వైద్య విద్య కోసం.. ప్రభుత్వ కళాశాలలవైపే.. ఎందుకు మొగ్గుచూపుతారంటే..!

ABN , First Publish Date - 2021-10-27T14:15:48+05:30 IST

తమ పిల్లల చదువుల కోసం..

వైద్య విద్య కోసం.. ప్రభుత్వ కళాశాలలవైపే.. ఎందుకు మొగ్గుచూపుతారంటే..!

అక్కడే ఎంబీబీ‘ఎస్‌’!

అక్కడే విద్యార్థులకు అనుభవపూర్వకమైన విద్య

ఫలితాలూ అలాగే.. ఈ ఏడాది 97శాతం ఉత్తీర్ణత

ప్రైవేటులో 92.7శాతమే.. కొత్త కాలేజీల్లోనైతే 80లోపే


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వ విద్యాసంస్థల కన్నా ప్రైవేటు విద్యాసంస్థలవైపే తల్లిదండ్రులు మొగ్గుచూపుతారు. ఇది ఏళ్లుగా ఉన్న ధోరణే. వైద్య విద్య మాత్రం ఇందుకు మినహాయింపు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు కోసం ఎంతో పోటీ ఉంటుంది. సీటు వచ్చిందంటే  వైద్య విద్య పూర్తి చేసినట్లేనన్న భావన ఏర్పడుతుంది. ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం చాలా మెరుగ్గా ఉంటోంది. ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కాళాశాలల్లో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత 97.4 శాతంగా నమోదైంది.. పాత ప్రైవేటు వైద్య కళాశాలల్లో 92.7శాతం, కొత్త ప్రైవేటు వైద్య కళాశాలల్లో 80 శాతంలోపు ఉత్తీర్ణత ఉంటున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. కొన్ని మైనారిటీ వైద్య కళాశాలల్లోనైతే చాలా తక్కువగా ఉత్తీర్ణత శాతం ఉంటున్నట్లు సమాచారం. 


ప్రభుత్వ కాలేజీల్లో ఎందుకెక్కువ! 

ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లో సీట్లు అన్ని కన్వీనర్‌ కోటా కింద కేటాయిస్తారు. మంచి ర్యాంకు సాధించిన వారికే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వస్తాయి. బోధన, అనుబంధ ఆస్పత్రులకు పెద్దసంఖ్యలో రోగులు వస్తారు. ఫలితంగా అనుభవపూర్వకమైన విజ్ఞానం బాగా వస్తుంది. తద్వారా ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో పూర్థిస్థాయిలో ప్రమాణాలు పాటించేవి కొన్నే ఉన్నాయి. వాటిలోని సీట్లకే మంచి డిమాండ్‌ ఉంటుంది. కొత్తగా ఏర్పాటైన వైద్య కాలేజీల్లో ఎక్కువగా బీ, సీ కేటగిరీ విద్యార్ధులు చేరుతున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కువగా యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 50 శాతం సీట్లు ఉంటాయి. ఆ కోటా కింద సీట్లు పొందిన వారిలోనే ఎక్కువగా అనుత్తీర్ణులవుతున్నట్లు వైద్యవిద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారికి నీట్‌లో లక్షల్లో ర్యాంకు వస్తుందని, అటువంటి వారు డబ్బు కట్టి సీటు తెచ్చుకున్నా... చదువులో మాత్రం వెనుకబడుతున్నారని అంటున్నారు. దీనికి తోడు కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలకు ఉన్న అనుబంధ ఆస్పత్రులకు రోగులు రావడం లేదు.


దాంతో వారు నేర్చుకునేది కూడా పెద్దగా ఏం ఉండటం లేదు. నిరుడు ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో పీజీ గైనకాలజీ పూర్తి చేసిన విద్యార్థినులు, తమకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రసూతి విభాగంలో పనిజేసేందుకు అవకాశమివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తాము చదివిన వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రికి గర్భిణులే రాలేదని, దాంతో ప్రసవాలు చేయడంలో తమకు అనుభవం రాలేదని వారు వాపోయారు. ఇలా రోగుల రాక, సరైన అధ్యాపకుల లేక అరకొర చదువులతో ఉత్తీర్ణతశాతం తగ్గుతున్నట్లు కాళోజీ ఆరోగ్య వర్సిటీ పరిశీలనలో తేలింది. వైద్య విద్యార్థుల్లో కొందరు తరగతులకే హాజరు కావడం లేదని, ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నట్లు అధ్యాపకులు చెప్పారు. దాంతో కూడా ఉత్తీర్ణత శాతం తగ్గుతున్నట్లు చెబుతున్నారు. 


అన్ని ప్రశ్నలకు జవాబులు తప్పనిసరి

వైద్యవిద్య పరీక్షల్లో ప్రతి పేపరుకు 20 ప్రశ్నలుంటాయి. వాటికి 100 మార్కులిస్తారు. అన్నింటికి జవాబులు రాయాల్సివుంటుంది. అన్ని అంశాలపైనా విద్యార్థులకు అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతోనే ఎంపికకు అవకాశం ఇవ్వరని చెప్పారు. ఈ ఏడాది ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్ధుల్లో కొంతమంది అనుత్తీర్ణులయ్యారు. తమను కావాలనే అనుత్తీర్ణులను చూశారని, పున:గణన కాకుండా పునర్మూల్యాంకనం చేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై వారు కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. వాస్తవానికి జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం  పునఃగణనకు మాత్రమే అవకాశం ఉంది. పునర్మూల్యాంకనానికి అనుమతి లేదు. విద్యార్ధులు మాత్రం పునర్మూల్యాంకనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-10-27T14:15:48+05:30 IST