కళ్లు మూసీ..!

ABN , First Publish Date - 2021-11-24T08:29:51+05:30 IST

‘‘మూసీని గోదావరితో అనుసంధానం చేస్తాం. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లను గోదావరి నీటితో నింపుతాం.

కళ్లు మూసీ..!

  • మూసీ నది ప్రక్షాళనపై సర్కారు గాఢ నిద్ర
  • పిల్లలు బోటింగ్‌ చేసేలా చేస్తామన్న కేసీఆర్‌
  • ఏడున్నరేళ్లుగా రూ.754 కోట్లు కేటాయింపు
  • ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ.3.12 కోట్లు
  • ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు.. అయినా నిధుల్లేవ్‌
  • మురికి నీరంతా మూసీలోకే.. ఎస్టీపీలు అరకొర
  • ఆక్రమణల తొలగింపుపై ముందుకు పడని అడుగు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీని గోదావరితో అనుసంధానం చేస్తాం. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లను గోదావరి నీటితో నింపుతాం. ఆ నీటిని మూసీలోకి వదలడం ద్వారా దానిని జీవనదిగా మారుస్తాం. పిల్లలు బోటింగ్‌ చేసేలా గొప్పగా తీర్చిదిద్దుతాం. ఫ్రాన్స్‌లో ఓ నది, లండన్‌లోని థేమ్స్‌ కూడా మురికి కూపంగా మారితే.. వాళ్లొక రోజు మేల్కొని గొప్పగా చేసుకున్నారు’’ అని జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా గత ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలివి. నిజానికి, ఉద్యమ సమయంలో కూడా మూసీ ప్రక్షాళనపై కేసీఆర్‌ పలుమార్లు మాట్లాడారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందే, మూసీ నది చుట్టూ కొత్త నిర్మాణాల ప్రతిపాదనలను హఫీజ్‌ బృందం పరిశీలించింది కూడా. ఆ సందర్భంగానే, మూసీకి ఇరువైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్‌ స్థలాలు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో గత వైభవం గుర్తుకు వచ్చేలా కొత్త నిర్మాణాలు ఉండాలన్నారు. అయినా, కేసీఆర్‌ మొదటి హయాంలో అడుగు ముందుకు పడలేదు. 


ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మూసీని పూర్తిగా శుద్ధీకరణ చేస్తామని చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తాము.. తమ పదవీ కాలం ముగిసేలోపు హైదరాబాద్‌ ప్రజలకు శుద్ధమైన మూసీ నీళ్లను అందిస్తామని గత ఏడాది మార్చిలో హామీ ఇచ్చారు. మూసీ అభివృద్ధి ధ్యేయంగా మూడేళ్ల కిందట మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంఆర్‌డీసీ)ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి చైర్మన్‌ పదవిని అప్పగించారు. మూసీ ప్రక్షాళనకు రూ.3000 కోట్లు విడుదల చేస్తామని కూడా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ కేవలం రూ.3.12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా, అధ్యయనాలకు, ప్రతిపాదనలు తయారు చేయడానికి మాత్రమే. మూసీ ప్రక్షాళనకు 2017-18 బడ్జెట్‌లో రూ.377.35 కోట్లను కేటాయించారు. కానీ, కేవలం రూ.32 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఆ తర్వాత ఏడాది కూడా రూ.377 కోట్లను ప్రతిపాదించారు. కానీ, రూ.2.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది కూడా జీతభత్యాలు, చిన్న చిన్న పనులకే! అంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లలో మూసీ ప్రక్షాళన పేరిట రూ.754 కోట్లు కేటాయించారు కానీ ఖర్చు కేవలం రూ.3.12 కోట్లు మాత్రమే! ఈ నిధులతో నాగోల్‌, ఉప్పల్‌ వంటి కొన్నిచోట్ల ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, వాకింగ్‌ ట్రాక్‌ వంటి సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 


మిగిలిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకే అభివృద్ధి పరిమితమైంది. తప్పితే, మూసీ ప్రక్షాళన దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వెరసి, మూసీ ప్రక్షాళన, తీర ప్రాంత సుందరీకరణ దశాబ్దాలుగా పాలకుల ప్రకటనలకే పరిమితమవుతోంది. అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కానీ, ప్రక్షాళన దిశగా అడుగు ముందుకు పడడం లేదు. చెత్తా చెదారం తొలగింపు మినహా.. సమగ్ర స్థాయిలో ప్రణాళికలు అమలు కావడం లేదు. ఎప్పటిలానే మురుగు నీటి దుర్వాసన, దోమల బెడద, భూగర్భ జలాలు కలుషితం కావడం, జలచరాల ప్రాణాలకు ముప్పు యథావిధిగా కొనసాగుతున్నాయి. సబర్మతి తరహాలో స్వచ్ఛత దేవుడెరుగు.. కనీస పురోగతి కూడా కనిపించడం లేదు. తాజాగా, పీసీబీ అప్పిలేట్‌ అథారిటీ ప్రారంభోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ వ్యాఖ్యలతో మూసీ ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వచ్చింది.


మురికి అంతా మూసీలోకే!

నగరంలో వెలువడుతున్న మురికి నీరంతా మూసీలోనే చేరుతోంది. మానవ, జంతు విసర్జితాలతోపాటు పరిశ్రమల వ్యర్థాలూ ఇందులోనే కలుస్తున్నాయి. నిత్యం 1800 మిలియన్‌ లీటర్ల వ్యర్థాలు వెలువడుతుండగా.. శుద్ధి జరుగుతున్నది మాత్రం 800 మిలియన్‌ లీటర్లు మాత్రమే. మరో 1000 మిలియన్‌ లీటర్లు నేరుగా మూసీలో చేరుతున్నాయి. నదిలోని నీరు విషతుల్యంగా మారడానికి ఇదొక కారణం. నది పక్క నుంచి వెళితే భరించలేని దుర్వాసనకు ఇదే కారణం. నిజానికి, మూసీలో హానికరమైన కోలిఫామ్‌ అనే బ్యాక్టీరియా తిష్ట వేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇది పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు. డిమాండ్‌కు సరిపడ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్టీపీ) లేకపోవడంతో మూసీని మురికి వదలడం లేదు. హైదరాబాద్‌ శివారులోని పీర్జాదిగూడ నుంచి సుమారు 60 కి.మీల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ వరకు నది పరిసర ప్రాంతాలు విషతుల్యంగా మారాయి. ఇరు వైపులా 50 మీటర్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. 


మానవ, వ్యవసాయ అవసరాలకు వినియోగించలేని దుస్థితి నెలకొంది. ఈ ప్రభావం మూసీ పరీవాహకంలో పండించే పంటలపైనా పడుతోందని ఉస్మానియా వర్సిటీ జియో ఫిజిక్స్‌ విభాగం పరిశీలనలో తేలింది. అనంతగిరి అడవుల్లో పుట్టి నాడు హైదరాబాద్‌కు అదనపు అందాలనద్దుతూ ముందుకు సాగిన మూసీ.. జన్మస్థలం నుంచి నల్లగొండలో కృష్ణాలో కలిసే వరకూ అంతటా అదే దుస్థితి. మూసీకి ఇరు వైపులా ఆక్రమణల తొలగింపు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఉమ్మడి రాష్ట్రంలోనే భావించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగాలు హడావిడి చేశాయి. ఆ తర్వాత మామూలే.


తీర ప్రాంతాలు.. దోమల ఆవాసాలు!

మూసీ తీర ప్రాంతాలు దోమల ఆవాసాలుగా మారాయి. మూసీకి ఇరువైపుల హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, సిటీ కాలేజ్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌, ఉస్మానియా దంత కళాశాల, రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయంతోపాటు పలు బస్తీలు, కాలనీలు, గుడిసెలు ఉన్నాయి. దోమల స్వైర విహారంతో ఆయా ప్రాంతాల వాసులు మలేరియా, డెంగీ వంటి జ్వరాల బారిన పడుతున్నారు. దోమల తీవ్రతపై గతంలో పలుమార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ ఫాగింగ్‌, రసాయనాల పిచికారిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా, రాత్రి ఏడు దాటిందంటే తీర ప్రాంతాల్లో బయటకు రాలేని దుస్థితి నెలకొంది.


ఆక్రమణల తొలగింపు ఎప్పుడు!?

మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ఆక్రమణల తొలగింపు కీలకం. గ్రేటర్‌ పరిధిలో 44 కి.మీల మేర నిర్వహించిన సర్వేలో 1069 వరకూ ఆక్రమణలు ఉన్నాయని రెవెన్యూ విభాగం గుర్తించింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 738, రంగారెడ్డి రెవెన్యూ పరిధిలో 275, మేడ్చల్‌లో 56 ఆక్రమణలున్నాయని తేల్చింది. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు అంతకు మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని అంచనా. బాపుఘాట్‌ మొదలు పీర్జాదిగూడ వరకు మూసీ తీర ప్రాంతంలో గుడిసెలు, బస్తీలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించగా.. ఇప్పటికీ ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించే క్రమంలో జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే ఇళ్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. కానీ, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపంతో ఇప్పటికీ.. సామాజిక ప్రభావ అంచనా (సోషల్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌) సర్వే జరగలేదు.

Updated Date - 2021-11-24T08:29:51+05:30 IST