ప్రభుత్వ భూములు సర్వే చేసి సేకరించాలి

ABN , First Publish Date - 2020-05-15T10:31:43+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ఇరిగేషన్‌, ఎస్సారెస్పీ కాలువల కింద గల ప్రభుత్వ భూములను గుర్తించి భూసేకరణ చేయాలని జిల్లా కలెక్టర్‌

ప్రభుత్వ భూములు సర్వే చేసి సేకరించాలి

వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి

కలెక్టర్‌ కె. శశాంక


కరీంనగర్‌, మే 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రభుత్వ, ఇరిగేషన్‌, ఎస్సారెస్పీ కాలువల కింద గల ప్రభుత్వ భూములను గుర్తించి భూసేకరణ చేయాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్‌  సమావేశ మందిరంలో రెవెన్యూ, గ్రామీణాభివృద్థి శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకముందే అధికారులు సమన్వయంతో భూసేకరణ చేసి బౌండరీలు వేయాలన్నారు. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే వాటిని ఖాతాల వారీగా గుర్తించి స్వాధీన పరుచుకోవాలని అన్నారు.


వచ్చే వారం నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అన్నారు. మండలాల వారీగా ఏయే రంగాలలో ఎంతమంది వలస కార్మికులు పనిచేస్తురో వారి  వివరాలు సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పక్క రాష్ట్రాల వారికి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలలోకి వస్తున్నందున వారిని గుర్తించి స్టాంపు వేసి తప్పని సరిగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఆర్‌వో పవన్‌కుమార్‌, కరీంనగర్‌, హుజురాబాద్‌ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్‌, పిబెన్‌ షలోమ్‌, డీఆర్‌డీఎ పీడీ వెంకటేశ్వర్‌రావు, డీసీవో మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై సమీక్ష 

కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ కె.శశాంక వ్యవసాయ సమగ్ర ప్రణాళికపై వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ, నీటి పారుదల శాఖ ఇరిగేషన్‌ అధికారులు, ముఖ్య ప్రణాళికాధికారి, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం నీటి విడుదల, ప్రస్తుతం సాగునీటి లభ్యత, వర్షపాతం వివరాలు, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సరళిపై సమీక్షించారు. ఈ సమావేశంలో వ్యవసాయాధికారి శ్రీధర్‌, ఉద్యానవ న శాఖ అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-15T10:31:43+05:30 IST