కార్మికుల ఉనికికే ప్రమాదం తెచ్చేలా ప్రభుత్వ చట్టాలు

ABN , First Publish Date - 2020-05-21T10:14:49+05:30 IST

కార్మికుల ఉనికికే ప్రమాదం తెచ్చేలా ప్రభుత్వాలు చట్టాలు చేయడం దారుణం అని బీఎంఎస్‌ జోనల్‌ ఇన్‌చార్జి సుధీర్‌కుమార్‌ అన్నారు.

కార్మికుల ఉనికికే ప్రమాదం తెచ్చేలా ప్రభుత్వ చట్టాలు

బీఎంఎస్‌ జోనల్‌ ఇన్‌చార్జి సుధీర్‌కుమార్‌


జగిత్యాల అర్బన్‌, మే 20: కార్మికుల ఉనికికే ప్రమాదం తెచ్చేలా ప్రభుత్వాలు చట్టాలు చేయడం దారుణం అని బీఎంఎస్‌ జోనల్‌ ఇన్‌చార్జి సుధీర్‌కుమార్‌ అన్నారు. బుధవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ కలెక్టరేట్‌, మండల కార్యాలయాల ఎదుట నిరసనకు పిలుపు నిచ్చింది. దీనిలో భాగంగా జగిత్యాల కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో అరుణశ్రీకి వినతిపత్రం సమర్పించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా ముసుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులపై దాడి చేస్తున్నాయని, గతంలో కార్మిక హక్కులపై ఏనాడు ఇంత దాడి జరగలేదన్నారు. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కితీసుకోవడంతో పాటు, కార్మిక చట్టాల సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, ఎనిమిది గంటల పనిదినాన్ని కొనసాగించాలని, లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన వేతనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి యాజమాన్యాలు చెల్లించేలా చూడాలని, ఈపీఎఫ్‌ పెన్షన్‌ స్కీం 1995 ప్రకారం కనీస పెన్షన్‌ రూ.5000 నిర్ణయించాలని, అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా  అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో బీఎంఎస్‌ నాయకులు ఎదులాపురం సత్యం, కట్ట విజయ్‌ కుమార్‌, రాంచంద్రం , గిన్నెల సురేష్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-21T10:14:49+05:30 IST