మరో రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-03-30T16:24:46+05:30 IST

తిరిగే కాలు... తిట్టే నోరు ఊరకే ఉండవన్నది సామెత. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎక్కడికక్కడే

మరో రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!

  • ఇక లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే 14 రోజుల క్వారంటైన్‌
  • కరోనాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వ యోచన 
  • మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం

బెంగళూరు : తిరిగే కాలు... తిట్టే నోరు ఊరకే ఉండవన్నది సామెత. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎక్కడికక్కడే నియంత్రించేందుకు 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి విదితమే. నిత్యావసర వస్తువుల కోసం, ఇతర అవసరాల కోసం రోడ్డపైకి జనం వస్తూనే ఉన్నారు. పోలీసులు లాఠీలను ప్రయోగిస్తూనే ఉన్నారు. ప్రైవేటు వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాను నిలిపేశారు. రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన సంతలకు వేలాది మంది ప్రజలు పోలోమని తరలివచ్చారు. 


లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కేసులు వేస్తామని అరెస్టు చేస్తామని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను సైతం కొందరు బేఖాతర్‌ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సమాయాత్తం అవుతోంది. పైగా రాష్ట్రంలో కరోనా మూడో దశకు ఇంకా చేరుకోకపోయినా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 4 వరకు అత్యంత జటిలమైన సమయమని వైద్యనిపుణులు సైతం హెచ్చరిస్తుండటంతో ఇక లాక్‌డౌన్‌ ఉల్లంఘనపై కొరడా ఝళిపించడమే ఉత్తమమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.  ప్రధాని మోదీ ఆదివారం చేసిన సూచన అనంతరం రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ, ఎస్పీలతోనూ ఆదివారం సిఎం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు.


లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని గుర్తించి వారిని కనీసం 14 రోజుల పాటు  ప్రత్యేక క్వారంటైన్‌లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్వారంటైన్లన్నీ పోలీసుల పర్యవేక్షణలో ఉండేలా చూస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి రాష్ట్రానికి ఇంతవరకు వచ్చిన 25వేల మందిలో  ఎక్కువ మంది క్వారంటైన్‌లకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో వైరస్‌ చాపకింద నీరులా విస్తరించిఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిని క్వారంటైన్‌లకు తరలించే అంశంపై ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2020-03-30T16:24:46+05:30 IST