Abn logo
Oct 27 2021 @ 04:01AM

వరిపై సర్కారు ఉక్కుపాదం!

యాసంగిలో వరి సాగు చేయొద్దు

ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాల్సిందే

ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు

దాంతో జిల్లా కలెక్టర్ల దూకుడు 

విత్తన డీలర్లకు తీవ్ర హెచ్చరికలు 

అయినా రైతులు వరిసాగు చేస్తే..

ప్రోత్సాహకాలు ఉండవని సంకేతాలు

ఎఫ్‌సీఐ బియ్యాన్ని 

కొనుగోలు చేయదంటున్న సర్కారు

ఆర్థిక భారం తప్పించుకోవడానికే 

కఠినంగా ముందుకు! 


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వరి సాగుపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఈ యాసంగిలో రైతులు వరి పంటను సాగు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. యాసంగిలో సాగు విస్తీర్ణాన్ని కూడా ఇంతకుముందెన్నడూ లేనివిధంగా గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముందుగా విత్తన డీలర్లకు హెచ్చరికలు పంపుతోంది. వినకపోతే వారి షాపులను సీజ్‌ చేస్తామని బెదిరిస్తోంది. మొత్తంగా వరి సాగవ్వకూడదన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది. రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఓవైపు పుష్కలంగా నీరు, మరోవైపు కరెంటు అందుబాటులో ఉండడంతో రైతులు వరిసాగు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో విస్తీర్ణం బాగా పెరిగి.. కోట్ల టన్నుల్లో దిగుబడి వస్తోంది. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా సేకరించిన బియ్యంలో 56ు తెలంగాణ నుంచి వచ్చిందే ఉంది. అయితే యాసంగిలో ఎక్కువగా దొడ్డు రకం వరిసాగు జరుగుతుంది. ఈ ధాన్యం నుంచి వచ్చే ఉప్పుడు బియ్యం వాడకం ఈసారి ఇతర రాష్ట్రాల్లో తగ్గింది. అక్కడి అవసరాల మేరకు ఆయా రాష్ట్రాల్లోనూ వాటి ఉత్పత్తి పెరిగింది. దాంతో ఈసారి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయలేమని ఎఫ్‌సీఐ తెలిపింది. ఉప్పుడు బియ్యం స్థానంలో ముడి బియ్యం కావాలని అడుగుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి ఇదే కారణమని తెలుస్తోంది.

ఆర్థికంగా భారమవుతుందనే!

సాధారణంగా రైతులు తాము పండించిన పంటను కొంత మేరకు పొలాల వద్దే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తున్న కారణంగా అత్యధికంగా ఆ కేంద్రాలకు తీసుకువస్తుంటారు. ఇలా వచ్చే ఈ ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇందుకు నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవారు. ఆ రుణానికి ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరించేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ యాసంగి బియ్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంతో బ్యాంకులు కూడా రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. దాని నుంచి బయట పడేందుకు వరిసాగు విషయంలో సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. యాసంగిలో వరిసాగు నియంత్రణ బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించడంతో వారు.. వ్యవసాయశాఖ, విత్తన డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరి విత్తనాల విక్రయాలను గణనీయంగా తగ్గించాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఒకడుగు ముందుకేసి.. ఎవరైనా డీలర్లు వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు వరిసాగు చేసే  రైతులకు ప్రభుత్వపరంగా వచ్చే ప్రోత్సాహకాలేవీ అందవని కలెక్టర్లు చెబుతున్నారు. వరి సాగు వల్ల కాలుష్యం ఉత్పత్తి అవుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. నీటి వాడకం కూడా విపరీతంగా ఉంటుంది. నీటి సరఫరా కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సివస్తుంది. ఎప్పుడూ వరిసాగు చేస్తుండడం వల్ల భూసారం కూడా తగ్గిపోతుంది. పైగా ప్రస్తుతం పండిస్తున్న వరి పంటలో బలవర్థకమైన పోషకాలు కూడా ఉండటం లేదు. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్‌ చేస్తుండడంతో దానిపై ఫైబర్‌ను కోల్పోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన ఓ అధ్యయనంలో వరి సాగు తగ్గించాలన్న సూచనలు వచ్చాయి. దానిని కేసీఆర్‌ సర్కారు తప్పుబట్టింది. కానీ, నేడు కలెక్టర్ల ఆధ్వర్యంలో వరిసాగు చేయకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరిస్తోంది. ఒకవేళ రైతే తన వద్ద ఉన్న విత్తనాలతో వరిసాగు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌సీఐ బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ వరిసాగు వద్దంటున్న సర్కారు.. మున్ముందు వానాకాలంలో కూడా ధాన్యం నిల్వలు అపారంగా ఉన్నాయని, పంటను కొనబోమని, వరి వేయవద్దని చెబుతుందా? మిగతా పంటలకు కూడా దీనినే వర్తింపజేస్తే  పరిస్థితేంటి? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ముందస్తు ప్రణాళిక లేకుండానే..

యాసంగిలో వరిసాగు చేయవద్దంటున్న ప్రభుత్వం.. అందుకు తగిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలేదు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్నా.. ఆయా పంటల సాగుకు తగిన చర్యలు చేపట్టలేదు. ఏయే భూములు ఎటువంటి పంటల సాగును అనువైనవో శాస్త్రీయంగా తేల్చిందిలేదు. పైగా ఇతర పంటలు సాగు చేస్తే.. వాటి ఉత్పత్తుల కొనుగోలు విషయంలో రైతులకు భరోసాను ఇవ్వడంలేదు. వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా.. వరి మాత్రమే పండించదగిన భూముల్లో ఆ పంట సాగును ప్రోత్సహించే వీలున్నా.. అటువంటి చర్యలేవీ చేపట్టడంలేదు. కేవలం ఎఫ్‌సీఐ బియ్యాన్ని కొనుగోలు చేయడంలేదన్న ఒకే ఒక్క కారణంతో వరిసాగును నియంత్రించాలని చూస్తుండడం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది.