‘ఆంధ్రజ్యోతి’పై సర్కారు పెద్దల అక్కసు!

ABN , First Publish Date - 2021-04-08T07:21:56+05:30 IST

గాజువాక పరిధిలోని ఆటోనగర్‌ ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ ఏ-బ్లాక్‌(మింది)లో రాయుడు అనే పారిశ్రామికవేత్త చాలా ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని తీసుకొని గోదాములు నిర్మించారు. వాటిని ఆయన పలు కంపెనీలు, పరిశ్రమలకు లీజుకు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఈ గోదాములు నడుస్తున్నాయి.

‘ఆంధ్రజ్యోతి’పై సర్కారు పెద్దల అక్కసు!

  • -విశాఖలో పత్రిక ముద్రణ కేంద్రం కూల్చివేత
  • -లీజుకు తీసుకున్న గోడౌన్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌
  • -అదే ఆవరణలో యజమానికి పలు గోదాములు
  • -అక్రమ నిర్మాణాలంటూ అధికారుల హల్‌చల్‌
  • -పాత తేదీలతో గోడలకు ‘కొత్త నోటీసులు’
  • -ముందే నోటీసులు ఇచ్చామంటూ హైడ్రామా
  • -యంత్రాలు భద్రపరుచుకునేందుకూ నిరాకరణ
  • -కూల్చివేతపై సాయిరెడ్డి అనుచరుడి పర్యవేక్షణ
  • -‘త్వరగా కూల్చండి’ అంటూ అధికారులకు ఫోన్‌
  • -పది నిమిషాలకోసారి ఫోన్‌ చేసి ఒత్తిడి
  • -కూలగొట్టే ఫొటోలు పంపించాలని హుకుం
  • -కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు
  • -దానికీ అధికారుల వక్రభాష్యం
  • -గేటుకు తాళం వేసుకుని పోతామని వాదన
  • -అదే ఆవరణలోని ఇతర గోదాములూ కూల్చివేత
  • -‘ఆకస్మిక దాడి’పై యజమానుల ఆందోళన


సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై అక్షరాస్త్రాలు సంధిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు బరితెగించారు. విశాఖలో లీజుకు తీసుకుని ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను ముద్రిస్తున్న గోడౌన్‌ గోడలు కూల్చివేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ‘స్టేటస్‌ కో’ తెచ్చుకున్నప్పటికీ... కోర్టు ఆదేశాలకు వక్రభాష్యాలు చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లుగా తెల్లవారుజామునే పొక్లైన్లతో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. లోపలున్న వస్తువులు కాపాడుకునే అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలు ప్రారంభించారు. 


విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గాజువాక పరిధిలోని ఆటోనగర్‌ ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ ఏ-బ్లాక్‌(మింది)లో రాయుడు అనే పారిశ్రామికవేత్త చాలా ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని తీసుకొని గోదాములు నిర్మించారు. వాటిని ఆయన పలు కంపెనీలు, పరిశ్రమలకు లీజుకు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఈ గోదాములు నడుస్తున్నాయి. ఇందులో ఒక గోదామును ఆరేళ్ల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ సంస్థ అద్దెకు తీసుకుంది. అందులోనే ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తోంది. ఏదో ఒకవిధంగా ‘ఆంధ్రజ్యోతి’కి ఇబ్బందులు కలిగించాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రయత్నిస్తున్న వైసీపీ పెద్దలు ఇక్కడ పావులు కదిపారు. రాయుడు గోడౌన్లు ఉన్న బ్లాక్‌-ఏలో అనధికారికంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారంటూ బుధవారం తెల్లవారకముందే రంగంలోకి దిగారు. గాజువాక పోలీసులు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ యతిరాజులు, ‘ఐలా’ (ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) కమిషనర్‌ శామ్యూల్‌, గాజువాక తహసీల్దార్‌ లోకేశ్వరరావు తదితర అధికారులు వందమంది సిబ్బందితో వచ్చి గోడౌన్ల కూల్చివేత ప్రారంభించారు. ప్రస్తుతం గోదాముల యజమానిగా ఉన్న రాయుడు కుమారుడు అవినాశ్‌కుగానీ, వాటిని లీజుకు తీసుకున్న సంస్థలకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. కూల్చివేతల గురించి తెలిసి అక్కడకు చేరుకున్న యజమాని అవినాశ్‌ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ‘లోపలకు ఎవ్వరినీ అనుమతించొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి’ అంటూ గేటు దగ్గరి నుంచే వెనక్కి పంపేశారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఇలా అకస్మాత్తుగా కూల్చేస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ‘‘నోటీసులు ఇచ్చాం. కావాలంటే.. గేటుకు అంటించి ఉన్నాయి! వెళ్లి చూసుకోండి’’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.


పాత తేదీలు... కొత్త నోటీసులు

‘ముందస్తు నోటీసులు ఇచ్చాం’ అంటూ అధికారులు ఒక హైడ్రామాకు తెరలేపారు. పాత తేదీలు వేసి... ‘తాజా’గా తయారు చేసిన నోటీసులను గేటుకు అంటించారు. డిసెంబరు 15న ఒకటి, ఫిబ్రవరి 25న మరొకటి జారీ చేసినట్లుగా రెండు నోటీసులు గోడకు కనిపించాయి. నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో భారీవర్షం కురిసింది. చెట్లు కూలిపోయి, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. హోర్డింగ్‌లు కూడా చిరిగిపోయాయి. చిత్రమేమిటంటే... నాలుగు నెలలక్రితం, 40 రోజుల కిందట గోడకు అంటించిన నోటీసులు మాత్రం తాజాగా కళకళలాడుతున్నాయి. వాటిపై అధికారులు సంతకం చేసిన సిరా, అధికార ముద్రలు కూడా ఏమాత్రం వెలిసిపోకుండా చక్కగా కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే... యజమానికిగానీ, లీజుదారులకుగానీ సమాచారం ఇవ్వకుండా...  మంగళవారం మధ్యాహ్నం వాటిని గుట్టుచప్పుడు కాకుండా అంటించినట్లు తెలిసింది. అంటే చెప్పకుండానే చెప్పినట్లు, నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఒక కథ అల్లి... కూల్చివేతలకు వచ్చేశారు.


విజయసాయి అనుచరుడి పర్యవేక్షణ

విశాఖపై అధికార పార్టీ తరఫున పెత్తనం చలాయిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డికి అక్కడ ఒక కోర్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా రాయలసీమకు చెందిన వారే. ఒక్కొక్కరు ఒక్కో శాఖ వ్యవహారాలను ‘డీల్‌’ చేస్తారు. ఉదాహరణకు... సుభాష్‌ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ, దేవదాయ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ప్రతా్‌పరెడ్డి అనే వ్యక్తి పరిశ్రమలు, ‘గిట్టని వ్యక్తుల’కు సంబంధించిన ఆస్తుల కూల్చివేతల సంగతులు చూస్తుంటారు. ‘ఆంధ్రజ్యోతి’ లీజుకు తీసుకున్న గోదాము కూల్చివేత వ్యవహారాన్ని ప్రతాప్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి పది నిమిషాలకోసారి ఏపీఐఐసీ అధికారులకు ఫోన్‌ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ గోదాము కూల్చివేత ఎంతవరకు వచ్చిందంటూ పదేపదే ప్రశ్నిస్తూ ఒత్తిడి తెచ్చారు. ‘ఇదిగో గోడలు కొడుతున్నాం’ అని అధికారులు సమాధానం చెప్పగా... వెంటనే ఫొటోలు పెట్టాలని హుకుం జారీ చేశారు. గోడౌన్‌ కూల్చివేత ఫొటోలు పంపిన తర్వాతే ఆయన నుంచి అధికారులకు ఫోన్లు ఆగిపోవడం గమనార్హం. 


విద్యుత్‌ సరఫరా నిలిపివేత

‘ఆంధ్రజ్యోతి’ పత్రిక విశాఖపట్నంలో ప్రింట్‌ కాకుండా చేసేందుకు వైసీపీ పెద్దలు మరింత కుట్రపూరితంగా వ్యవహరించారు. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని, ముద్రణ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉండటంతో... విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కూల్చివేత వ్యవహారాలను పర్యవేక్షించడానికి గాజువాక సీఐ, ఎస్‌ఐ, తహసీల్దార్‌లతోపాటు కస్టమ్స్‌ అధికారులు, స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది కూడా వచ్చారు. ఆ ప్రాంగణంలో గోడౌన్లు ఏర్పాటు చేసుకున్న సంస్థల ప్రతినిధులెవరినీ  లోపలికి అనుమతించలేదు. ఇది చాలా దారుణమని, విలువైన వస్తువులు పాడైపోతాయని, కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని, నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని లీజుదారులు ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా అధికారులు దేనికీ సమాధానం ఇవ్వలేదు. ఆఖరుకు జిల్లా అధికారి కూడా... ‘నాకు ఈ కూల్చివేత విషయం తెలియదు’ అని తప్పించుకున్నారు. 


కోట్ల విలువైన యంత్రాలున్నా...

గోదాములో కోట్ల విలువైన యంత్రాలను అమర్చి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను ముద్రిస్తున్నారు. ముద్రణకు సంబంధించిన న్యూస్‌ప్రింట్‌, ఇతర పరికరాలూ ఉన్నాయి. అడ్డదిడ్డంగా గోడౌన్‌ను కూల్చివేస్తే యంత్రాలన్నీ పాడయ్యే ప్రమాదముందని... వాటిని భద్రపరుచుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని ఏపీఐఐసీ అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్‌ రామకృష్ణ కోరారు. అందుకు అధికారులు అంగీకరించలేదు. ‘‘మా చేతుల్లో ఏమీ లేదు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే నడుచుకుంటున్నాం’’ అని తెలిపారు. అలాగైతే యంత్రాలకు నష్టం జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పడంతో... రెండు గోడలు కూల్చి, ఆ తర్వాత ఆగిపోయారు. ‘ఆంధ్రజ్యోతి’ గోడౌన్‌ను మాత్రమే కూలగొడితే విమర్శలు వచ్చే అవకాశం ఉందని... అదే ప్రాంగణంలో అమెజాన్‌, విష్ణు కెమికల్స్‌, మైలాన్‌, హోమ్‌టౌన్‌ సంస్థలు ఉపయోగిస్తున్న గోడౌన్లను కూడా కూల్చేశారు.


గిట్టకుంటే గునపమే

విశాఖలో తమకు గిట్టనివారి ఆస్తులపై గునపం దించడం కొత్తేమీ కాదు. టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీతో కూల్చివేతలు మొదలయ్యాయి. తరువాత గీతం వర్సిటీలో కొన్ని నిర్మాణాలు, ఏయూ వద్ద ఎమ్మెల్యే వెలగపూడి సానుభూతిపరుల నివాసాలు, దుకాణాలు కూల్చివేశారు. బీచ్‌రోడ్డులో కాశీనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ కేంద్రాన్ని తొలగించారు. గంటా శ్రీనివాసరావు భూమి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ గోడౌన్‌ కూల్చివేశారు. వీటివెనుక రాజకీయ దురుద్దేశాలు, విజయసాయిరెడ్డి హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ‘ఆంధ్రజ్యోతి’ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ పెద్దలు రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా రు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ప్రకటనలను నిలిపివేశారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’కి కొమ్మాది వద్ద మంజూరు చేసిన స్థలంలో కొత్త కార్యాలయ నిర్మాణం కోసం పనులు చేపడుతుండగా గతేడాది అడ్డంపడ్డారు. లేనిపోని కారణాలు చూపించి ఆ స్థలం కేటాయింపు రద్దు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. దానిపై న్యాయపోరాటం జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా మిందిలో పత్రిక ప్రింటింగ్‌ ప్రెస్‌ గోడౌన్‌ను కూల్చివేశారు. 


హైకోర్టు స్టేట్‌స్‌కో ఇచ్చినా... దొంగ ఎత్తులు

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ, ‘ఆంధ్రజ్యోతి’ తరఫున మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి వెంటనే నిర్మాణాల కూల్చివేత ఆపాలని ఆదేశించారు. దాంతో అధికారులు బుధవారం సాయంత్రం అక్కడి నుంచి కదిలారు. స్టేటస్‌కో అంటే... అధికారులు కొత్తగా కూల్చివేతలు చేపట్టరాదు. కూల్చిన వాటిని సంబంధిత వ్యక్తులు పునర్‌ నిర్మించుకోకూడదు. ఎక్కడ ఉన్నది అక్కడ అలా వదిలేయాలి. అంతేతప్ప... అక్కడ సాధారణంగా జరిగే కార్యకలాపాలు నిర్వహించకూడదని కాదు. ఆ ఆవరణలో ఎవ్వరూ ఉండకూడదనీ లేదు. కానీ... దీనికీ అధికారులు వక్రభాష్యం చెప్పారు. గోదాముల ఆవరణలోకి ఎవ్వరూ వెళ్లకుండా గేటుకు తాళం వేస్తామని, లోపల ఎవరూ ఉండకూడదని వితండ వాదన మొదలుపెట్టారు. ఏపీఐఐసీ మేనేజర్‌ సహా పదిమంది అధికారులు బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే ఉన్నారు. పోలీసు బందోబస్తుతో గేటుకు తాళం వేయాలని భావించారు. చివరికి... స్టేటస్‌కోపై హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉండటంతో వెనక్కితగ్గారు.


ఇదేనా న్యాయం!?

  • -విలువైన వస్తువులున్నా కూల్చివేతలు
  • -లీజుదారులను అనుమతించకుండా కట్టడి

‘అక్రమ నిర్మాణాలు’ అంటూ అధికారులు కూల్చివేసిన గోదాములు అక్కడ కొత్తగా కట్టలేదు. ఎన్నో ఏళ్ల కిత్రమే వాటిని నిర్మించారు. ‘ఐలా’కు వాటి యజమాని పన్నులు కడుతూనే ఉన్నారు. అన్నింటికీ మించి... ఆ గోదాములను వేర్వేరు సంస్థలు లీజుకు తీసుకుని, తమ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నాయి. కట్టడం అక్రమమో, సక్రమమో నిర్ధారించుకునే అవకాశం వీరికి ఉండదు. అయినా సరే...  లీజుదారులకు కనీస వెసులుబాటు ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలకు దిగారు. గోదాముల్లో ఎలాంటి వస్తువులున్నాయో కూడా చూడలేదు. అత్యవసరం, అతి ముఖ్యమైన దినపత్రిక ముద్రణ యంత్రాలున్నాయని కూడా చూడకుండా ‘ఆంధ్రజ్యోతి’ గోదాము గోడలను కూల్చివేశారు. అదే ఆవరణలో ఒక రసాయనాల గోదాము కూడా ఉంది. లోపలున్నవి ఎలాంటి రసాయనాలు, వాటితో ఎలా వ్యవహరించాలనే స్ప్పహ కూడా లేకుండా గోడలు కూల్చేశారు. ఇక... అదే ఆవరణలో అమెజాన్‌, హోమ్‌టౌన్‌ సంస్థలకు గోదాములున్నాయి. ఇక్కడి నుంచే కొనుగోలుదారులకు వస్తువులు డెలివరీ చేస్తారు. వాటినీ కూల్చివేశారు. అన్నింటికంటే దారుణమేమిటంటే... కూల్చివేతల సమయంలో లీజుదారులెవరినీ లోపలికి అనుమతించలేదు. గోదాము యజమానిదే కావొచ్చు. కానీ... అందులో ఉన్న వస్తువులు/సామాగ్రి లీజుదారులవి. వాటి పరిస్థితి ఏమిటి, ఎలా కాపాడుకోవాలి అనే లీజుదారుల ఆందోళనను పట్టించుకోలేదు. 18 ఎకరాలను ఏపీఐఐసీ నుంచి వేలంలో అధికారికంగా కొనుక్కొని అందులో గోదాములు నిర్మించారు. చివరికి... వాటి యజమానినీ గేటువద్దే నిలిపివేశారు. ఎన్ని ప్రశ్నలడిగినా ఒక్కటే సమాధానం... ‘మాకు పైనుంచి ఉత్తర్వులున్నాయి. ఎవ్వరినీ అనుమతించం!’ ఇదీ అధికారుల వైఖరి!

Updated Date - 2021-04-08T07:21:56+05:30 IST