Abn logo
Oct 22 2021 @ 02:38AM

పోలీసు అమరవీరులకు గవర్నర్‌ నివాళి

కరోనాతో 62 మంది మృతి: మంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నివాళులర్పించారు. గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె నివాళులర్పించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత విధినిర్వహణలో ఒక్క పోలీస్‌ అధికారే మరణించారని తెలిపారు. పటిష్ఠమైన పోలీసింగ్‌ వల్లే శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల 62 మంది పోలీసులు మృతి చెందారని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు 15 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది  రక్తదానం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయంలో ఐజీ మహేష్‌ చంద్ర లడ్డా నివాళులర్పించారు.