మాస్క్‌.. మన ఇష్టమేనా?

ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST

కరోనాతో పాటే మన జీవితాల్లోకి మాస్క్‌ ప్రవేశించింది. మన నిత్యావసరాల్లో ఒక భాగమైపోయింది. చేతికి వాచీ, చేతిలో ఫోన్‌ లేకపోయినా... ముఖానికి మాస్క్‌ తప్పనిసరైపోయింది...

మాస్క్‌.. మన ఇష్టమేనా?

కరోనాతో పాటే మన జీవితాల్లోకి మాస్క్‌ ప్రవేశించింది. మన నిత్యావసరాల్లో ఒక భాగమైపోయింది. చేతికి వాచీ, చేతిలో ఫోన్‌ లేకపోయినా... ముఖానికి మాస్క్‌ తప్పనిసరైపోయింది. అసలు మనం మాస్క్‌ ఎందుకు వేసుకోవాలి? వీధుల్లోనూ, పని ప్రదేశాలలోనూ మాస్క్‌ ధరించకపోవడం నేరమా?


మనకే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల జీవితాల్లోనూ మాస్క్‌ ఇప్పుడు విడదీయరాని భాగం. మాస్క్‌ వేసుకోవడం వల్ల ఇవీ ప్రయోజనాలు:


  1. ఇన్‌ఫెక్షన్లు ఉన్న చాలామందిలో ఆ లక్షణాలు కనిపించవు. లేదా కొద్దిగా ఉంటాయి. తమకు ఇన్‌ఫెక్షన్‌ ఉందని కూడా వారికి తెలీదు. ఒక వ్యాధితో ఇన్ఫెక్షన్‌ వచ్చిన వ్యక్తి ఆ ఇన్‌ఫెక్షన్‌ను ఇతరులకు వ్యాప్తి చెయ్యకుండా ఉండడానికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి.
  2. మనం మాట్లాడుతున్నప్పుడూ, దగ్గుతున్నప్పుడూ, ముక్కు చీదుతున్నప్పుడూ, తుమ్మినప్పుడూ ద్రవాల తుంపరలు బయటికొచ్చి, గాలిలో వ్యాపిస్తాయి. మాస్క్‌ ధరిస్తే అవి బయటకు రావు. 
  3. ఇన్‌ఫెక్షన్‌ లేని వ్యక్తులు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తుంపరలు పడకుండా రక్షణనిస్తాయి. 
  4. కొందరికి ముక్కులో, నోటిలో తరచూ వేళ్ళు పెట్టుకొనే అలవాటు ఉంటుంది. వస్తువుల మీద కూడా కొద్ది సమయం పాటు వైరస్‌ ఉంటుంది. అలాంటి వాటిని ముట్టుకున్న తరువాత ముక్కులో, నోటిలో వేళ్ళు పెట్టుకున్నా, కళ్ళను రుద్దుకున్నా వైరస్‌ శరీరంలో ప్రవేశిస్తుంది. మాస్క్‌ వల్ల అలాంటి ప్రమాదం ఉండదు.  


ముప్పే కాదు, శిక్ష కూడా!

కరోనా నుంచి కాపాడుకోవడంలో మాస్క్‌ధారణ ముఖ్యపాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో, ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ వేసుకోవడాన్ని చాలా దేశాలు తప్పనిసరి చేశాయి. ఉల్లంఘించినవారికి జరిమానాలూ, ఇతర శిక్షలూ విధిస్తున్నాయి. 


కేంద్ర ప్రభుత్వం మే 19న మార్గదర్శకాలు జారీ చేస్తూ అన్ని కార్యాలయాల్లో, పని ప్రదేశాలలో మాస్క్‌ లేదా ఫేస్‌ కవర్‌ను తప్పనిసరి చేసింది. 

  1. మన దేశంలోనూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏప్రిల్‌ 15న ఆదేశాలు ఇచ్చింది. 
  2. అంతకుముందే, అంటే ఏప్రిల్‌ 8న, ముంబై నగరంలో మాస్కులను తప్పనిసరి చేశారు. దేశంలో మొదటిసారిగా ఇటువంటి ఆదేశాలు ఇచ్చిన నగరం అదే! దీన్ని ఉల్లంఘిస్తే ఐిపీసీ 188 సెక్షన్‌ కింద శిక్ష తప్పదని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.
  3. మాస్క్‌లు అందరికీ తప్పనిసరి కాదని కరోనా మొదట్లో చెబుతూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తరువాత తన ధోరణి మార్చుకుంది. ప్రతి ఒక్కరూ వస్త్రంతో చేసిన, వైద్యేతరమైన మాస్కులను బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించాలనీ, వాటికి కనీసం మూడు పొరలు ఉండాలనీ జూన్‌ మొదటి వారంలో సూచించింది.
  4. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో మాస్కులు ధరించని వారికి రూ. 100 నుంచి రూ. 5 వేల వరకూ జరిమానా నిర్ణయించారు.
  5. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో రూ. వెయ్యి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా రూ. వెయ్యి నుంచి రూ. వంద వరకూ జరిమానా విధిస్తామని ప్రకటించారు. 
  6. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఒక అధికారి మాస్క్‌ వేసుకోకపోగా, మాస్క్‌ ధరించాలని సూచించిన వికలాంగ ఉద్యోగినిపై అమానుషంగా దాడి చెయ్యడం చర్చనీయాంశమైంది. విశేషమేమిటంటే, మాస్క్‌ ధరించని పౌరులకు నెల్లూరు జిల్లాలోని అర్బన్‌ ప్రాంతాల్లో రూ. 200, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 100 పెనాల్టీ అమలులో ఉంది.  




Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST