నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన సర్కార్‌

ABN , First Publish Date - 2021-10-27T04:53:56+05:30 IST

లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినందుకు టీఆర్‌ఎస్‌ విజయోత్సవాలు జరుపుకుంటున్నదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన సర్కార్‌
మెదక్‌లో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

20 ఏళ్ల విజయోత్సవ సభ సిగ్గుచేటు

బహుజన స్థాపనకు సైనికులుగా పనిచేయాలి

బెదిరింపులకు భయపడొద్దు

కేసీఆర్‌ శ్మశానాలు నిర్మిస్తే.. మనం బృందావనం నిర్మిద్దాం

బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

మెదక్‌ రూరల్‌, అక్టోబరు 26: లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినందుకు టీఆర్‌ఎస్‌ విజయోత్సవాలు జరుపుకుంటున్నదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. మంగళవారం మెదక్‌ జిల్లా కేంద్రంలో బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సభ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక గార్డెన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేస్తూ బీసీలను కుల వృత్తులకు పరిమితం చేస్తున్నందుకా.. ఈ విజయోత్సవాలని ప్రశ్నించారు. వందలాది మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం చేతిలో బంధీ అయ్యిందన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో నియంతృత్వం పెరిగిందని, బహుజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. జనాభాలో మెజార్టీ ప్రజలైన బహుజనుల మధ్య రాజకీయ ఐకమత్యం లేకపోవడంతో కేవలం మూడుశాతం ఉన్న ఆధిపత్య కులాలు రాజకీయ పెత్తనం సాగిస్తున్నాయని చెప్పారు. జిల్లాలోని నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం కొనసాగుతున్నదన్నారు. బహుజనుల జనాభా అధికంగా ఉన్నా.. జిల్లాలో వారిదే పైచేయి అని, మన బతుకులు మారడం లేదని పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క పీజీ కళాశాల కూడా లేదని, కొల్చారంలో ఉన్న గురుకులంలో 500 మంది కోసం నిర్మించిన భవనంలో 1,200 మంది విద్యార్థులను కోడి పిల్లల్లా కుక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి తాను గతంలో పలుమార్లు ఫోన్‌చేసినా స్పందించలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎందుకు విజయోత్సవ సభ నిర్వహిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా..? దళితులకు భూమి వచ్చిందా.. అమ్మాయిలకు రక్షణ కలుగుతుందా.. పోడు భూముల పట్టా ఇచ్చారా.. అసైన్డ్‌ భూములు పేదలకు ఇవ్వలేదని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. ట్రాన్స్‌కోలో రిటైర్డ్‌ అయిన వారికి పదవులు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బహుజనుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందని, మా తెలంగాణను మళ్లీ గుంజుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. మల్లన్నసాగర్‌లో భూమిని కోల్పోయిన ముంపు ప్రజలు అడ్డా కూలీలుగా మారిపోయారన్నారు. అందరి పక్షాన పోరాటం చేసేది బహుజన పార్టీ అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ అన్నివర్గాలకు చెందిన పార్టీయని ఆయన చెప్పారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌, కోర్డినేటర్‌ గంగాధర్‌, జిల్లా అధ్యక్షుడు అయితారం రత్నయ్య, మానయ్య, రాసమస్వామి, అంసాన్‌పల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

హుజూరాబాద్‌లో లారీల బీర్ల పంపిణీ

హుజూరాబాద్‌లో ఒంటరి పోరాటం చేస్తున్న ముదిరాజ్‌ కులానికి చెందిన వ్యక్తిని పొమ్మన లేక పొగపెట్టి.. ఉప ఎన్నికలో ఓడించేందుకు లారీల కొద్దీ బీర్లను మంత్రి హరీశ్‌రావు తాగిస్తున్నాడని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇల్లంతకుంటలో ఓటు వేయకుంటే పెన్షన్‌, బతుకమ్మ చీర, రైతుబంధు రాదని భయపెడుతున్నారని ఆయన తెలిపారు. 


Updated Date - 2021-10-27T04:53:56+05:30 IST