మహిళా ఆర్ధిక స్వావలంబన కీలకం- గవర్నర్‌

ABN , First Publish Date - 2020-09-23T23:37:53+05:30 IST

మహిళలు ఆర్ధిక సాధికారత సాధించడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు.

మహిళా ఆర్ధిక స్వావలంబన కీలకం- గవర్నర్‌

హైదరాబాద్‌: మహిళలు ఆర్ధిక సాధికారత సాధించడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. బుధవారం రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు రెండు నెలలపాటు అందించనున్న స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌ కమ్యూనిటీహాల్‌లో గవర్నర్‌ ప్రారంభించారు. ఈస్వయం ఉపాధి శిక్షణను అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ ప్రిన్యూర్స్‌ఆఫ్‌ ఇండియా సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ మహిళలు సంపాదించిన ప్రతి పైసా కూడా కుటుంబ సంక్షేమానికి ఖర్చుపెడతారని, ఇది కుటుంబ అభివృద్దికి అత్యంత ఉపయోగమని అన్నారు. కోవిడ్‌ లాంటి సంక్షోభ సమయంలో కుటుంబాల ఆర్ధిక వనరులు ఇబ్బందులకు గురవుతున్నాయని, దీనికోసం తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ పొంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తమను తాము మలుచుకుని ఆర్ధిక స్వావలంబన, సాధికారత సాధించాలని సూచించారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ స్పూర్తితోనే రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలను భవిష్యత్‌ ఎంటర్‌ ప్రిన్యూర్స్‌గా ఎదగడానికి అవసరమైన లోన్‌లు, మార్కెటింగ్‌ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కాలనీల్లో, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో కూడా మహిళలకు, యువతకు స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు ఏర్పాటు చేయాలని గవర్నర్‌పిలుపునిచ్చారు. 


ఉద్యోగాల కోసం ఎదురుచేసే వారికంటే ఉద్యోగాలను సృష్టించే వారిగా యువతను తీర్చిదిద్దాలని గవర్నర్‌ సూచించారు. రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు మొదటి దశలో మొత్తం 31 మందికి మగ్గం వర్క్స్‌, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇస్తామని గరవ్నర్‌సెక్రటరీ సురేంద్ర మోహన్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-23T23:37:53+05:30 IST