వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానం: గవర్నర్ తమిళి

ABN , First Publish Date - 2021-10-08T00:08:55+05:30 IST

వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనాకు సమాధానమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.గురువారం గవర్నర్ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానం: గవర్నర్ తమిళి

నల్లగొండ: వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనాకు సమాధానమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.గురువారం గవర్నర్  నల్గొండ జిల్లా కేంద్రంలో పలు  కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని సింధూర ఆసుపత్రిలో కిడ్నీ కేర్, డయాలసిస్ సెంటర్లను ఆమె ప్రారంభించారు.అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో సెమినార్ హాల్ కు అదేవిధంగా బ్లడ్ కలెక్షన్, అంబులెన్స్ వాహనాన్ని ఆమె ప్రారంభించారు. పానుగల్లు లోని  ఛాయా సోమేశ్వర ఆలయంలో రాష్ట్ర గవర్నర్ ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి గవర్నర్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.  పురావస్తు శాఖ గైడ్ ఆలయానికి సంబంధించిన చరిత్రను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. 


ఈ సందర్భంగా సింధూర హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,  ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని,  పేదలకు అందుబాటులో మినిమమ్ రుసుముతో నాణ్యమైన వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా డాక్టర్లను కోరారు. ప్రస్తుత సమయంలో కిడ్నీ, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల సింధూర ఆసుపత్రి యజమాన్యం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, గైనకాలజిస్ట్ డాక్టర్ సింధూర లను ఆమె అభినందించారు. తమ కుటుంబంలో కూడా తాను గైనకాలజిస్ట్ గా, తన భర్త నెఫ్రాలజిస్ట్ గా వైద్య సేవలను అందించామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం కోసం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా  అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ ఒకటే సమాధానం అని,  ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అలాగే తప్పనిసరిగా మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.


ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ, 1958లో నల్లగొండలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ఏర్పాటు జరిగిందని,  దక్షిణ భారతదేశంలోనే  చాలా పాతదని, తన సేవల ద్వారా  ఎంతో మందికి ప్రాణదానం చేయడం జరిగిందని,  కోవిద్,  తుఫాను సమయాలలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. కోవిడ్ సమయంలో లక్షకు పైగా మాస్కులు, పళ్ళు, బలవర్ధకమైన ఆహారాన్ని వివిధ రూపాలో అందజేసిందని అభినందించారు. రక్తహీనత కలిగిన తలసేమియా వ్యాధి గ్రస్తులకు తన సేవలను అందించడం అభినందనీయమని అన్నారు.

Updated Date - 2021-10-08T00:08:55+05:30 IST