ఆరోగ్యరంగంలో ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు భారత్ కు అపార అవకాశాలు: గవర్నర్

ABN , First Publish Date - 2021-12-07T01:20:18+05:30 IST

హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలోనే ప్రబల శక్తిగా ఎదగడానికి భారతదేశానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

ఆరోగ్యరంగంలో ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు భారత్ కు అపార అవకాశాలు: గవర్నర్

హైదరాబాద్: హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలోనే ప్రబల శక్తిగా ఎదగడానికి భారతదేశానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.నిధులు, పెట్టుబడులు పెంచడం ద్వారా, కొత్త టెక్నాలజీల సమర్థవంతంగా వినియోగించడం, ప్రమాణాల పెంపు ద్వారా భారత్ ఆరోగ్య సంరక్షణ  రంగంలో గ్లోబల్ పవర్ హౌస్ గా ఎదగ వచ్చని గవర్నర్ స్పష్టం చేశారు.అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 65వ వ్యవస్థాపక దినోత్సవ ఉపన్యాసం ఈరోజు గవర్నర్ వర్చువల్ పద్ధతిలో ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ భారత ఫార్మసీ రంగం ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉందని, అయితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రిడియంట్స్ (ఏపిఐల) తయారీ లో స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు.అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ సేవలందించినప్పుడే మెడికల్ టూరిజం రంగంలో కూడా భారతదేశం మరింత ఎక్కువ మంది మెడికల్ టూరిస్టులను ఆకర్షించగలదని డాక్టర్ తమిళిసై వివరించారు.హెల్త్ కేర్ రంగంలో అగ్రగామిగా ఎదగాలంటే నవకల్పనలు, టెక్నాలజీ అనుసంధానం, మరిన్ని పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాల అభివృద్ధి అత్యంత కీలకమైన అంశాలని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.


ఈ దిశగా కాలానుగుణమైన నిర్దిష్ట లక్ష్యాలతో కూడిన బ్లూ ప్రింట్ తయారీ ఆవశ్యకతను గవర్నర్ వివరించారు.మెడికల్ కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్య పెంపుదల తోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించినప్పుడే మన దేశానికి ప్రపంచంలో విశిష్టమైన గుర్తింపు లభిస్తుందని గవర్నర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ నిర్మల బాఘ్చి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ కె. పద్మనాభయ్య , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 65వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-12-07T01:20:18+05:30 IST