సమస్యలే వేదికగా Governor పనితీరు..

ABN , First Publish Date - 2021-09-17T17:22:45+05:30 IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన మార్క్‌ పనితీరును చూపించేందుకు రెడీ అవుతున్నారా? గవర్నర్ అంటే రబ్బరు స్టాంప్ కాదు తాను కూడా ప్రజల సమస్యలు వినేందుకు ఉన్నానన్న భరోసా కల్పించేందుకు సంసిద్ధం అవుతున్నారా?

సమస్యలే వేదికగా Governor పనితీరు..

వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి తమిళిసై..

ఇబ్బందులు ఎదురవుతాయని టీఆర్ఎస్ ఆందోళన


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన మార్క్‌ పనితీరును చూపించేందుకు రెడీ అవుతున్నారా? గవర్నర్ అంటే రబ్బరు స్టాంప్ కాదు తాను కూడా ప్రజల సమస్యలు వినేందుకు ఉన్నానన్న భరోసా కల్పించేందుకు సంసిద్ధం అవుతున్నారా? త్వరలో రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారా? గవర్నర్‌ తమిళిసై చేపడుతున్న కార్యక్రమంపై అధికార టీఆర్ఎస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్‌ దిస్‌ స్టోరీ.


టీఆర్ఎస్‌పై బహిరంగంగానే విమర్శలు..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తన మార్క్‌ పనితీరును చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇక మీదట గవర్నర్ హోదాలో స్వయంగా ప్రజల నుండి ఆమె ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఇందుకోసం మరో వారం పది రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయనున్నాయి రాజ్ భవన్ వర్గాలు. గతంలో ఏ గవర్నర్ చేయని విధంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును.. ప్రజా సమస్యల వేదికగా చూపించాలని భావిస్తున్నారు. తెలంగాణ రెండవ గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు తమిళసై సౌందర రాజన్‌. ఇక పుదుచ్చేరి అదనపు గవర్నర్‌గా 2021 ఫిబ్రవరి 18న బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌గా ఆమె బాధ్యతలు తీసుకున్న మొదట్లో చాలా యాక్టివ్‌గా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద తనదైన రీతిలో విమర్శలు చేశారు.


టీఆర్ఎస్ తర్జనభర్జన..

ఇక కరోనా తీవ్రతను ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసిందని నేరుగా సీఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. "వైరస్‌ను అదుపు చేసే విషయంలో గట్టిగా పని చేయాలంటూ వైద్య నిపుణురాలిగా ఉన్న అనుభవంతో నేను మూడు నెలల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించా... వైరస్‌ వ్యాప్తి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఆరు, ఏడు లేఖలను రాశాను. రాష్ట్రంలో కరోనా తీవ్రతను నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలియజేశాను. పరీక్షల సంఖ్య పెంచాలని కోరినా స్పందించ లేదు" అని ఆమె ఓ దశలో అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. గవర్నర్ కావడంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందించాలనే అంశంపై తర్జనభర్జన పడ్డారు.


గవర్నర్‌కు ప్రతిపక్షాల మద్దతు..

అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్‌పై ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించొద్దంటూ గవర్నర్‌ను ఉద్దేశించి సైదిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే గవర్నర్‌పై బహిరంగ వ్యాఖ్యానాలు చేయొద్దంటూ టీఆర్ఎస్ అధిష్టానం నుండి సంకేతాలు రావడంతో.. వెంటనే సైదిరెడ్డి తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ అంశంలో గవర్నర్‌కు ప్రతి పక్షాలు సైతం మద్దతు తెలిపాయి.


గిరిజనుల సంక్షేమానికి కృషి..

గవర్నర్ తమిళసై.. గిరిజనులపై ప్రత్యేక చొరవ చూపి, అనేక కార్యక్రమాలు చేపట్టారు. నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఫర్ న్యూట్రీషన్ చేసిన సర్వేలో కొండరెడ్ల గర్భిణులకు, పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందటం లేదని, సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవని, సాధారణ ప్రజల్లాగే వారూ ఉండాలని.. జీవనంపై కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేశారు. ఆదిమ తెగలలో పౌష్టికాహార లోపం నివారించేందుకు దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో అవగాహన కార్యక్రమం కూడా గడిచినసారి నిర్వహించారు. దీంతోపాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీల వీసీల నియామకంలో సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.


ప్రజాదర్భార్ కార్యక్రమంపై చర్చ..

బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నాక.. టీఆర్ఎస్‌ ప్రభుత్వ విధానాలపై అనేకసార్లు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నరసింహన్ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఉన్నా... తమిళ సై వచ్చాక రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దూరదృష్టిలో భాగంగానే తమిళ సైకి గవర్నర్ బాధ్యతలు అప్పగించింది అనే చర్చ కూడా నడిచింది. మరోవైపు టీఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇవ్వాలని పీసీసీ కొత్త బాస్ రేవంత్‌రెడ్డి, బీజేపీ సారథి బండి సంజయ్‌, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, బీఎస్పీ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ స్వయంగా ప్రజా దర్బార్‌ నిర్వహిస్తే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు సంభవిస్తాయో అనే చర్చ మొదలైంది.


రూటు మార్చిన సీఎం..

నిజానికి మొన్నటివరకు మంత్రులకు , ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం నేరుగా రూట్ మార్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా గవర్నర్ తమిళసై ప్రజాదర్బార్‌ నిర్వహిస్తే అధికార పార్టీకి ఏమైనా చిక్కులు ఎదురవుతాయా అన్న సందేహాలు టీఆర్ఎస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2021-09-17T17:22:45+05:30 IST