ఏప్రిల్‌ 1 నుంచే పీఎస్బీల విలీనం

ABN , First Publish Date - 2020-03-27T05:50:10+05:30 IST

పది ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీన గడువు పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు ప్రకటించిన...

ఏప్రిల్‌ 1 నుంచే పీఎస్బీల విలీనం

  • వాయిదా ప్రసక్తే  లేదన్న  ప్రభుత్వం

న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీన గడువు పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు ప్రకటించిన ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా ప్రకటించారు. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో ఈ గడువును మరింత పొడిగించాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ‘విలీన ప్రక్రియ కసరత్తు కొనసాగుతోంది. కరోనా వైర్‌సతో కొన్ని సవాళ్లు ఉన్నా, వాటిని అధిగమిస్తాం’ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విలీనాల గడువును మరింత పొడిగించాలని అఖిల భారత బ్యాంకింగ్‌ అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ)  ప్రభుత్వాన్ని కోరింది. 


ఈ నేపథ్యంలో పాండా ఈ ప్రకటన చేయడం విశేషం. విలీనానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు సమాంతరంగా సాగుతున్నాయ ని, ఈ అంశంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తెలిపారు.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనం అవతుండగా కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ విలీనమవుతున్న సంగతి తెలిసిందే. 


కరోనాతో మరిన్ని తిప్పలు 

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారతీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ హెచ్చరించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ బ్యాంకుల నిర్వహణ రేటింగ్‌ను ‘బీబీ+’ నుంచి ‘బీబీ’కు కుదించింది. ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో పారిశ్రామిక ఉత్పత్తితో పాటు దేశీయ డిమాండ్‌ దెబ్బతింటుందని హెచ్చరించింది. అయితే కరోనా వైరస్‌ ప్రభావం మిగతా ఆసియా దేశాల బ్యాంకులపై ఉన్నంతగా భారతీయ బ్యాంకులపై ఉండకపోవచ్చని అంచనా వేసింది. 

Updated Date - 2020-03-27T05:50:10+05:30 IST