టీచర్లకు ఊరట

ABN , First Publish Date - 2021-11-17T15:50:58+05:30 IST

మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సిన పని నుంచి ఇకపై ఉపాధ్యాయులకు విముక్తి లభించనుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై మోపిన యాప్‌ల భారం నుంచి కొంత ఉపశమనం లభించింది. మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని..

టీచర్లకు ఊరట

టీచర్లకు మరుగుదొడ్ల ఫొటో నుంచి ఊరట

మరో 3 ఫొటోల అప్‌లోడ్‌ నుంచీ మినహాయింపు


అమరావతి(ఆంధ్రజ్యోతి): మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సిన పని నుంచి ఇకపై ఉపాధ్యాయులకు విముక్తి లభించనుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై మోపిన యాప్‌ల భారం నుంచి కొంత ఉపశమనం లభించింది. మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఒక మెమో జారీచేసింది. దీంతో పాటు మరో మూడు రకాల ఫొటోలు కూడా తీయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘గురువులపై యాప్‌ల బరువు’ అంటూ ఆంధ్రజ్యోతి దీనిపై కథనం ప్రచురించింది. ఒక ఉపాధ్యాయుడు ఈ బాధను తట్టుకోలేక స్వయంగా మరుగుదొడ్డి శుభ్రం చేస్తున్న ఫొటో కూడా ప్రచురించింది. మరోవైపు ఉపాధ్యాయులనుంచి, ఉపాధ్యాయ సంఘాలనుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ మేరకు మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.


ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల పరిశుభ్రత వరకూ అన్నీ ఉపాధ్యాయులే చూసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు... వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలి. ఆ ఫొటోలు కూడా ఇలా ఉండాలంటూ కొన్ని నిబంధనలు పెట్టారు. బాగా వెలుతురులో ఫొటోలు తీయాలి. కమోడ్‌ మొత్తం కనిపించాలి. చుట్టూ ఉన్న ప్రదేశం కనిపించాలి...ఇలా అనేకరకాల నిబంధనలు పెట్టారు. మరోవైపు తాజాగా బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవడం లాంటి పనులూ అదనంగా చేరాయి. మధ్యాహ్న భోజన సమయంలో...భోజనానికి ముందు పాత్రలన్నీ శుభ్రం చేశారా? ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌. వండిన భోజనం ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌. ఆహారపదార్థాలను ఫొటోలు తీసి అప్‌లోడ్‌. గుడ్లు, చిక్కీలు ఫొటోలు తీసి అప్‌లోడ్‌. మరోవైపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా? లేదా అన్నది స్వయంగా చూసి ఫోటోలు తీసి అప్‌లోడ్‌...ఇలా అచ్చంగా కొందరు ఉపాధ్యాయులు ఫొటోలు తీయడం, వాటిని అప్‌లోడ్‌ చేసే పనికే సరిపోతున్నారు. దీనిపై వచ్చిన వ్యతిరేకతతో మరుగుదొడ్ల ఫొటోలతో పాటు మరికొన్ని ఫొటోలు తీయాల్సిన పని లేకుండా మినహాయింపు ఇచ్చారు,

Updated Date - 2021-11-17T15:50:58+05:30 IST