సర్కారు X ఉద్యోగులు సమరమే!

ABN , First Publish Date - 2022-01-22T09:05:05+05:30 IST

వేతన సవరణపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నదంతా అవాస్తవమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

సర్కారు X ఉద్యోగులు సమరమే!

  • వాళ్లు చెప్పేది అబద్ధం
  • పీఆర్సీతో జీతాలు తగ్గవు: సీఎం జగన్‌
  • మీరు చేస్తున్నది అన్యాయం
  • రివర్స్‌ పీఆర్సీకి ఒప్పుకోం: ఉద్యోగ నేతలు
  • మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లండి
  • ఈ నిర్ణయం ఎందుకో చెప్పండి
  • కేంద్ర విధానాల మేరకే హెచ్‌ఆర్‌ఏ
  • దీనిని పెంచితే పథకాలు తగ్గించాలి
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆపం
  • కేబినెట్‌ భేటీలో సీఎం స్పష్టీకరణ
  • కొత్త పీఆర్సీకి కేబినెట్‌ ఆమోదం
  • ఉద్యోగులతో చర్చలకు కమిటీ
  • సభ్యులుగా బుగ్గన, బొత్స, పేర్ని
  • సీఎస్‌ సమీర్‌శర్మ, సజ్జల కూడా


సర్కారు వెనక్కి తగ్గలేదు. ఉద్యోగులు పిడికిలి సడలించలేదు. పీఆర్సీపై సమరం  తప్పని పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల నిరసనలను సర్కారు లెక్క చేయలేదు. పీఆర్సీ  జీవోలను శుక్రవారం కేబినెట్‌ ఆమోదించింది. అంతేకాదు...  ఉద్యోగులు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజల్లోకి వెళ్లి ఈ విషయం చెప్పాలని మంత్రులను సీఎం  ఆదేశించినట్లు తెలిసింది.  ఇక... ఉమ్మడి వేదికపైకి వచ్చిన ఉద్యోగ నేతలు ‘సమ్మె  సైరన్‌’ మోగించారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.


మంత్రులకు సీఎం జగన్‌ నిర్దేశం

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వేతన సవరణపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నదంతా అవాస్తవమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు వివరించాలని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. శుక్రవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాదాపు అరగంట పాటు పీఆర్‌సీకి సంబంధించిన 16 అంశాలపై మంత్రులకు ఆయన వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రమూ బాగోలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు గాడినపడకపోగా కేంద్రం నుంచి కూడా నిధుల కోత ఉందని చెప్పారు. 11వ వేతన సవరణతో జీతభత్యాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులూ చేస్తున్న ప్రచారమంతా అబద్ధమేనని.. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి శాశ్వత ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీలకు, హోం గార్డులకు, సచివాలయాల ఉద్యోగులకూ వేతనాలు పెంచుతూనే వస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించే టౌన్‌షిప్పుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 20 శాతం రాయితీకి స్థలాలివ్వాలని నిర్ణయించామన్నారు. 


ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని, దీనివల్ల రెండేళ్ల పాటు వారికి పూర్తి జీతభత్యాలు రావడంతోపాటు అదనంగా రెండు డీఏలు కలుస్తాయని.. ఇది పింఛనులోనూ కలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను ఖరారు చేశామన్నారు. హెచ్‌ఆర్‌ఏ పెంచితే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని చెప్పారు. అధికారం చేపట్టిన నాటి నుంచి నవరత్నాల పేరిట అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్నీ ఆపే ప్రసక్తే లేదన్నారు. నవరత్నాలను నిలిపివేస్తే రాజకీయంగా లబ్ధి పొందవచ్చని ప్రతిపక్షం భావిస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలోని ఏ ఒక్క పథకాన్ని నిలిపివేయడమో.. వాయిదా వేయడమో చేయనని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీపై చేస్తున్న రాద్ధాంతానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపైనే ఉందని జగన్‌ స్పష్టం చేశారు. పార్టీ క్రియాశీల సభ్యులు కూడా వేతన సవరణ గురించి వివరించాలని సూచించారు. ఏ పరిస్థితుల్లో వేతన సవరణపై ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు.


ఆ కేసులు ఇంకా తీసేయలేదేం?

విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసించినందుకు పోలీసులు కేసులు పెట్టారని.. ఆ కేసుల కోసం ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంకా కోర్టుల చుట్టూ తిరగడం అవమానంగా ఉందని మంత్రి పినిపే విశ్వరూప్‌ కేబినెట్‌ భేటీలో ప్రస్తావించారు. మరో మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకుని.. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా కాకినాడలో రైలు దహనం కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసినప్పటికీ.. ఇంకా ఆ కేసులను తొలగించలేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రత్యేక ఆర్థిక జోనళ్ల(ఎస్‌ఈజెడ్‌)లను నిరసిస్తూ వైసీపీ చేసిన ఆందోళనపైనా కేసులు నడుస్తున్నాయని కొందరు మంత్రులు తెలిపారు. దీంతో.. ఆ కేసులు ఎత్తివేయకపోవడం ఏమిటని సీఎం హోం శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ..

ఉద్యోగుల ఆందోళనను మంత్రులు కేబినెట్‌ భేటీలో ప్రస్తావించారు. వారిలో పీఆర్‌సీపై ఉన్న అపోహలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవ స్థితిగతులను వివరించేందుకు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపడానికి కమిటీ వేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇందులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న బుగ్గన విజయవాడకు వచ్చిన వెంటనే.. ఉద్యోగులతో చర్చల ప్రక్రియను ప్రారంభిస్తారని చెప్పారు.

Updated Date - 2022-01-22T09:05:05+05:30 IST