జనం మెచ్చిన గవర్నర్‌

ABN , First Publish Date - 2021-12-05T09:15:53+05:30 IST

పెడరసంగా వ్యవహరించే గవర్నర్‌లకు చుక్కలు చూపించడం తమిళనాడు దివంగత సీఎం జయలలిత తత్వం. అలాంటి అధినేత్రి నుంచీ మన్ననలు పొందిన ఘనత రోశయ్యకే దక్కింది. ఆమె హయాంలోనే ఆయన తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారు..

జనం మెచ్చిన గవర్నర్‌

  • ప్రజలకు చేరువగా రాజ్‌భవన్‌
  • కొరకరాని కొయ్య జయతోనూ కలిసిపోయిన స్నేహ వ్యక్తిత్వం


(చెన్నై-ఆంధ్రజ్యోతి) 

పెడరసంగా వ్యవహరించే గవర్నర్‌లకు చుక్కలు చూపించడం తమిళనాడు దివంగత సీఎం జయలలిత తత్వం. అలాంటి అధినేత్రి నుంచీ మన్ననలు పొందిన ఘనత రోశయ్యకే దక్కింది. ఆమె హయాంలోనే ఆయన తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయ నేపథ్యం నుంచి  వచ్చినవారు గవర్నర్లుగా త్వరగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తాం. ఇందుకు భిన్నంగా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా,  అటు అధికార పక్షానికీ, ఇటు ప్రతిపక్షానికీ సమ ప్రాధాన్యమిస్తూ, ‘నొప్పింపక - తానొవ్వక’ తరహాలో ఐదేళ్లపాటు గవర్నర్‌గా అందరి మన్ననలందుకున్నారు. తమిళనాడుకు ఆయన 13వ గవర్నర్‌ అయినప్పటికీ.. రాజ్‌భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన తొలి ‘ప్రజానేత’గా తమిళుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 2011 ఆగస్టు 31వ తేదీన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. 2016 ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగారు. మధ్యలో 2014 జూన్‌ 28 నుంచి అదే ఏడాది ఆగస్టు ఆగస్టు 31వ తేదీ వరకు కర్ణాటక తాత్కాలిక గవర్నర్‌గానూ వ్యవహరించారు. 


తొలి అడుగులోనే జయం

రాష్ట్రానికి కొత్తగా వచ్చే గవర్నర్‌లకు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం జయకు అలవాటు లేదు. కానీ తొలిసారిగా ఆమె గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు చెన్నై వచ్చిన రోశయ్యకు ముఖ్యమంత్రి హోదాలో విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికారు. అదే విధంగా గవర్నర్‌గా పదవీకాలం ముగిసి హైదరాబాద్‌ పయనమైనప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతూనే ఆమె స్వయంగా విమానాశ్రయానికి వచ్చి వీడ్కోలు పలికారు. నిజానికి డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం.. జయకు చెక్‌ పెట్టేందుకే రోశయ్యను గవర్నర్‌గా తమిళనాడు పంపిందంటూ అప్పట్లో పెద్దపెట్టున ప్రచారం జరిగింది. కానీ.. ‘గవర్నర్‌గా మీ పరిమితి మేరకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి’ అని సోనియా తనకు సూచించారని అప్పట్లోనే రోశయ్య ప్రకటించారు. అదే విషయం జయకు కూడా చెప్పారు.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రికే ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో, ఎలా చేయాలనే అధికారం ఉంటుందని, ఇందుకు తన వంతు సహకారం ఉంటుందే తప్ప, పాలనకు ఎలాంటి ఆటంకాలు సృష్టించబోనని కూడా ఆమెకు స్పష్టం చేశారు. అప్పటి నుంచి జయ... రోశయ్యను పూర్తిగా విశ్వసించడంతో పాటు ఆయనను పెద్దన్నగా భావించి తన వ్యక్తిగత విషయాలూ చర్చించేవారు. అదే విధంగా జయ-రోశయ్య సంయుక్తంగా పాల్గొనే కార్యక్రమాల్లో ఇద్దరికీ సమానంగానే బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసేవారు. 


అనధికార ఆర్థిక సలహాదారు...

జయలలిత 2011 మేలో సీఎం పీఠమెక్కిన మూడు నెలలకే రోశయ్య గవర్నర్‌గా తమిళనాడులో అడుగుపెట్టారు. జయ మూడోమారు ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఈ విషయంలో రోశయ్య.. ఆమెకు పలు కీలక సూచనలు చేసినట్లు అన్నాడీఎంకే వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. నాటి యూపీఏ ప్రభుత్వంతోనూ మాట్లాడి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు సహకరించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే నేతలు పలుమార్లు జయ ప్రభుత్వ పనితీరుపై రోశయ్యకు ఫిర్యాదులు చేశారు. డీఎంకే యూపీఏకు మిత్రపక్షం అయినా.. జయను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించలేదు. అంతమాత్రాన ఆయన అధికార పార్టీని వెనకేసుకొచ్చింది కూడా ఏమీ లేదు. అందుకే డీఎంకే సైతం రోశయ్యపై ఎలాంటి విమర్శలు చేయలేకపోయిందన్నది అందరి మాట!


ప్రజలకు చేరువగా

గవర్నర్‌గా రోశయ్య అడుగుపెట్టినప్పటి నుంచే రాజ్‌భవన్‌ ప్రజలకు చేరువైంది.  ‘ఏం జరిగినా మన గవర్నర్‌ ఉన్నారులే’ అన్న ధైర్యం తమిళనాడులోని తెలుగువారిలో నెలకొంది. ఢిల్లీలో ‘ఏపీ భవన్‌’ తరహాలో చెన్నైలోనూ ‘తెలుగు భవన్‌’ నిర్మించాలన్న డిమాండ్‌పై సైతం ఆయన జయను ఒప్పించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో లోపాలు, తగని స్థలం కేటాయించడం తదితరాలతో ఆ వ్యవహారం మధ్యలోనే నిలిచిపోయింది. 


చలం సమాధి సంరక్షణ 

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై తక్షణ చొరవ

తిరువణ్ణామలైలోని ప్రముఖ రచయిత చలం సమాధి.. గవర్నర్‌గా రోశయ్య తీసుకున్న శ్రద్ధతో తిరిగి ఉనికిని పొందింది. ఈ సమాధి రోడ్డు విస్తరణలో కనుమరుగైపోతోందంటూ ‘అరుణాచలంలో అనాఽథ చలం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లో కథనం ప్రచురించింది. రోశయ్య ఆగమేఘాలపై స్పందించారు. ఉన్నతాధికారులతో ఆయనే నేరుగా మాట్లాడి చలం సమాధి కనుమరుగుకాకుండా పరిరక్షించారు. తమిళనాట తెలుగు కనుమరుగైపోతోందన్న ఆందోళన అప్పట్లో బాగా కనిపించింది. ‘తెలుగు కనుమరుగు కాకుండా ఏదైనా చెయ్యమ్మా’ అని రోశయ్య జయకు చెప్పారు. దాంతో కొంతమంది తెలుగు ప్రముఖులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన జయ.. తెలుగు భాషాభివృద్ధి కోసంచర్యలు తీసుకోవాలంటూ నాడు తన వద్ద ఉన్న ఓ తెలుగు ఉన్నతాధికారిని ఆదేశించారు. కానీ ఆయన ఆ విషయాన్ని పక్కనబెట్టి.. ఆమెనే పక్కదోవ పట్టించినట్లు సమాచారం.


ఇలాంటి ఆధునికుడు లేడు: వైఎస్‌ 

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ వచ్చినపుడు ఆర్థిక మంత్రిగా ఎవర్ని నియమిస్తారని విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ఇంకెవరు రోశయ్య ఉన్నారు కదా అని వైఎస్‌ బదులిచ్చారు. ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలవుతున్న సమయంలో మీరు కూడా మన్మోహన్‌ సింగ్‌ లాంటి వారిని పెట్టుకోవాలి కదా, రోశయ్య మరీ పాతకాలం మనిషి కాదా అని అడిగితే వైఎస్‌ పెద్దగా నవ్వారు. ‘‘రోశయ్య కంటే ఆధునికుడు ఈ దేశంలోనే లేడు. ఆయన ఉంటేనే ఆర్థిక వ్యవస్థ అదుపులో ఉంటుంది’’ అని చెప్పారు. 

Updated Date - 2021-12-05T09:15:53+05:30 IST