునేందుకూ చాన్స్‌!
  • థియేటర్ల యజమానులు, పరిశ్రమ సర్కారు గుప్పిట్లో
  • ‘అప్పుల అప్పారావు’ను మించిన రుణోపాయాలు


వైసీపీ సర్కారు సరికొత్త ‘స్ర్కీన్‌ప్లే’ రచించింది. ‘బాక్సాఫీసుల’ను బద్దలుకొట్టి ఆదాయం పిండుకునే సరికొత్త సినిమా మొదలుపెట్టింది.  ప్రభుత్వమే ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా మాత్రమే సినిమా టికెట్లు కొనుగోలు చేయాలంటూ కొత్త నిబంధన అమలులోకి తెస్తోంది. సినిమా టికెట్‌ ధరల క్రమబద్ధీకరణ, పారదర్శకత వంటి ‘డైలాగులు’ చెబుతున్నప్పటికీ... సొమ్ములు చేసుకోవడమే ఉద్దేశమని సమాచారం! ప్రభుత్వ ఆస్తుల నుంచి మద్యం ఆదాయం వరకు దేనినీ వదలకుండా తాకట్టుపెట్టి.. అప్పులు తెచ్చుకుంటున్న సర్కారు.. చివరికి సినిమా టికెట్ల వ్యాపారంలోనూ అడుగుపెట్టి, సొమ్ములు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ప్రేక్షకుడికి ఇబ్బందే...

ప్రస్తుతం థియేటర్ల సొంత వెబ్‌సైట్లతోపాటు అనేక ప్రైవేట్‌ సంస్థలు వెబ్‌సైట్ల ద్వారా సినిమా టికెట్లు విక్రయిస్తున్నాయి. బుకింగ్‌పై ఆఫర్‌లు కూడా ప్రకటిస్తుంటాయి. ఒక్కసారి ప్రభుత్వం ఈ రంగంలోకి దిగిన తర్వాత... ఇతర పోర్టళ్ల కథ క్లైమాక్స్‌కు చేరినట్లే. కేవలం ప్రభుత్వ వెబ్‌ సైట్‌ ద్వారానే టికెట్‌ కొనుగోలు చేయాలనడం గుత్తాధిపత్యం కిందకే వస్తుంది. అంతేకాదు... దీనిద్వారా థియేటర్ల యజమానులు, సినిమా పరిశ్రమను కూడా గుప్పిట్లో పెట్టుకునే స్కెచ్‌ వేసిందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. 


  మూడు లాభాలు 

1) బుక్‌ చేసే ప్రతి సినిమా టికెట్‌కూ కొంత రుసుము వసూలు చేసి ఆదాయం పొందడం.

2) అలా వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి రుణం పొందడం.

3) టికెట్లు విక్రయించగా వచ్చిన సొమ్మును వెంటనే థియేటర్ల యజమానులకు ఇవ్వకుండా... అవసరానికి వాడుకోవడం.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఇది సర్కారు వారి ‘సినిమా’ పాట! ఇకపై ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయిస్తుంది. రైల్వే టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొన్న తరహాలోనే... సినిమా టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌ ద్వారా కొనాలన్న మాట! దీనిపై బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి. ఒక మోస్తరు పట్టణాల నుంచి నగరాల వరకు పేటీఎంతో మొదలుకుని బుక్‌మైషో వంటి వెబ్‌సైట్‌లు, యాప్‌లతో టికెట్లు కొనేస్తున్నారు. మరి... ఇప్పుడు ఇదే వ్యాపారంలోకి సర్కారు ఎందుకు ప్రవేశిస్తోంది? ప్రైవేటు వ్యక్తులకు చెందిన సినిమా థియేటర్ల టికెట్లను ప్రభుత్వం అమ్మడం ఎందుకు? ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమిటి? దీనిపై ఆరా తీస్తే... కొత్త అప్పులు పుట్టించుకోవడంతోపాటు మరిన్ని మార్గాల్లో ఆదాయం పొందేందుకే ఈ తిప్పలు అనే సమాధానం వస్తోంది.


ఇదో కొత్త స్ర్కీన్‌ప్లే...

అప్పులు పుట్టించుకునేందుకు జగన్‌ ప్రభుత్వం రకరకాల గిమ్మిక్కులు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుల కోసమే  కార్పొరేషన్లను సృష్టించారు. భవిష్యత్‌ మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి  పాతిక వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్నారు. అయినా... ఏరోజుకారోజు డబ్బులకోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఈ క్రమంలో... సర్కారు పెద్దల కన్ను సినిమా టికెట్ల వ్యాపారంపై పడినట్లు తెలుస్తోంది. దీనిప్రకారం... రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల టికెట్లను ఫిలిమ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) ద్వారా విక్రయిస్తారు. దీనికోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పా టు చేస్తారు. బుక్‌ చేసిన ప్రతి టికెట్‌కు కొంత రుసు ము వసూలు చేస్తారు. ఆ ఆదాయమంతా సర్కారుకే వెళుతుంది. ఇలా పదేళ్లు లేదా ఇరవైళ్లలో వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి.. దానిని హామీగా చూపించి కొత్త అప్పు తెచ్చుకోవడానికే సినిమా టికెట్ల వ్యాపారంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఇకపై రాష్ట్రంలోని ఏ, బీ, సీ సెంటర్ల లో.. ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ కొనాలి. స్మార్ట్‌ ఫోన్‌, గూగుల్‌పే, నెట్‌ బ్యాంకింగ్‌ లేదు.. మేం థియేటర్‌కు వెళ్లి క్యూలో నిలబడిటికెట్‌ కొంటాం అంటే కుదరదు.  పల్లెటూరులోని సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ నుంచి నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల దాకా ప్రభుత్వ పోర్టల్‌ నుంచే టికెట్లు కొనాలి. ఎవరైనా నేరుగా థియేటర్‌కు వెళితే... బుకింగ్‌ కౌంటర్‌ సిబ్బంది ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ తీయించే పరిస్థితి కల్పించే అవకాశముంది.


‘డబ్బుల్‌’ ధమాకా... 

థియేటర్లు ఒకరివి.. సినిమా చూసేది ప్రేక్షకుడు! కానీ.. మధ్యలో ప్రభుత్వం వేలు పెడుతోంది. ప్రేక్షకుల డబ్బులు తొలుత ప్రభుత్వ ఖాతాలోకి వెళాయి. ఆ తర్వాత... వాటిని ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకు చెల్లిస్తుందా? ఇదే పెద్ద సందేహం. సర్కారు వారి ఆర్థిక ఇబ్బందులు తెలియనివి కావు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధినీ వాడేసుకుంది. రోడ్ల బాగుపేరిట పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న అదనపు సెస్సు ఎక్కడికి పోతుందో తెలియదు. చివరికి... సీపీఎస్‌ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ కూడా సరిగా చెల్లించడంలేదు. మరి.. ఇదే తరహాలో సినిమా టికెట్ల సొమ్ములూ వాడేసుకోరు అనే గ్యారెంటీ ఏమిట ని థియేటర్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ బుకింగ్‌లో టికెట్లు విక్రయించే సంస్థలు 24 గంటలు తిరక్కుండానే డబ్బును థియేటర్ల ఖాతాలో జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇలాగే ఇస్తుం దా? ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటి? గట్టిగా నిలదీస్తే... తనిఖీలతో వేధింపులు తప్పవా? ఇలా ఎన్నెన్నో సందేహాలు! ఎఫ్‌డీసీ ద్వారా టికెట్లు విక్రయించాలన్న ఆలోచన వెనుక కొత్త అప్పులు పుట్టించుకోవడంతోపాటు, అవసరానికి కొన్నాళ్లయినా టికెట్ల సొమ్ము వాడుకోవచ్చుననేదే సర్కారు వారి ఉద్దేశం అని చెబుతున్నారు. దీంతోపాటు పన్నులను ముందే జమ చేసుకోవచ్చు.


పారదర్శకత కోసమే..

సినిమా టికెట్ల ధరల్లో పారదర్శకత కోసమే ఎఫ్‌డీసీ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. రైల్వే ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు బుధవారం జీవో జారీ చేసింది. ఏపీ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షణలో నిర్వహించే ఈ సైట్‌ విధివిధానాలు రూపొందించేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఐటీ, ఐఅండ్‌ పీఆర్‌, ఎఫ్‌డీసీ, వాణిజ్య పన్నుల ఉన్నతాధికారులతో పాటు 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. 

Updated Date - 2021-09-09T09:13:45+05:30 IST