కల్యాణ్‌నగర్‌ సొసైటీ కేసులో సర్కారుకు చుక్కెదురు!

ABN , First Publish Date - 2021-06-18T09:38:19+05:30 IST

రాష్ట్ర రాజధానిలోని కల్యాణ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీ భూముల వ్యవహారంలో సర్కారుకు చుక్కెదురైంది.

కల్యాణ్‌నగర్‌ సొసైటీ కేసులో సర్కారుకు చుక్కెదురు!

  • భూసేకరణ చట్టం 2013 కింద 2 నెలల్లో పరిహారం చెల్లించాలి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • సర్కారుపై 3080కోట్ల భారం!


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలోని కల్యాణ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీ భూముల వ్యవహారంలో సర్కారుకు చుక్కెదురైంది. నూతన భూసేకరణ చట్టం 2013 ప్రకారం సొసైటీకి నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు అందించిన రెండు నెలల్లోగా ఈ పరిహారం చెల్లించాలని, ఆదేశాలు వెలువరించిన నాటి మార్కెట్‌ ధరను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కోర్టు ఖర్చుల కింద సొసైటీకి రెండు నెలల్లోగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎ్‌స.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఏపీ మురికివాడల అభివృద్ధి (అక్విజిషన్‌ ఆఫ్‌ ల్యాండ్స్‌) చట్టం కింద 1992, జూన్‌ 30న ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 


ఆక్రమణదారులను ఖాళీ చేయించాలంటూ 1989లో ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అమలు చేయడం అంత సులభం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల చర్యల వల్ల పరిస్థితి మరింత జటిలమైందని వ్యాఖ్యానించింది. పరిహారం చెల్లించేందుకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.3080 కోట్ల మేర భారం పడనుంది. జూబ్లీహిల్స్‌కు అతి సమీపంలో ఉన్న ఈ స్థలం ప్రస్తుత మార్కెట్‌ విలువ ఎకరం రూ.40 కోట్లకు పైగా ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో 38 ఎకరాల 2121 చదరపు గజాల స్థలానికి ప్రస్తుత మార్కెట్‌ ధర సుమారు రూ.1540 కోట్లు ఉంటుంది. చట్ట ప్రకారం పట్టణ ప్రాంతాల్లో మార్కెట్‌ ధరకు రెట్టింపు ధరను పరిహారం కింద చెల్లించాలి. కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం కల్యాణ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీకీ సుమారు రూ.3080 కోట్లు 2 నెలల్లోగా పరిహారం కింద చెల్లించాలి. లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.


ఇదీ నేపథ్యం.. 

మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాల కోసం యూస్‌ఫగూడ గ్రామ సర్వే నం.128/1, 128/10లలో 38 ఎకరాల 2121 చ.గ. స్థలంలో కల్యాణ్‌నగర్‌ హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ 1963లో రిజిస్టర్‌ అయింది. సొసైటీ ఈ భూములను 1964లో సి.రాజ్యలక్ష్మీదేవి నుంచి కొనుగోలు చేసింది. 287 ప్లాట్లకు 1978లో హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ లే-అవుట్‌ మం జూరు చేసింది. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ వివాదం ఉండడంతో సొసైటీ సభ్యులకు ప్లాట్ల కేటాయింపులు జరగలేదు. ఈలోగా కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేశారు. కార్మికనగర్‌ వీకర్‌ సెక్షన్‌ సొసైటీ కింద రిజిస్టర్‌ చేశారు. మొత్తం 503 మంది ఈ స్థలాన్ని ఆక్రమించారు. సొసైటీ సభ్యులు ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టును ఆశ్రయించగా.. 1989లో కల్యాణ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆక్రమణలు తొలగించి స్థలాన్ని సొసైటీకి అప్పగించాలని స్పష్టంచేసింది. అయితే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఆ పని చేయలేదు. తర్వాత 1990లో కార్మికనగర్‌ సొసైటీ చ.గ. రూ.9 చొప్పున చెల్లిస్తామని ఒక ప్రతిపాదన చేసింది. అనంతరం దాన్ని రూ.25కు పెంచింది. ఈ మేరకు కల్యాణ్‌నగర్‌ సొసైటీతో ఒప్పందం చేసుకుం ది. కానీ, ఆక్రమణదారులు కల్యాణ్‌నగర్‌ సొసైటీకి డబ్బు చెల్లించలేదు. తర్వాత అప్పటి ప్రభుత్వం ము రికివాడల అభివృద్ధి కింద ఆ భూమిని సేకరించింది. దీంతో సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది.

Updated Date - 2021-06-18T09:38:19+05:30 IST