2,550 మంది విదేశీ తబ్లీగీలపై పదేళ్ల నిషేధం

ABN , First Publish Date - 2020-06-05T07:51:45+05:30 IST

పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న తబ్లీగీ జమాత్‌ సభ్యులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించింది...

2,550 మంది విదేశీ తబ్లీగీలపై పదేళ్ల నిషేధం

న్యూఢిల్లీ, జూన్‌ 4: పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న తబ్లీగీ జమాత్‌ సభ్యులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. విదేశీయుల చట్టం-1946లోని సెక్షన్ల ప్రకారం 2,550 మంది విదేశీ తబ్లీగీలపై 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అంటే.. పదేళ్ల పాటు వారికి భారత్‌లోకి అనుమతి ఉండదు. ఎలాంటి వీసాలు లభించవు. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వీరంతా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, రష్యా, చైనా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్‌, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ తదితర 40 దేశాలకు చెందినవారు. 


ప్రధాని నరేంద్ర మోదీ కూడా లాక్‌డౌన్‌ల ప్రకటనల సందర్భంలో.. తబ్లీగీల కారణంగా దేశంలో కేసుల సంఖ్య పెరిగిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. హోంశాఖ వీసా నిబంధనల ఉల్లంఘనలను సీరియ్‌సగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విదేశీయులపై సుదీర్ఘకాలం నిషేధం విధించడం ఇదే మొదటిసారి. దీనికి తోడు.. దేశంలోని 20 రాష్ట్రాల్లో కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమవ్వడంతో.. వారిపై విపత్తుల నిర్వహణ చట్టం-2005 ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా.. వెయ్యి మందికి పైగా విదేశీ తబ్లీగీలు కొవిడ్‌-19 బారిన పడగా.. వారిలో 24 మంది మరణించారు.


Updated Date - 2020-06-05T07:51:45+05:30 IST