Abn logo
Sep 26 2021 @ 02:39AM

అవగాహనతోనే కిడ్నీ సమస్యలు దూరం

నెఫ్రాలజిస్టులు ప్రజలకు అవగాహన కల్పించాలి: గవర్నర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ సంబంధిత సమస్యలకు మూల కారణాలను తెలుసుకొని, అవగాహన పెంచుకుంటే వాటిని దూరం చేయొచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాష్ట్రంలోని నెఫ్రాలజిస్టులు  కిడ్నీ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  హైదరాబాద్‌లో శనివారం జరిగిన కిడ్నీ వ్యాధి చికిత్సా నిపుణుల(నెఫ్రాలజిస్టుల) రజతోత్సవ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కిడ్నీ సంబంధిత రుగ్మతలు పెరుగుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


ఆరోగ్యవంతమైన కిడ్నీలకు అవసరమైన ఆహారాన్ని తీసుకోవాలని, క్రమం తప్పకుండా రక్తపోటును పరీక్షించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని  సూచించారు. నెఫ్రాలజిస్టు సంఘాలు కిడ్నీ వ్యాధుల చికిత్సా విధానంలో వస్తున్న కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఒక శాస్త్రీయ వేదికగా నిలవాలన్నారు.నెఫ్రాలజిస్టు అయిన తన భర్త డాక్టర్‌ పి.సౌందరరాజన్‌తో కలిసి చాలా నెఫ్రాలజీ సదస్సులకు హాజరయ్యాయని గుర్తు చేసుకున్నారు.  సీనియర్‌ నెఫ్రాలజిస్టులు కృష్ణన్‌, అనురాధారామన్‌,  గిరీష్‌ నారాయణ్‌, మనీషా సహాయ్‌, మంజూష ఎడ్ల తదితరులు పాల్గొన్నారు.