సర్కారు వాటా సమర్పయామి

ABN , First Publish Date - 2021-05-08T08:24:29+05:30 IST

గంగవరం పోర్టు సంపూర్ణంగా అదానీ కంపెనీ వశమైనట్లే. ఇప్పటికే దుబాయ్‌ కంపెనీ నుంచి, డీవీఎస్‌ రాజు కుటుంబం నుంచి అదానీ సంస్థ వాటాలు కొనుగోలు చేసింది

సర్కారు వాటా సమర్పయామి

‘గంగవరం’లో వాటా అదానీకే అమ్మకం

1400 ఎకరాలు ఇచ్చినందుకు 10.39ు వాటా

ఇప్పుడు రూ.645 కోట్లకే అదానీకి


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

గంగవరం పోర్టు సంపూర్ణంగా అదానీ కంపెనీ వశమైనట్లే. ఇప్పటికే దుబాయ్‌ కంపెనీ నుంచి, డీవీఎస్‌ రాజు కుటుంబం నుంచి అదానీ సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. ఇప్పుడు... రాష్ట్ర ప్రభుత్వం తనకున్న 10.39 వాటాలను కూడా అదానీకి సమర్పించేసింది. మూడు రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. 10.39 శాతం వాటాకు రూ.645 కోట్లు ఇవ్వడానికి అదానీ ముందుకు వచ్చిందనేది సమాచారం. డీవీఎస్‌ రాజుతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోల్చి... సర్కారు వాటాకు విలువ కట్టడం ఎంతమాత్రం సరికాదు. ఎందుకంటే... ప్రభుత్వానికి లభించిన 10.39 శాతం వాటా 1400 ఎకరాలకు దక్కిన ప్రతిఫలం! గంగవరం పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత 700 ఎకరాలకు... ఎకరాకు రూ.2.3 లక్షల చొప్పున స్టీల్‌ప్లాంటుకు చెల్లించింది. ఈ మొత్తాన్ని మాత్రమే గంగవరం పోర్టు యాజమాన్యం భరించింది. 


ఆ తర్వాత ప్రభుత్వం మరో 700 ఎకరాలను కూడా స్టీల్‌ప్లాంటు నుంచి తీసుకుని... అందుకు ప్రత్యామ్నాయంగా విశాఖ గ్రామీణ జిల్లాలో గ్రీన్‌బెల్ట్‌ కోసం 470 ఎకరాలు ఇచ్చింది. ఆ తర్వాత దిబ్బపాలెం గ్రామంతో సహా పరిసర ప్రాంతాల్లో మరో 700 ఎకరాలను ప్రభుత్వమే పూర్తిగా సేకరించి ఇచ్చింది. వెరసి... గంగవరం పోర్టుకు ఉన్న 2100 ఎకరాల్లో 1400 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చినవే. అందుకుగాను పోర్టులో ప్రభుత్వానికి 10.39 శాతం వాటా ఇచ్చారు. ప్రస్తుతం గంగవరం పోర్టు రూ.500 కోట్ల లాభాల్లో ఉంది. ఏటా రూ.20 నుంచి రూ.25 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తోంది. గంగవరం పోర్టు పరిసరాల్లో ఇప్పుడు ఎకరా భూమి రూ.5 కోట్లు పలుకుతోంది. అంటే... ప్రభుత్వ వాటా భూమి 1400 ఎకరాల విలువ రూ.7 వేల కోట్లు! అంత విలువైన వాటాను కేవలం రూ.645 కోట్లకు అదానీకి కట్టబెట్టడంపై ఇప్పుడు విస్మయం వ్యక్తమవుతోంది.


అదానీకే ఎందుకు?

సాధారణంగా ప్రభుత్వ వాటాను విక్రయించేటప్పుడు ‘ఫస్ట్‌ రైట్‌ ఆఫ్‌ రిఫ్యూజల్‌’ అనే క్లాజ్‌ ఉంటుంది. అంటే సదరు పోర్టు ప్రమోటర్‌కే తొలుత ప్రభుత్వం విక్రయ ప్రతిపాదన చేయాలి. ప్రస్తుతం ప్రమోటర్‌గా ఉన్నది ఏపీ సెజ్‌ కాబట్టి... సదరు కంపెనీకే ప్రతిపాదన చేయాలి. మా వాటా అమ్ముతాం...ఇంత ధరకు అని ప్రతిపాదన చేయాలి. ఆ ధరకు సరే అంటేనే ఒప్పందం కుదురుతుంది. లేదంటే... బయటి కంపెనీలకు అమ్ముకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మరి... 10.39 శాతం వాటాకు రూ.645 కోట్లు వెల ఎలా నిర్ణయించారు? అసలు ప్రభుత్వం తన వాటా అమ్మాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావడంలేదు. ప్రభుత్వం తన వాటాను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే కచ్చితంగా అధిక ధర లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-08T08:24:29+05:30 IST