Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వచ్ఛంద... నిర్బంధం!

  • పేదల ఇళ్లకు ఓటీఎస్‌పై సర్కారు వింత వాదన
  • అవగాహన కల్పించేందుకే వలంటీర్లు వెళ్తున్నారట!
  • స్వచ్ఛందమైతే... సిబ్బందికి టార్గెట్లు ఎందుకు?
  • మిగతా పథకాలకు అవసరంలేని అవగాహన దీనికేనా?
  • సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ ఏంటీ?
  • విపక్షంలో ఉండగా బకాయిలు, వడ్డీ మాఫీపై హామీ
  • అధికారంలోకి రాగానే ‘అసలు’పైనా కన్ను
  • ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’పై పిల్లిమొగ్గలు


‘‘ఆంధ్రప్రదేశ్‌లో పెళ్లయిన వారందరికీ బంపర్‌ ఆఫర్‌! మీరు గుడిలోనో, కల్యాణ మండపంలోనో పెళ్లి చేసుకుని ఉంటారు. మీ వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండరు. అలాంటి వారు రూ.10 వేలు చెల్లిస్తే... వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించి సర్టిఫికెట్‌ ఇస్తాం. భవిష్యత్తులో మీ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్యలొచ్చినా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది’’... అని ఒక పథకం తెస్తే ఎలా ఉంటుంది? 1983 నుంచి ఇళ్లు నిర్మించుకుని రెండు తరాలుగా నివసిస్తున్న వారిని... డబ్బులు డిమాండ్‌ చేస్తూ, మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని అన్నట్లుగానే ఉంటుంది. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై లబ్ధిదారుల నుంచి ఇవే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం తీసుకురావడం వెనుక ప్రజా ప్రయోజనం కంటే... పేదల నుంచి రూ.4 వేల కోట్లు గుంజుకోవడమనే లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేయాల్సిందంతా చేస్తూనే... ‘దీనిపై బలవంతమేమీ లేదు. అంతా స్వచ్ఛందమే’ అని చెబుతుండటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ‘‘అప్పుడెప్పుడో తాతల కాలం నాటి ఇళ్లకు ఇప్పటికీ కిస్తీలు కట్టుకుంటూ పోవాలా? మనం అధికారంలోకి వస్తున్నాం. ఆ ఇళ్ల బకాయిలన్నీ మాఫీ చేస్తాం’’ అని ఎన్నికల ముందు జగన్‌  ఊరూరా చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో ఇంటి రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత  పూర్తిగా రుణమాఫీ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.


అయితే ఇప్పుడు ఆ హామీలను మరచిపోయారు. తీరా అధికారంలోకి రాగానే... బకాయిల మాఫీ సంగతి పక్కనపెట్టి, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద పల్లెల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లలో రూ.20 వేలు కడితే... ఇంటికి రిజిస్ట్రేషన్‌ చేయించే పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ అని పేరు పెట్టారు. కరోనా కాటు, పనుల్లేక పస్తులు ఉంటుంటే... ఈ బాదుడేమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు కట్టాలంటూ జనం వద్దకు వెళుతున్న గ్రామ సచివాలయ సిబ్బందికి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో... ‘బలవంతమేమీ లేదు. అంతా స్వచ్ఛందమే’ అని సర్కారు కొత్త పల్లవి అందుకుంది. ఒక లెక్క ప్రకారం... 1983 నుంచి 2011 మధ్య కాలంలో 51 లక్షల మంది వివిధ పథకాల కింద ఇళ్లు పొందారు. ఆ లబ్ధిదారులు ప్రభుత్వానికి రూ.14 వేల కోట్లు బకాయిలున్నారని... ఇందులో రూ.10 వేల కోట్లు మాఫీ చేసి, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.4 వేల కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నామని, ఇది బంపర్‌ ఆఫర్‌ అని ఊరిస్తున్నారు. దశాబ్దాల కింద కట్టుకున్న ఇళ్లు! వాటిలో కొన్ని చేతులు మారిపోయాయి! ప్రభుత్వ సహాయంకంటే ఎక్కువ వాటాను భరించి కట్టుకున్న ఇళ్లూ ఉన్నాయి! ఇవన్నీ పట్టించుకోకుండా... ఇప్పుడు ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టి, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పకుండా... పెన్షన్‌ కట్‌ చేస్తాం, రేషన్‌ తీసేస్తాం, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉద్యోగులుంటే ఆ లెక్క కూడా తేల్చేస్తామని హెచ్చరిస్తోంది. ఇలా చేయాల్సిందంతా చేస్తూనే... ‘అంతా స్వచ్ఛందమే’ అని బుకాయిస్తోంది.


దుష్ప్రచారాన్ని సీరియ్‌సగా తీసుకోండి: సీఎం

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై దుష్ప్రచారాన్ని సీరియ్‌సగా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘‘ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. చట్టపరంగా హక్కులు దఖలు పడతాయి. మేలు చేస్తున్న పథకంపై దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలుంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలి’’ అని ఆదేశించారు. 


ఇది బలవంతపు పథకం కాదు : బొత్స

పేదలందరికీ మేలు చేసేందుకే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ ప్రవేశ పెట్టామని మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది బలవంతపు పథకం కాదని బొత్స స్పష్టం చేశారు.


పథకం స్వచ్ఛందమే: అజయ్‌ జైన్‌

‘‘పథకాన్ని స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి వద్దకు వెళ్తున్నారు. ఎలాంటి ఒత్తిడీ చేయడం లేదు’’ అని గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌జైన్‌ బుధవారం తెలిపారు. ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. 


సందేహాలు... అభ్యంతరాలు...

ఎవరో సీఎంగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇప్పుడొచ్చి మా ఇంటికి జగన్‌ పేరు పెడతారా? మా ఇంటి పత్రంపై జగన్‌ బొమ్మ వేస్తారా? అసలు మా ఇంటికీ, జగన్‌కు ఏమిటి సంబంధం? 

కరోనాతో చితికిపోయాం. చేతినిండా పనుల్లేవు. పెట్టుబడులకే అప్పులు చేస్తూ ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు ఇంటి పత్రాల కోసం మళ్లీ అప్పులు చేయాలా? డబ్బు వసూలుకు ఇదేనా సమయం?

దశాబ్దాల కిందట సాయం పొందిన వారిలో చాలా మందికి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో రుణం ఎంత, రాయితీ ఎంత అనే అవగాహన కూడా లేదు.

గతంలో ఏ ప్రభుత్వమూ పేదల బకాయిల గురించి పట్టించుకోలేదు. దీంతో... లబ్ధిదారులు మొత్తాన్ని రాయితీగానే భావిస్తున్నారు.

ఇప్పటికే కొందరు తమ ఇళ్లను తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించేస్తున్నారు. ఇలాంటి ఇళ్లకు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయడమంటే... అంతకుముందు బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా రుణాలిచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. 


‘స్వచ్ఛందం’ అంటూనే...

ఓటీఎస్‌ వసూళ్ల లక్ష్యం రూ.4వేల కోట్లు. స్వచ్ఛందంగా అమలు చేయాలనుకుంటే... ఇలా టార్గెట్లు ఎందుకు పెట్టుకుంటారు?

ఒక్కో రెవెన్యూ డివిజన్‌ నుంచి రోజుకు కనీసం కోటి రూపాయలు ఓటీఎస్‌ కింద వసూలు చేయాలని లక్ష్యం పెట్టారు.

గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, సెర్ప్‌, మెప్మా... ఇలా క్షేత్రస్థాయిలో ఇన్ని విభాగాల సిబ్బంది ‘పైసా వసూల్‌’లో పడ్డారు. టార్గెట్లు అందుకోలేకపోతే చర్యలు తప్పవని పై అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఓటీఎ్‌సకు అంగీకరించకపోతే పింఛను కట్‌ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లను ఆదేశించారు. 

వలంటీర్లు, ఇతర సిబ్బంది పదేపదే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఓటీఎ్‌సకు అంగీకరించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు.

Advertisement
Advertisement