పన్ను పీకుడే!

ABN , First Publish Date - 2021-10-18T05:54:52+05:30 IST

పన్ను పీకుడు మొదలు కాబోతోంది. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ ఆస్తి పన్ను బాదడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్తికి సంబంధించిన మార్కెట్‌ విలువ ప్రకారం ఇక పన్నులు వసూలు చేయనున్నారు. పాత విధానానికి స్వస్తి చెప్పనున్నారు. అంటే ఇంటికైనా, వ్యాపార సంస్థకైనా అక్కడ భూమికి సంబంధించిన సబ్‌-రిజిసా్ట్రర్‌ (మార్కెట్‌ విలువ) కార్యాలయం నిర్ణయించిన విలువ ప్రకారం పన్ను కట్టాలి.

పన్ను పీకుడే!

  • ఇంటి పన్నుల బాదుడుకు రంగం సిద్ధం
  • పాత భవనాల కంటే కొత్త భవనాలపైనే భారం
  • రాజమహేంద్రవరం కార్పొరేషన, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇళ్లకు 0.15 శాతం పన్ను
  • కాకినాడలో 0.10 శాతం మాత్రమే
  • అమరావతిలో నేటి నుంచి మూడు రోజులు శిక్షణ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పన్ను పీకుడు మొదలు కాబోతోంది. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ ఆస్తి పన్ను బాదడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్తికి సంబంధించిన మార్కెట్‌ విలువ ప్రకారం ఇక పన్నులు వసూలు   చేయనున్నారు. పాత విధానానికి స్వస్తి చెప్పనున్నారు. అంటే ఇంటికైనా, వ్యాపార సంస్థకైనా అక్కడ భూమికి సంబంధించిన సబ్‌-రిజిసా్ట్రర్‌ (మార్కెట్‌ విలువ) కార్యాలయం నిర్ణయించిన విలువ ప్రకారం పన్ను కట్టాలి. జిల్లాలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో ఈ పన్నులు వసూలు చేస్తారు. రెసిడెన్షియల్‌ విభాగంలో కాకినాడకు తక్కువ శాతం అంటే 0.10 పన్ను వసూలు చేస్తారు. రాజమహేంద్రవరం కార్పొరేషనతో పాటు అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రపురం., పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం మునిసిపాలిటీల్లో 0.15 శాతం వసూలు చేయడానికి నిర్ణయించారు. కాకినాడకు తక్కువ ఎందుకు చూపారనేది స్పష్టత లేదు. కానీ నాన్‌ రెసిడెన్షియల్‌ విభాగంలో కాకినాడకు బాదుడే. ఏకంగా 0.36 శాతం వసూలు చేస్తారు. మిగతాచోట్ల 0.30 శాతమే వసూలు చేస్తారు. ఇవన్నీ ఇప్పటికే ఉన్న రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షియల్‌ భవనాలకు సంబంధించి వసూలు చేస్తున్న పన్నుకు అదనంగా ఉంటాయి. కానీ కొత్తగా కట్టుకున్న ఇళ్లకు, నాన్‌-రెసిడెన్షియల్‌కు మాత్రం  మార్కెట్‌ విలువను బట్టే పన్ను నిర్ణయిస్తారు. వీరిలో ఏకంగా పన్ను పీకుడేననే ఆందోళన ఉంది. ఇప్పటికే జిల్లాలో ఆస్తి పన్నుల రూపేణా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. గతంలో అద్దె, ఆదాయం ఆధారంగా పన్ను నిర్ణయించేవారు. ఇవాళ మొత్తం మార్కెట్‌ విలువ ప్రకారమే వసూలు చేస్తారు. ఇప్పటికే జిల్లాలో రూ.కోట్లు పన్నుల రూపేణా వసూలవుతున్నాయి. రాజమహేంద్రవరంలో కొత్త, పాత బకాయిలు కలిపి ఏడాదికి రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు వసూలు ఉన్నట్టు అంచనా. ఈ సంఖ్య మరింత పెరగనుంది. కాకినాడలో కూడా అధికంగానే వసూళ్లు ఉంటాయి. అన్ని మునిసిపాలిటీల్లోను గతంలో కంటే ఎక్కువ పన్ను కట్టే పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటికే జిల్లాలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో భవనాల కొలతలు మొదలయ్యాయి. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి, దుకాణ యజమానుల ఆధార్‌ నంబర్లు కూడా సేకరిస్తున్నారు. 

వాస్తవానికి కొత్త పన్నుల విధానం గత ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రావలసి ఉంది. కానీ ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళన చేయడంతో పాటు కొందరు కోర్టును ఆశ్రయించడంవల్ల ఇది ఆగింది. గతంలో ఏడాదికి రెండుసార్లు నోటీసులు ఇచ్చి పన్నులు వసూలు చేసేవారు. ఇటీవల ఏడాదికి ఒకసారే డిమాండ్‌ నోటీసు ఇస్తున్నారు. అందులో నెలవారీ కట్టవలసిన పన్నుల వివరాలు ఉంటాయి. వీలవుతుందనుకుంటే నెలవారీ కూడా కట్టవచ్చు. కానీ ప్రజలెవరూ అలా చేయరు. ఏకంగా ఏడాదికి ఒకసారే పన్ను చెల్లిస్తుంటారు. ఇక కొత్త విధానంలో పన్నులు ఎలా విధించాలి. కొలతలను ఎలా పరిగణలోకి తీసుకోవాలి. డిమాండ్‌ నోటీసులు ఎలా ఇవ్వాలి... తదితర అంశాలతోపాటు కొత్త పన్ను విధానం ఎందుకు తెచ్చారనే విషయాలతో అమరావతిలో మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో మూడు రోజుల పాటు పన్నుల వసూలు ఆపేసి సిబ్బందిని అక్కడకు పంపిస్తున్నారు. కొత్త పన్నుల వసూలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

Updated Date - 2021-10-18T05:54:52+05:30 IST