నిరసన గళం

ABN , First Publish Date - 2022-01-27T07:49:31+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వానికి సద్భుద్ధి కలిగించాలని కోరారు.

నిరసన గళం

  • పీఆర్సీ జీవోల రద్దుకు ఉద్యోగుల డిమాండ్‌ 
  • అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ 
  • నువ్వేం ఆర్థిక మంత్రివయ్యా బుగ్గనా... 
  • మా ప్రాణం తీయడానికి!: బండి ఆగ్రహం 
  • ఉద్యోగులకు నష్టం కలిగించే నిర్ణయాలొద్దు 
  • కొత్త జిల్లాల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు 
  • అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు: బొప్పరాజు

 

(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌) 

రివర్స్‌ పీఆర్సీపై గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వానికి సద్భుద్ధి కలిగించాలని కోరారు. తమ హక్కుల కోసం నినదించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లా, తాలుకా, మండల కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ర్యాలీలుగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, వినతులు అందజేశారు. అనంతరం రోడ్లపై బైఠాయించి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రివర్స్‌ పీఆర్సీని రద్దు చేయాలని నినాదాలు చేశారు.


మా పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాం: బండి 

విజయవాడ ఆర్‌టీఏ ఆఫీసు ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించిన అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు సర్కారు తీరుపై భగ్గుమన్నారు. తన సహజత్వానికి భిన్నంగా కాస్త వెటకారాన్ని జోడించి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగులతో చప్పట్లను మోగించాయి. ‘మీరు చెప్పినట్టు విన్నాం... ఆడాం... ఇంకా ఆడితే మాకు బడితె పూజ చేస్తారు. మేము చెప్పినవి వినకుండా చర్చలకు రమ్మంటున్నారు. ఇప్పటివరకు ఏం సమన్వయం చేశారు? ఉద్యోగుల సమస్యలు వచ్చినపుడు ముందు అధికారుల కమిటీ వేస్తారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ వేస్తారు. చివరగా సీఎం దగ్గరకు తీసుకువెళతారు. అధికారులు చదువుకున్నారా? గాడిదలు కాస్తున్నారా? 27శాతం ఐఆర్‌ ఇస్తూ 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఏ విధంగా లెక్క గడతారు? జీతాలు పెంచామని చెబుతున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు లెక్కలు కడుతూ పేజీలు, పేజీలు చించుతున్నా పెరిగినట్టు తేలడం లేదు. మీకు జుట్టు పెరిగింది. మాకు మైండ్‌ పోతోంది. నువ్వేం ఆర్థికమంత్రి వయ్యా బుగ్గనా... మా ప్రాణం తీయడానికి! ప్రభుత్వాలు ఏవైనా సరే మాదగ్గర బస్తాలు ఉన్నాయి.


కొలుచుకోండి అంటాయా? కష్టాలు ఉన్నాయనే చెబుతాయి. మాకూ కష్టాలున్నాయి. మాకొచ్చే డబ్బులు తిండికే సరిపోతున్నాయి. పిల్లల దుస్తులు, స్కూలు ఫీజులు ఇలా అయిపోతున్నాయి. మా సంక్షేమం చూడాల్సింది ముఖ్యమంత్రే కదా? 6నెలల నుంచి దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బులు ఇవ్వటం లేదు. ఏడాదిగా ఏపీజీఎల్‌ఐ డబ్బు ఇవ్వటం లేదు. ఉద్యోగులకు దాదాపు రూ.2,200 కోట్లు ఇవ్వాలి. 5డీఏలు ఇవ్వాలి. ఇప్పుడా డీఏలు పెట్టి జీతాలు పెరిగాయంటారా? ఏం పెరిగాయి? మా కడుపు మంట మీకేం అర్థమవుతుంది. పీఆర్సీలో 4శాతం, హెచ్‌ఆర్‌ఏలో 12 శాతం తగ్గించారు. సీసీఏ రద్దు చేశారు. మా జీతం పెరిగిందా? తగ్గిందా? మేం అడగకుండానే 27శాతం ఇచ్చిన సీఎం ఇప్పుడు ఎంతో ఇస్తారని ఆశించాం. ఇవ్వకపోగా తగ్గించారు. ఉద్యోగులకు జరుగుతున్న నష్టాలపై ఆందోళనలకు దిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మా పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాం. నాయనా ఈ ప్రభుత్వానికి బుద్ధి కల్పించు అని అంబేద్కర్‌ను కోరా...’ అనడంతో ఉద్యోగులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. 


సమ్మె వరకే విధులు: బొప్పరాజు 

పీఆర్సీ జీవోల రద్దు కోసం ఉద్యమిస్తున్న సమయంలో కొత్త జిల్లాల అంశాన్ని తీసుకొచ్చి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ విషయంలో అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్నారు. కొత్త జిల్లాల ప్రక్రియ అంతా రెవెన్యూ ఉద్యోగులపైనే ప్రధానంగా నడుస్తుందని, ఆ శాఖ పరిధిలోని అధికారులు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, డిప్యూటీ కలెక్టర్లు ఇలా అందరూ సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. సమ్మెకు వెళ్లేవరకు మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి విధులు నిర్వహిస్తామన్నారు. ఐఏఎస్‌ అధికారులు తప్పితే అందరూ సమ్మెకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అతిపెద్ద కార్యక్రమాలు, రాజకీయ నిర్ణయాలను తీసుకువచ్చి ఒత్తిడి తీసుకురావడం తగదన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో ప్రత్యక్ష ఆందోళనలతో రెండు నెలలుగా ఉద్యోగులు నలిగి పోతున్నారని.. వీటిని పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలలో రావాల్సిన జీతాలు రాకుండా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమం దెబ్బతినేలా కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు రాకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని బొప్పరాజు వ్యాఖ్యానించారు.


పీఆర్సీ నివేదిక వివరాలివ్వండి

ఆర్టీఐ  ద్వారా ముప్పాళ్ల దరఖాస్తు

రాజమహేంద్రవరం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ నివేదికలోని వివరాలివ్వాలని కోరుతూ ఏపీ పౌరహక్కుల సంఘం (ఏపీ సీఎల్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అశుతోశ్‌ మిశ్రా కమిటీ రిపోర్టును, సీఎస్‌ కమిటీ పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని బుధవారం ఆయన డిమాండ్‌ చేశారు. పీఆర్సీకి సంబంధించిన వివిధ నివేదికలు, మొత్తం 12 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, మీటింగ్‌ మినిట్స్‌ కూడా ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీ కార్యాలయానికి దరఖాస్తు చేశానన్నారు. ఉద్యోగులపై సోషల్‌ మీడియాలో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులను, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ప్రభుత్వాన్ని ముప్పాళ్ల కోరారు. 

Updated Date - 2022-01-27T07:49:31+05:30 IST